
తూర్పు గోదావరి జిల్లలో శోభాయమానమై, సుభిక్షమై అలరారే ఆలమూరు కవి, పండిత, నట, గాయక, రచయితలకు నిలయం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన బ్రహ్మశ్రీ పురాణపండ రామ్ముర్తి గారు, అనేక వేద పండితులు పోలాప్రగడ, ఉషశ్రీ, నృశి౦హదేవర, చామర్తి, సుసర్ల, పోతుకూచి , పోరంకి వంటి ఉద్ధండ రచయితలు వెలసిన పుణ్యభూమి. గ్రామంలో నాలుగు చెరువులు ప్రజా అవసరాలకు నిండుగా నిలిచి పాడి పంటలతో గ్రామం విరాజిల్లడానికి కారణభూతం అయ్యాయి. గోదావరి నది నుండి ధవళేస్వరం వద్ద విడి వడిన పెద్ద కాలువ ఆదికవి నన్నయగారి నానాసూక్తినిధిని ఆలమూరు చెంతనే ప్రవహింపచేస్తోంది. శ్రీహరి స్వరూపులైన వైద్యులు జొన్నాడ డాక్టరుగారు, చలపతిరావుగారు వంటి వారు ప్రజారోగ్య పరీక్షలు, సేవలు అందించిన పునీత గ్రామం. భట్టి విక్రమార్క, జనార్ధన, ఆంజనేయ, షిర్డీ సాయి, సుబ్బరాయుడు, బంగారు పాప దేవాలయాలు భక్తికి సోపానాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ భవ్య వాతావరణంలో ఆ దివ్య మూర్తుల మధ్య జన్మించడం ఒక వరంగా భావిస్తున్నాను అంటారు సత్యవోలు సుందర సాయి గారు. సర్వమత , సర్వ కుల ఐక్యత ని౦డుగా నెలకొన్న మా ఆలమూరు సకల కళలకు పుట్టినిల్లు అంటారు అయన. ఒకప్పుడు ఆలము (యుద్ధము) జరిగిన ప్రదేశము కాబట్టి మాకు ఆవేశం సహజ లక్షణం అనేది కుడా వారి నోటి నుండి వచ్చే మాట.
సుందర సాయి గారు మీరు రచయితగా ఎప్పుడు మారేరు? ఆ సందర్భం ఏమిటి?
1976 వ సంవత్సరం నా జీవిత సమరహేల నన్ను రచయితగా మార్చింది. తండ్రిని కోల్పోయి బ్రతుకుతెరువు కోసం రోడ్డున పడిన నన్ను ఈ రచనా వ్యాసా౦గమే నన్ను మనిషిగా నిలిపింది. సమాజంలోని రుగ్మతలు ... వాటిని గమనించిన నాలో ఆవేశాన్ని కలిగించాయి. గుండె గుహలో గంపెడంత శోకాన్ని భరిస్తూ ... ఎగసి వచ్చే భావాలను అదిమి పెట్టలేక వాటిని వ్యక్తీకరించే క్రమంలో రచయిత నయ్యాను. కొందరి క్రౌర్యానికి పతితలుగా మారే యువతుల గాధలు స్వయముగా గమనించాను. అగాధాలు... వ్యధాపూరితాలు... వాటిని కధల రూపంలో మలిచాను. ఆ వ్యధా మూలాలను పాఠకులకు అందించాను. ఆ తర్వాత ఎన్నో సంఘటనలు నన్ను నిద్రపోనివ్వలేదు. అలజడిని, అశాంతిని కలిగించాయి. హృదయంలోని మధనం రచనలద్వారా బహిర్గతం అయింది.
మీ కుటుంబంలో మీ ముందు రచయితలు ఎవరైనా ఉన్నారా?
నా కుటుంబంలో రచయితలు లేరనే చెప్పాలి. కాని రచనలవైపు ఆసక్తిని పెంచిన వ్యక్తీ మా అన్నయ్య కేశవకుమార్. మా అమ్మగారు సీతాసుందరం బహుముఖ ప్రజ్గ్యశాలి . దాదాపు ఎనిమిది వందల పద్మాలు ఆమె నోటికి వచ్చేవి. రామాయణ, మహా భారతాలు బాగా చదివిన నా మాతృమూర్తి భగవద్గీతను, పోతనగారి భాగవతాన్ని క౦ఠొపాఠ౦గా చేసారు. ఆవిడ సాహిత్య సంస్కారం నాకు ఆమె ఆశీర్వాద ఫలితంగా లభించింది. సకల జనులు సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలనే ఆమె ఆకాంక్ష నన్ను ప్రజాప్రయోజనల లక్ష్యం వైపు మరల్చింది. నాన్నగారు, అమ్మ, సోదరుడు - ప్రస్తుతం నా పిల్లలు చి.శారద, శిరీష , ప్రదీప్. స్వాతి, శ్రీవల్లి అందరు నన్ను ప్రేమించే వారె. ఇంక ఎందరో స్నేహితులు నిత్యం నాకు కధాంశాలు అందిస్తూనే ఉన్నారు.
సాహిత్యం తో పరిచయం ఎలా ఏర్పడింది?
గ్రామమంతా సాహిత్య పరిమళం, కుటుంబంలో సంస్కార భావజాలం, పోలాప్రగడ, జీడిగుంటవారు ఆదర్శం. సాహిత్య సంపదకు ఇల్లే నిలయం. కవుల శతకాల జల్లు అమ్మ హృదయం. అందర్నీ అలరించే కధాగమనం సోదరుని నైజం. విలువైన విమర్శలకు నెలవు, ఒదిగిన వాక్ చాతుర్యం అన్ని అబ్బురమే - ఆశ్చర్య జనితమే. ఇల్లాలి అనునయం, ఉత్తేజ౦ కలిగించే పిల్లల ప్రవర్తనం, ఇక ఈ సాయికి సాహిత్యంతో పరిచయం సాధారణ అంశం.
ఇంతవరు మీరు ఎన్ని కధలు వ్రాసేరు? మీ మొదటి కధ ఏది?
రమారమి రెండు వందల దాక కధలు వ్రాసిన జ్జ్యాపకం. ఆరు నవలలు ముద్రితం అయ్యాయి. వంద కధలు మానవీయ విలువలకి సంభందించినవి. ఈనాడు ప్రతినిధిగా ప్రజా సమస్యలమీద ఐదేళ్లపాటు న్యూస్ బ్యూరో తరపున వందలాది ప్రజా సమస్యలపై పరిశోధనాత్మక నివేదికలు, ఆకాశవాణిలో నాటిక, రూపకం, కధా, కవిత, వార్త విశేషాలు అసంఖ్యాకంగా వ్రాశాను. ఇక దూరదర్శన్ - నా అభిమాన సంస్థ. ఎన్ని వ్రాశానో లెక్క వెయ్యలేదు. గత 27 వత్సారాలలో దాదాపుగా అన్ని విభాగాలలో పని చేశాను. నా కాగితం కలం దూరదర్శన్ కోసం వ్రాయడానికి తహతహ లాడతాయి. నా మొదటి కధా 1976 లో ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. ఆ కధా పేరు "రింగులు"
దూరదర్శన్ లో మీ భాద్యతలు ఎలా ఉన్నాయ్?
దూరదర్శన్ లో భాద్యతల కంటే అంకితభావం ముఖ్యం. అధికారం ఎలా మారిన నా వృతి ధర్మం - ప్రజా సంక్షేమం - అదే మూల సూత్రం. ప్రభుత్వ సంస్థలన్నీ ఒకేలా ఉంటాయి. మనుషులు .. మనస్తత్వాలు సర్వ సాధారణంగా అధికార పటాటోపాన్ని ప్రదర్సిస్తాయి. కొంచం అసహజమైనా వాటిని తట్టుకోవాలి. దూరదర్శన్ కార్యక్రమాల అవసరాల మేరకు మనసును స్వీయసంవిధనాన్ని మలచుకుంటూ ఓర్పుగా సాగడం అలవాటైంది.
రాష్ట్ర ప్రభుత్వం మీకు బంగారు నందిని బహుకరించింది కదా. వాటి వివరాలు చెపుతారా?
చెదలు అనే టెలిఫిలిమ్ - సామాజిక సంభందిత అంశం కేటగిరిలో ప్రధమ ఉత్తమ చిత్రంగా ఎంపిక అయింది . స్వర్ణ నందిని గెలుచుకుంది. దర్శకత్వానికి నాకు కూడా ఆ పురస్కారం లభించింది. "చెదలు" గురించి కొద్దిగా చెపుతాను. పంటను కాపాడుకొనే ప్రయత్నంలో ఒక బక్క రైతు దిక్కుతోచక చేసే అప్పులు, వాటి మీద వడ్డీలు, తద్వారా సమస్యలు ఇందులో పొ౦దుపరచారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దోపిడీ , కష్టానికి ఫలం లభించినా మార్కట్లో తృణమో ఫణమో ధరకు రాజీపడటం. ఇదే కధాంశం.
దూరదర్శన్లో కార్యక్రమాలు ఎలా ఉన్నాయ్? ఎలా ఉండాలని మీ అభిప్రాయం?
దూరదర్శన్లో కార్యక్రమాలు ఎప్పుడూ బాగుంటాయి. ఇతర చానళ్ళతో పోల్చడం సరి కాదు. ఎన్నో రుచులు ఉంటాయి. అన్నీ ఒకేలా ఉండవు. ఇది ప్రభుత్వ ఛానల్ . ప్రజా ప్రయోజనమే ధ్యేయం. సంచలనం, అవాస్తవం వంటి వాటికి దూరదర్శన్ దూరం. మా కార్యక్రమాలు ఇంకా మెరుగావ్వాలి. దానికి ప్రభుత్వ సంవిధానంలో మౌలిక మార్పులు జరగాలి.
టీవీ చానల్స్ లో మీకు నచ్చిన కార్యక్రమం ఏది?
నాకు నచ్చిన కార్యక్రమం, నచ్చని కార్యక్రమం అంటూ లేవు. అన్ని మంచి కార్యక్రమాలు నచ్చుతాయి.
మీకు నచ్చిన పుస్తకం వాటి వివరాలు చెపుతారా?
దేవరకొండ బాల గంగాధర్ తిలక్ కధల సంపుటి. మానవత్వ విలువలకు పెద్ద పీట వేసి సమాజంలోని సంకుచిత ధోరణులను ఎండగట్టి అద్భుత కధాగమనన్ని కనులముందుంచి రసవత్తరంగా కధా శిల్పాన్ని మలచి పాఠకుల హృదయాలను రాగ రంజితం చేసి సమాజ సర్వతోముఖ వికాసానికి సాహిత్యాన్నినిలిపి తెలుగు కధా వినీలాకాశంలో అద్భుతమైన అశాలను పండించి ఇది తెలుగు కధ, మన కధ, శభాష్ అనిపించి, అనేక సమాజహిత అంశాలను సృజించి కధలుగా రుపొందించి, మనకు అపురూపంగా అందించి , తెలుగు కధా చరిత్రలో సుస్థిరంగా నిలిచిన బాలగంగాధర్ తిలక్ కధలు మరపు రానివి.
సత్యవోలు వారికి ధన్యవాదాలు చెప్పి శెలవు తీసుకుంది సమీహ.
( అక్షర దోషాలుంటే మన్నించండి - సమీహ )