15, ఫిబ్రవరి 2009, ఆదివారం

"మువ్వల సవ్వడి శైలజ" గారి తో పరిచయం

దూరదర్శన్ సప్తగిరి లొ మువ్వల సవ్వళ్ళు ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండీ కళాకారులు ఈ కార్యక్రమంలొ పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నరంటే ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత చెప్పకనే చెపుతోంది. కూచిపుడి భరతనాట్యం లాటి సాంప్రదాయ నృత్యాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం విశెషంగా ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం నంది అవార్డును కూడా అందుకుందీ అంటే ఆ ఖ్యాతి పూర్తిగా కార్యక్రమ నిర్మాత శ్రీమతి యార్లగడ్డ శైలజ గారిదే. శ్రీమతి యార్లగడ్డ శైలజ గారితొ పరిచయాన్ని సగర్వంగా సమర్పి స్తోంది సమీహ.
విజయవాడ నుండి తెనాలి వెళ్లే దారిలొ పచ్చని చెట్లు, బకింగ్ హొం కెనాల్ ప్రక్కన సారవంతమైన మెట్ట భూములున్న చిన్న అందమైన పల్లెటూరు గుడివాడ. అదే శైలజ గారి స్వగ్రామం. తండ్రి పిన్నక వేంకటేశ్వరరావు గారు ఆరోజుల్లొనే బిఎ.బియిడి చేసిన గ్రేడ్-1 తెలుగు పండిట్. నలుగురు అక్కచెళ్లెళ్లలలో శైలజ గారు చిన్న. ఒక అన్న గారు. అందరూ ఉన్నత విద్యలు అభ్యసించినవారే. తండ్రి ప్రభావం శైలజ గారి మీద చాలా ఉంది. తండ్రి యొక్క సాహితీ పాండిత్యం, తల్లి నుండి సంగీతాభిలాష శైలజ గారికి వచ్చాయి. త్రిపురనేని, నార్ల, విశ్వనాధ సత్యన్నారాయణ, ఇంకా ఇనేక బెంగాలీ నవలలు తండ్రి లైబ్రరీలో ఉండేవిట. వాటిని చదవమని శైలజ గారిని తండ్రి ప్రొత్సహించేవారుట. ఆడపిల్లలకు చదువులు చెప్పించని ఆ రోజులలోనే తండ్రి ఉన్నత భావాలవాలతొ ఆడపిల్లలని గుంటూరు మహిళా కళాశాలలొ చేర్పించారు. సాంఘీక సమానతలు అక్షరాలా పాటించే శైలజ గారి తండ్రి రచయిత, దర్శకులే కాక మంచి ఆదర్శ ఉపాధ్యాయులు కూడా.తండ్రి నుంచి అవే లక్షణాలు పుణికి పుచ్చుకున్నారు శైలజగారు.


దూరదర్శన్ లో మీ ప్రవేశం ఎలా జరిగిందని అడిగినప్పుడు " బి.ఎస్.సి(హొం సైన్స్) చేశాకా తెలుగు భాష మీద అభిమానంతొ భీమవరం డి.ఎన్.ఆర్ కాలేజ్ లొ ఎం.ఏ తెలుగు చేసాను. బాపట్ల రైతు శిక్షణా కేంద్రంలో డిమాన్స్ట్రేటర్ గా ఉద్యోగం వచ్చింది. మహిళా రైతులకు, రైతులకు పోషకాహారం గృహ విజ్గ్యానం గురించి వివరించడం. కాని కొద్దిగా అసంతౄప్తి. ఎక్కడ సాహితీ కార్యక్రమాలు జరుగుతున్నా వెడుతూ ఉండేదానిని. కొన్ని రేడియో కార్యక్రమాలలొ కూడా పాల్గొన్నాను. అలాంటి సమయంలొనే దూరదర్శన్ లొ ప్రొడ్యూసరు ఖాళీ కి దరఖాస్తు చేయడం ఆ ఉద్యోగం నాకు రావడం జరిగింది.రేడియో లాంటి సంస్థే దూరదర్శన్ కూడా కాబట్టి నేను దీనిలోచేరడం జరిగింది. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లొ శిక్షణ పూర్తయ్యాకా నాకు ఎంతో ఇష్టమైన సంస్థలోకి వచ్చిన అనుభూతి కలిగింది. "

మీ కార్యక్రమం మువ్వల సవ్వడి చప్పుళ్లు బాగా వినిపిస్తున్నాయి. వాటి విశేషాలేమిటి అంటే " మువ్వల సవ్వడి ... నిజానికి 24 సంవత్సరాల నా ఉద్యోగ విధులలో కొన్ని వందల కార్యక్రమాలకు నేను దర్శకత్వం వహించినా, మరెన్నొ కార్యక్రమాలు అవార్డులు తెచ్చిపెట్టినా ఇంత పేరు ప్రఖ్యాతులు మరే కార్యక్రమానికీ నాకు రాలేదని మనస్పూర్తిగా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇది శాస్త్రీయ నృత్యానికి సంభంధించిన ఒక చక్కని కాన్సెప్ట్ . అందుచేత దేశ విదేశాలలోని ప్రేక్షకులు ఆదరించారు. ఇంత స్పందన నేనుకూడా ఊహించనిది. మనిషికి శ్వాశ ఎంత అవసరమో ఒక జాతికి సంస్కృతి అంత అవసరం. అటువంటి సంస్కృతిని పెంపొందించేవి లలిత కళలు. ప్రపంచ చిత్ర పటంలో మన నాట్యానికి సమున్నతమైన స్థానం ఉంది. ఎంతో క్లిష్టమైన సకల కళల సమాహారమైన నాట్య కళకు ప్రాచుర్యాన్ని నాట్యశాశ్త్రం పట్ల సామాన్య ప్రేక్షకులకు కూడా అవగాహన కలిపించాలి.ఎంతో మంది యువ కళాకారులలొ ఉన్న నాట్య ప్రతిభను వెలికి తీయాలి అనే సత్సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇంత ఆదరణ పొందుతోందంటే సమాజంలో మన సంస్కృతిపట్ల ఉన్న ఆరాధన, నాట్యశాస్త్రం పట్ల ఉన్న అభిమానం ఆ నటరాజస్వామికి నీరాజనంగా అర్పిస్తున్నారు. నాట్య కళగురించిన విషయాలు, నాట్య కళకు తమ జీవితాల్ని ధార పోసిన మహానుభావులగురించి కుడా ఈ కార్యక్రమంలో చెపుతున్నాము."
ముందుగా ఈ కార్యక్రమానికి ప్రముఖ నాట్య కళాకారిణి శ్రీమతి శొభానాయుడును యాంకరుగా నిర్నయించారుట. ఆమెను సంప్రదించి కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ వివరించడం, ఆమె అంగీకారం ఐనతరువాతి రోజు ఆవిడ అదే కాన్సెప్ట్ తొ మరొక చానల్ లొకార్యక్రమాన్ని ప్రారంభించి విస్మయ పరిచేరుట. ఔరా!! కళా తపస్వి విశ్వనాధ్ గారు, సినారే, నాగేశ్వరరావుగారు, రోజారాణీ, కవిత ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా హాజరయ్యారు. కార్యక్రమం చూసిన విశ్వనాధ్‌గారు "వచ్చే జన్మలో ఆడపిల్లనై పుట్టి మువ్వల సవ్వడిలో నాట్యం చేయాలని ఉంది" అన్నారుట. దూరదర్శన్‌లో కార్యక్రమ నిర్మాణానికి ప్రొడ్యూసర్లకు పరిమితులేమైన ఉన్నాయా అన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక భాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగిగా మా పరిమితులేమిటొ మాకు తెలుసు. కుటుంబానికి ముఖ్యంగా డ్రాయింగ్ రూములొ ప్రధానమైన టీవిద్వారా కుటుంబంలోని వ్యక్తులంతా కలిసి వీక్షించగల కార్యక్రమాలు రూపొందించడానికి దూరదర్శన్‌లొ స్వేచ్హ ఎప్పుడూ ఉంటుంది. వివిధ చానళ్ల హోరులో కూడా దూరదర్శన్ తన ప్రతిష్టను పెంచుకోవడానికి వివిధ కార్యక్రమాల రూపకల్పనలో ప్రొత్సహించే మా డైరక్టర్ డా.పాలకుర్తి మధుసూదన రావుగారికి, ప్రతీ ఒక్కరికీ నా కృతజ్గ్నతలు తెలుపుకోవాలి అన్నారు శైలజ గారు. దూరదర్శన్ మరింత ప్రేక్షకాదరణ పొందాలంటే ఏమి చేయాలని ప్రశ్నిస్తే " దూరదర్శన్‌కి ప్రేక్షకాదరణ ఎప్పటికీ ఉంటుంది. సాహిత్యం, సంగీతం, వ్యవసాయం, జానపద కళారూపాలు, క్రీడలు, వంటివి అందిస్తున్నా యువత అభిరుచిననుసరించి కొత్త కార్యక్రమాలు రావాలి. గొప్ప గొప్ప సెట్టింగ్స్, ఆర్భాటాలు, హంగామా లేకున్నా కార్యక్రమాలని రూపొందించేవారికి ప్రభుత్వ పరంగా ప్రొత్సాహాకాలు అందించాలి ". మరి ఇతర కార్యక్రమ వివరాలు ఏమిటి అంటే మువ్వల సవ్వడిలో రెలిటివ్ స్పెషల్స్ మరింత ఆదరణ సాధించుకుంటే మారాకు తొడిగిన్ చిరుమువ్వల సవ్వడి ఇటీవల హైదరాబాదు విజయవాడల్లో సెలక్షన్లు జరిగాయి. ఇది మూసకట్టు కార్యక్రమమలా కాకుండా ప్రేక్షకులను మరింత దగ్గిరగా చేర్చుకుంటోంది. అలాగే శాశ్త్రీయ సంగీతం ఇతివృత్తంతో గాన గాంధర్వం, విన్నుత్న ప్రక్రియలో రైతే రాజు కార్యక్రమాలు చేస్తున్నాను అన్నారు శైలజ గారు. కార్యక్రమ నిర్మాణం అనేది కుడా ఒక కళ. ఆ కళలొ మీరు ఎంతవరకూసఫలీకృతం అయ్యారని మీరు అనుకుంటున్నారు అని అడిగితే నాకొచ్చిన పురస్కారాలే నేనెంత వరకు సఫలీకృతం అయ్యానో చెపుతాయి. 1984, 1985 సంవత్సరాలలొ రెండు సార్లు నంది అవార్డులు వచ్చాయి. రెండుసార్లు దూరదర్శన్ నేషనల్ అవార్డులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ భాషా పురస్కారం అవార్డు వచ్చింది.మువ్వల సవ్వడి్‌కి ఈ సంవత్సరం మరల నంది అవార్దు వచ్చింది.సిఎమెస్, న్యూ ఢిల్లీ నుండి అవార్డు వచ్చింది. ఇంకా స్వచ్చంద సంస్థలు అందించిన అవార్డులు ఎన్నో. మరి మీ కుటుంబ విషయాలేమిటి కుటుంబ పరంగా ఎలాంటి సహకారం లభిస్తోందని అడిగితే నా భర్త పేరు యార్లగడ్డ కుటుంబరావు. నాకొక కుమార్తె చిరంజీవి శరద్యుతి.మావారు మంచి సంస్కారి. వృత్తిపరంగా ఎనలిస్టిక్ కెమిస్ట్. ఆయన ప్రొత్సాహం లెకుంటే నేను కొన్ని వందల కార్యక్రమాలు రూపొందించగలిగేదానిని కాదు. పగలనకా రాత్రనకా రికార్డింగులు, ఎడిటింగులు చేస్తూ పోతున్నా ఏనాడూ పెదవి విప్పి ఒక పొల్లు మాట అనని మనిషి. ప్రతీ క్షణం నన్ను ప్రొత్సహిస్తూ నాకు ఒక గుర్తింపు రావాలని తపించే నా భర్త, అత్తవారింటి వైపునుండీ వచ్చే అప్యాయతానురాగాలూ ఈ జన్మకివి చాలు అనిపిస్తుంది. నా కూతురు శరద్యుతి భగవంతుడు నాకిచ్చిన ఒక వరం. నేను నేర్చుకోలేనివి ఏవైనా తనద్వారా తీర్చుకోవాలని ఎంతో ఆశ. గత ఆరు సంవత్సారాలుగా భరత నాట్యం నేర్చుకుంటోంది. రామంతాపూర్ పబ్లిక్ స్కూల్‌లొ చదువుకుంటోంది. నేను తనకోసం కాక ఆఫీసుకు కష్టపడుతూంటే చూసి ఆనందించేంత పెద్ద మనసున్న చిన్న తల్లి అన్నారు శైలజ గారు. ఎన్నొ అవార్డులు సొంతం చేసుకుని, ఒక ప్రభుత్వ సంస్థలొ అసిస్టంట్ డైరక్టర్ హోదాలో ఉన్న మహిళ తన భర్త, కూతురు విషయం వచ్చేసరికి ఒక ఇల్లాలిగా ఒక మాతృమూర్తిగా స్పందిచడం.......... ఇదే భారతీయ స్త్రీలు కుటుంబానికి ఇచ్చే గౌరవం... ఇది వారి గొప్పదనం. శైలజగారు మరెన్నొ ప్రేక్షకాదరణ పొందే కార్యక్రమాలు రూపొందించాలని కోరుకుంటూ.....అభినందనలతో సమీహ ..

1 కామెంట్‌:

  1. మువ్వల సవ్వడి ప్రోగ్రాం చాలా బాగుంతుంది .అప్పుడప్పుడు చూస్తుంటాము. మాకు కేబులు టీ వి లో సరిగా రాదు.

    రిప్లయితొలగించండి