29, మార్చి 2009, ఆదివారం

మావాడి పరీక్షలు

ఆ రోజు నా మనసంతా అందోళనగా ఉంది. కారణం మా ఆఫీసరు నాకు లీవు ఇస్తాడో లేదో అని. రేపటినుండి మా అబ్బాయి కి పరీక్షలు. వాడిని దగ్గిర కూర్చొని చదివించాలి. వాడికి మంచి రాంక్ రావాలి లేకపోతే తరువాత చాలా ఇబ్బంది పడాలి. మావిడ మరీ మరీ చెప్పింది వాడి పరీక్షలు అయ్యేదాక శలవు పెట్టమని. నెమ్మదిగా లీవు లెటర్ పట్టుకొని మా ఆఫీసరు రూంలోకి వెళ్ళాను. మా ఆఫీసరు ఎప్పటిలాగానే కోపంగా ఏమిటన్నట్టు చూసాడు. నేను నెమ్మదిగా లీవు కావాలని అన్నాను. అదేమటండీ ఇది మార్చి నెల. అక్కౌంట్స్ అన్నీ మనం క్లోజ్ చేసుకోవాలి కదా. ఇలాటప్పుడు లీవు అంటే ఎలా . అసలే మీది బిల్లుల సీటు. మీరు పాసు చేయ్యల్సిన బిల్లులు కూడా చాలా ఉన్నాయి అన్నాడు. నిజమే సార్, కానీ ఇది మా అబ్బాయి జీవిత సమస్య. మా అబ్బాయి ఫైనల్ ఎగ్జాంస్. నేను వాడితోబాటు ఉండి చదివించాలి. లేకపోతే వాడి భవిష్యత్తు పాడవుతుంది అన్నాను. ఏమనుకున్నాడో ఏమో మొత్తానికి సరే అని లీవు గ్రాంట్ చేసాడు. అమ్మయ్య పెద్ద సమస్య తీరింది అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకున్నాను. మా వాడు పుస్తకాలు ముందు వేసుకొని దీర్ఘంగా అలోచిస్తున్నాడు. వాడికి ముందు ఎగ్జాంస్ అంటే భయం పొగొట్టాలని "చూడు నాన్నా పరీక్షలంటే భయపడక్కరలేదు. దానికి తగ్గ ప్రిపరేషన్ మనము చేసుకోవాలి.ఇంతకు ముందు నువ్వు చదివిన సిలబస్ అంతా మరోసారి మననం చేసుకుంటే చాలు. ఏ ప్రశ్న అడిగినా సులువుగా సమాధానం వ్రాయవచ్చు. నువ్వు బాగా చదవాలి, మంచి ఇంజనీరువవ్వాలి. సరేనా? వాడు తల ఊపాడు. మరుసటి రోజు సైన్స్ పేపర్. వాడితోబాటు మేమూ వాడు సిలబస్ అంతా చదివే వరకు మేము కూర్చొని ఉన్నాము. మధ్య మధ్యలో వాడికి హార్లిక్స్ అందిస్తూ ధైర్యం చెపుతూ ఉన్నాము. అలా పన్నెండువరకూ సాగింది. మరీ ఎక్కువసేపు మెలుకవగా ఉంటే పరీక్ష వ్రాయలేడని పడుకొబెట్టాము.మరలా ఉదయాన్నే ఐదు గంటలకు లేపి పరీక్షకు సిద్ధం చేసాం.వాడు ఎగ్జాం వ్రాసి వచ్చేదాకా టెన్షనే. ఎలా వ్రాసేడోనని. వచ్చేక అడిగితే క్వస్చన్ పేపర్ మొహాన పడేసాడు. వాడు పెట్టిన టిక్కులనిబట్టి అన్ని సమాధానలు వ్రాసాడని సంతృప్తి చెందాం . అలా వాడి ఎగ్జాంస్ జరిగినన్ని రోజులూ మాకు నిద్ర ఉండేది కాదు. వాడిదసలే అన్ని విషయాలని తేలికగా తేసుకొనే మనస్తత్వం. వాడికి జీవితం గురించి, భాద్యతలగురించి నేను చెపుతూ ఉండేవాడిని. వాడి ఎగ్జాంస్ పూర్తి అయ్యాయి. ఇక రిజల్ట్ తెలియాలి. నాకు టెన్షన్ మరీ పెరిగిపోతూంటే మావిడ దెబ్బలాడింది "వాడి ఎగ్జాంస్ గురించి మీ ఆరోగ్యం పాడుచేసుకుంటారా ఏమిటి" అని. ఇంతలో రిజల్ట్స్ వచ్చాయి. మా వాడిని ఒకటవ తరగతి నుండీ రెండవ తరగతికి ప్రమోట్ చేస్తున్నట్టు స్కూల్‌వాళ్ళు పంపిన లెటర్ చూసేకాగాని నాకు మనసు కుదుట పడలేదు.

3 కామెంట్‌లు: