19, జనవరి 2017, గురువారం

31, జనవరి 2011, సోమవారం

శాంతి స్వరూప్ గారికి పదవీవిరమణ శుభాకాంక్షలు!!


1974 లో దూరదర్శన్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై దూరదర్శన్‌లో ఒక ఐకాన్‌గా నిలబడి న్యూస్ రీడర్‌గా, పరిచయకర్తగా దూరదర్శన్ ప్రెక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలపరచుకున్న శ్రీ శాంతి స్వరూప్ నరసింహం ఈ రొజు పదవీ విరమణ చేయనున్నారు. 36 సంవత్సారలు తెలుగు ప్రేక్షకులను అలరించిన శాంతి స్వరూప్ నిన్న దూరదర్శన్‌లో వార్తలను చదివి ప్రేక్షకులకు వీడ్కోలు పలికారు. పదవీ విరమణ చేస్తున్న శాంతిస్వరూప్ గారికి శుభాకాంక్షలు తెలియ చేస్తోంది సమీహ. పదవీ విరమణ చేసినా దూరదర్శన్ వారి సేవలను వినియోగించుకుంటే బాగుడును. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వలని కోరుకుంటూ..!

2, జనవరి 2011, ఆదివారం

హైదరాబాద్ దూరదర్శన్ ప్రోగ్రాం హెడ్‌గా శ్రీమతి శైలజా సుమన్!!


మల్లాది శైలజా సుమన్..ఈ పేరు తెలియని దూరదర్శన్ ప్రేక్షకులు బహుశ ఉండరు. యాంకరుగా కార్యక్రమ నిర్మాతగా ఆమె దూరదర్శన్ ప్రేక్షకులకు సుపరిచితులు. ఇప్పటివరకు ఆకాశవాణి దూరదర్శన్ మార్కెటింగ్ విభాగ అధిపతిగా ఉన్న ఆమె హైదరాబాద్ దూరదర్శన్ ప్రోగ్రాం హెడ్‌గా పదవీ భాద్యతలు చేబట్టారు. కార్యక్రమ నిర్మాణంలో మంచి అభిరుచి నిపుణత కలిగిన శైలజగారి ఆధ్వర్యంలో దూరదర్శన్ మంచి కార్యక్రమాలను తెలుగు ప్రజలకు అందిస్తుందని అసిద్దాం. శైలజగారికి
అభినందనలతో ... . సమీహ!!

11, జూన్ 2010, శుక్రవారం

నిత్యనంద స్వామిని ఇంటర్వ్యూ చేసిన హైదరబాదు దూరదర్శన్

హైదరాబాదు దూరదర్శన్‌లో శాంతిస్వరూప్ నిత్యానంద స్వామిని ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూ వారి ఆశ్రమంలోనే 2009 సెప్టెంబర్ లో జరిగింది. మన స్వాములు జనాన్ని చక్కగా ప్రభావితం చేయగలరు. కానీ వారికీ కొన్ని బలహీనతలు ఉంటాయి(?) స్వాములైనా వారూ మనుషులేగదా!! ఇంటర్వ్యూ మాత్రం బాగుంది. చూడండి

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

6, జూన్ 2010, ఆదివారం

న్యూస్ రీడర్ శాంతిస్వరూప్‌తో ఒక రోజు...!!


ఆ రోజు ఉదయాన్నే శాంతిశ్వరూప్ గారికి ఫోన్ చేశాను."గుడ్మార్నింగ్ సర్" అన్నాను. "గుడ్‌మార్నింగ్ శ్రీను" అంటూ విష్ చేశారు. " మిమ్మల్ని కలవాలి" అన్నాను. "ప్రస్తుతం షటిల్ బాడ్మింటన్ ఆడుతున్నాను. పదిగంటలకు ఇంటికి రాకూడదూ" అన్నారు. "సరే పదిగంటలకు వస్తాను" అన్నాను. ఆయన షటిల్ బాడ్మెంటన్ బాగా ఆడతారు. ఆయనను చూసి రెచ్చిపోయి షటిల్ ఆడుతూ మోకాలుకు దెబ్బ తగిలించుకొని డాక్టర్ సలహామీద షటిల్ ఆడడం నేను మానివేశాను. ఆయన క్రమం తప్పకుండా రోజూ షటిల్ ఆడతారు. మన అలవాటు ప్రకారం గంట ఆలస్యంగా వారి ఇంటికి చేరుకున్నాను. హైదరాబాదులో రామంతాపూర్‌లోని టీవీ కోలనీలో ప్రస్తుతం వారి నివాసం. విశాలమైన ఇల్లు ఇంటిముందు రెండు కార్లు ఉన్నాయి. గేటు తీసి కొద్దిసేపు వేచి చూశాను, కుక్కలుగానీ ఉన్నాయేమోనని. నా అదృష్టంకొద్దీ లేవని మాలిగాబోలు చెప్పడంతో ధైర్యంగా లోపలికి అడుగుబెట్టాను. ఒక పెద్దావిడవచ్చి కూర్చోమని చెప్పి లోపలికి వెల్లింది. నేను వారి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను.

శాంతిశ్వరూప్ మొట్టమొదటి తెలుగు టీవీ న్యూస్ రీడర్. ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు వార్తలు చదివిన వ్యక్తి కూడా ఆయనొక్కరే. న్యూస్ రీడర్‌గా, వ్యఖ్యాతగా, యాంకర్‌గా ఆయన తెలుగువారందరికి సుపరిచితులు. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి. తెలుగు భాషమీద మక్కువ ఎక్కువ అనేది ఆయన మాటల్లోనే తెలుస్తుంది.

తెల్లని బట్టలలో చిరు ధరహాసంతో ఆయన వచ్చి కూర్చున్నారు. "చెప్పు శ్రీను ఏమిటి విశేషాలు?" అన్నారు. నా భ్లాగింగు గురించి ముందే వారికి చెప్పాను గాబట్టి నేరుగా "దూరదర్శన్‌లో మీరు ఎలా ప్రవేశించారు?" అని అడిగాను. "1974 లో నేను దూరదర్శన్‌లో ప్రవేశించాను. కానీ అంతకు ముందు నేను ఆకాశవాణీలో పనిచేస్తూ ఉండేవాడిని. 1970 నుండీ 1974 దాకా ఆకాశవాణిలో పనిచేశాను. ఆకాశవాణీలో ముందు క్యాజువల్ అనౌన్సర్‌గా పనిచేస్తూ ఉండేవాడిని. కొంతకాలానికి దానిలోనే న్యూస్‌రీల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అది ఒక సంవత్సరం చేసి కొన్ని కారణాలవల్ల రిజైన్ చేశాను. తరువాత దూరదర్శన్‌లో చేరాను. దూరదర్శన్‌కి రావడంలో నామితృడు శశిధర్ (ఎం.సి.వి.శశిధర్ ఆయన ఇప్పుడు లేరు) సహాయం చేశాడు. 1974లో దూరదర్శన్‌లో (సైట్ ద్వారా) విద్యా సంబంధ కార్యక్రమాలు చేసే వాళ్ళం. అవి అహమ్మదాబాదు నుండీ ప్రసారం అవుతూ ఉండేవి. అప్పట్లో ఇక్కడ దూరదర్శన్ కేంద్రం లేదు.1977 లో ఇక్కడ దూరదర్శన్ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పుడు నన్ను న్యూస్ రీడర్‌గా ఎంపిక చేశారుగానీ 1983 లో వార్తా ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. అప్పటినుండీ 2004 దాకా వార్తలు చదువుతూనే ఉన్నాను" అన్నారు.


"మీ శ్రిమతి రోజా రాణి్‌తో మీ వివాహం ఎలా జరిగింది?" అని అడిగాను."నేను చిక్కడపల్లిలో ఉండేవాడిని. మా స్నేహితులతో కలసి నాటకాలు రిహార్సల్స్ అవీ వేస్తూఉండేవాళ్ళం. మొదటిసారి ఆమెను చిక్కడపల్లి వెంకటేస్వర స్వామి గుడిదగ్గిర చూశాను. నేను ఆకాశవాణిలో రిజైన్ చేశాక కొంతకాలం రేడియోలో వచ్చే వ్యాపార ప్రకటనలకు వాయిస్ ఇచ్చేవాళ్ళం. అలాగే ఆమెకూడా వచ్చేది.ఆమె తన తండ్రిని వెంటబెట్టు వచ్చేది. ఏనాడు పలకరించలేదు. కానీ ఆమె నా స్నేహితుడి చెల్లెలని తరువాత తెలిసింది" అన్నారు నవ్వుతూ." 1964లో వచ్చిన తేన మనసులు సినిమాలో ఆమె బాలనటిగా చేసింది. 1979లో ఆమె దూరదర్శన్‌లో అనౌన్సరు గా చేరింది. 1980 ఆగస్టు 21న మా వివాహం జరిగింది". "మీ కుటుంబము గిరించి పిల్లలగురించి
చెప్పండి" అంటే " నేను పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. బీఎస్సీ చేశాక ఎమ్మె ఇంగ్లిష్ చేశాను. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు మేఘాంశ్ ఎమెస్(ఐఐటీ) చేసి ప్రస్తుతం లాస్‌వెగాస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవవాడు అవ్యయ. బెనరన్ హిందూ యూనివర్సిటీలో ఏం.టెక్ చేస్తున్నాడు"."దూరదర్శన్ ఒక్కటే ఉన్న రోజుల్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉండేదిగా" అంటే "నిజమే నన్ను అప్పటి హీరో ఎంటీఅర్ లాగ చూసేవాళ్ళు.దూరదర్శన్‌లో ప్రసారమైన కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో సర్వే చేయడానికి కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ ఊరిప్రజలంతా చూడడానికి వచ్చి నాకు కొన్ని విగ్జ్నాపన పత్రాలు ఇచ్చి ప్రభుత్వానికి అందచేయమనేవాళ్ళు. నేను చెపితే తమ పనులు అవుతాయని వారు నమ్మకంతో ఉండేవాళ్ళు. కొన్ని సభలకు అతిధిలుగా వెళ్ళడం ఆలస్యం అయినప్పుడు ఎందరో రాజకీయ నాయకులు కూడా మా కోసం వేచి ఉండేవాళ్ళు" అన్నారు నవ్వుతూ. "ప్రస్తుతం మీరు వార్తలు చదవడం లేదు కారణం ఏమిటి?" అంటే

"దూరదర్శన్ తీసుకున్న నిర్నయాలు కొన్ని, రోజా (భార్య) దీర్ఘకాల అనారోగ్యం కొంత వార్తలకు దూరం చేశాయి. ప్రస్తుతం నేను చేస్తున్న "ధర్మ సందేహాలు" కార్యక్రమం లో పెద్దలు మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారూ, కందాడై రామానుజాచార్య వంటి పెద్దల సమక్షంలో కూర్చోవడమే మహాద్భాగ్యంగా భావిస్తున్నాను". "మీరు కొన్ని నవలలు కూడా రాశారు కదా వాటివివరాలు ఏమిటి" అన్నాను.
"అవును నేను రాసిన మూడు నవలలు ఆంధ్రభూమిలో ధారావాహికలు గా వచ్చాయి. రాతిమేఘం అనే నవల భోపాల్ గ్యాస్ దుర్ఘటనమీద రాశాను. అలాగే క్రేజ్ అనే నవల క్రికెట్ మీద, అర్ధాగ్ని అనే నవల సతీ సహగమనానికి వ్యతిరేకంగానూ రాశాను. అలాగే కొన్ని కవితలు రాశాను, వాటిని నా మితృలు పుస్తకాలుగా ముద్రించారు." "మరి మీ రచనలు ఎందుకు ఆగిపోయాయి?" అని అడిగాను. "అప్పట్లో పత్రికలలో జరుగుతున్న కొన్ని సంఘటనలు నాకు నచ్చలేదు. నాకు ఆ వాతావరణము నచ్చలేదు. క్రమంగా వాటికి దూరమయ్యాను" అన్నారు. "ప్రస్తుతం టీవీ న్యూస్ రీడర్లు ఎలా ఉన్నారు?" "వాళ్ళు ఇంగ్లీష్ వాడకం తగ్గించాలి" అన్నారు."మీకు నచ్చిన న్యూస్ రీడర్?" "నేను అస్సలు టీవీ చూడను, పుస్తకాలు మాత్రం చదువుతాను"

వారి శ్రిమతి రోజారాణి గత సంవత్సరం కేన్సర్ వ్యాధినపడి మరణించడం దురదృష్టకరం. శాంతిస్వరూప్ ఎలాటి కార్యక్రమమైనా, ఏ విషయంపైనైనా, ఎక్స్పర్ట్ ఎవరైనా ముందస్తు ఏర్పాటు లేకుండా అప్పటికప్పుడు ఏకధాటిగా కార్యక్రమాన్ని నడుపగల దిట్ట. ఆవకాయ నుండి అంతరీక్ష విషయాలవరకు చర్చించగల గల వ్యక్తి. చానల్స్‌లో అంతటి అనుభవగ్జ్నులు లేరంటే అతిశయోక్తి కాదు.జనవరి 2011 లో ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. మరి మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి అంటే "రేపటి గురించి ఆలోచించే అలవాటు నాకు లేదు. ఎగసివచ్చే ప్రతీ అల తీరాన్ని ఆక్రమించాలని అనుకుంటుంది. కానీ కేవలం అది నురగగానే మిగిలి పోతుంది. జీవితం కూడా అంతే. ప్రతీదీ లిఖితమై ఉంటుంది. మనం నిమిత్తమాత్రులమే" అన్నారు శాంతిస్వరూప్. ఏదిఏమైనా ఎందరో తెలుగు ప్రజల మనసుల్లో ఒక స్థానాన్ని పదిలపరచుకున్న వ్యక్తి శాంతిస్వరూప్. వారి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ...
శాంతిస్వరూప్ గారికి అభినందనలతో ....సమీహ!!28, జూన్ 2009, ఆదివారం

16, మే 2009, శనివారం

రాజశేఖరుని పాచిక పారింది

జరిగిన ఎన్నికలలో ప్రతీ పార్టీ తెలంగాణా అంశంనుండి లబ్ది పొందాలనే చూసాయి. కర్ర విరగకుండా పాము చావకుండా తమపని కానిచ్చేయాలని అటు (టీఅరెస్‌తో చేరి) తెలుగు దేశం పార్టీ, ప్రత్యేక తెలంగాణా కోసమే జన్మించిన టీఆరెస్, విభజనకు(మధ్యస్తంగా) సరేనంటూ పీఅర్పి కుడా వంత పాడాయి. కాని ఎన్నికలఫలితాల సరళిని చూస్తే తెలంగాణ సమస్య ప్రజల సమస్య కాదని ఇది కేవలం ఒక రాజకీయ సమస్య మాత్రెమే అనిపిస్తొంది. మొదటినుండి తెలంగాణ విభజనకు సశామీరా అన్నది ఒక్క రాజశెఖర రెడ్డి మాత్రమే. అవినీతి పెరిగిపోయిందని ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకుందామని ప్రయితించిన చంద్ర బాబుకు ఒక్క విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. అదే తెలంగాణా అంశం. ప్రజలో వైయసార్ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా తెలంగాణా అంశం విషయంలో ఆయన (చంద్ర బాబు) అంచనాలు తారుమారయ్యాయి. టీఆరెస్‌తో పొత్తే ఇప్పుడు ఆయన కొంప ముంచింది.రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు అయ్యాక టీఆరెస్ ను కొంత దూరం పెట్టి ఉత్తరాంధ్రలో పర్యటించారు. వాగ్దానాలు గుప్పించారు. కానీ ప్రజలు ఆయన మాటలు నమ్మేరొ లేదో గానీ రాజసేఖర రెడ్డి మాత్రం గోదావరి జిల్లాలలో పర్యటిస్తూ ఒకే మాట అన్నారు. సమైఖ్య ఆంధ్ర కావాలెంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండని. లేకపోతే హైదరాబాదులో విదేశీయుల్లాగ జీవించాలని. హైదరాబాదులో కాలు పెట్టే అవకాశం ఇకముందు అక్కడివారికి ఉండదని. ఆ అంశాన్ని స్పష్టం చెయడంవల్ల ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ కు అనుకున్నదాని కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. పీఆర్పీకి స్థానం లేకుండా చేశాయి. తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ విషయంపై కాంగ్రెస్ లో మిగిలిన తెలంగాణా పెద్దలు గొల్లుమన్నారు. పార్టీ పూర్తిగా బ్రష్టు పడుతుందని డిల్లీ పెద్దలకు వార్నింగులు ఇచ్చారు. అలా తెలంగాణాను వెనకేసుకొచ్చిన పెద్దలు కూడా ఈ ఎన్నికలలో ఓడిపోవడం చూస్తే తెలంగాణా అనేది ప్రజా సమస్య కాదనే విషయం మరింత బలపడుతోంది. ప్రస్తుతం ఈ వ్యాసం వ్రాసే సమయానికి టీఅరెస్ అధినాయకుడు పురిటి నొప్పులు పడుతున్నారు. ఆయన నెగ్గుతారో లేదో కూడ తెలియని పరిస్తితి. ఇక పీఅర్పీ పరిస్తితి చెప్పనక్కర్లేదు. చిరంజీవి పాలకొల్లులో ఓడిపోవటం కూడా దీనిని బలపరుస్తొంది. కాబట్టి "రాజశేఖరా నీపై మోజుతీరలేదురా " అని మరో ఐదేళ్ళు పాడుకోవడమే.

15, మే 2009, శుక్రవారం

జ్యొతిష్య శాస్త్రంపై హేతువాదుల చాలెంజ్

ఈ ఎన్నికలలో ఏ పార్టీ విజేత అవుతుండో చెప్పగలరా అని కలకత్తాలో హేతువాదులు జ్యొతిష్యులను చాలెంజ్ చెసారట. జాతకాలనేవి వ్యక్తులకు ఉంటాయిగానీ పార్టీలకు కాదు. ఈరోజు టీవీలలో కనిపించే జాతక బ్రహ్మ్మలు విషయ పరిజ్గ్యానంకన్న డబ్బు సంపాదనలో పరిజ్గ్యానం ఉన్నవారే ఎక్కువ. నిజమైన పరిజ్గ్యానం ఉన్న వ్యక్తులు వారిచ్చే డబ్బులకు జాతకాలు చెప్పరు. వీరు చేసే బోడి చాలెంజ్‌లకు సరే అనరు. మా వూరిలో (అనగానే కహానీ అనుకోకండి) ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన జీవనం మావూరి సత్రంలోనే. ఆయనను అందరూ సత్రవు వెంకన్న గారూ అనేవారు. ఆయన దగ్గరకు వెళ్ళిన వ్యక్తి ఆయనకి సమస్య చెప్పనవసరం లేదు. జ్యొతిష్య శాస్త్రం ప్రకారం వచ్చిన వారు ఎవరిగురించి ఏ సమస్యతో వచ్చరో చెప్పి ఆయనే మనం ఎదుర్కొంటున్న సమస్యకి ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పేవాడు. ఆయనకి వొంటిమీద చిన్న అంగవస్త్రం తప్ప మరేమి కట్టుకోవడానికి కుడా ఉండేది కాదు. సత్రవులో కుటుంబంతో జీవనం. ఆయనదగ్గరకు వెళ్ళినవళ్ళు రూపాయో రెండో ఇస్తే దానితోనె జీవించేవాడు. సరస్వతి కటాక్షం ఉందిగాని లక్ష్మీ కటాక్షం లేదని ఊరిలో అందరూ అనుకొనేవారు. ఇలాంటి విషయాలలో వితండ వాదం చెసేవారిని సమాధాన పరచలేము. జ్యొతిష్యం నిజమైన శాస్త్రం. ఎటొచ్చిదానిలో పూర్తి విషయజ్గ్యానం ఉన్నవాళ్ళు లేరు (తక్కువ). గాలి కంటికి కనిపించదని గాలి లేదని అనడం లాంటిదే జ్యొతిష్య శాస్త్రం కూడ అబద్ధం అనడం. ఇదికూడా హేతువాదులు వారి పబ్లిసిటీకోసం చెసే ఒక తంతు. ఎవరు గెలుస్తారోనని వారి సందేహం తీర్చుకోవాడానికి కుడా కావచ్చు. :)


6, ఏప్రిల్ 2009, సోమవారం

ఎలక్షన్ హామీలు - ఒక కార్టూన్


29, మార్చి 2009, ఆదివారం

మావాడి పరీక్షలు

ఆ రోజు నా మనసంతా అందోళనగా ఉంది. కారణం మా ఆఫీసరు నాకు లీవు ఇస్తాడో లేదో అని. రేపటినుండి మా అబ్బాయి కి పరీక్షలు. వాడిని దగ్గిర కూర్చొని చదివించాలి. వాడికి మంచి రాంక్ రావాలి లేకపోతే తరువాత చాలా ఇబ్బంది పడాలి. మావిడ మరీ మరీ చెప్పింది వాడి పరీక్షలు అయ్యేదాక శలవు పెట్టమని. నెమ్మదిగా లీవు లెటర్ పట్టుకొని మా ఆఫీసరు రూంలోకి వెళ్ళాను. మా ఆఫీసరు ఎప్పటిలాగానే కోపంగా ఏమిటన్నట్టు చూసాడు. నేను నెమ్మదిగా లీవు కావాలని అన్నాను. అదేమటండీ ఇది మార్చి నెల. అక్కౌంట్స్ అన్నీ మనం క్లోజ్ చేసుకోవాలి కదా. ఇలాటప్పుడు లీవు అంటే ఎలా . అసలే మీది బిల్లుల సీటు. మీరు పాసు చేయ్యల్సిన బిల్లులు కూడా చాలా ఉన్నాయి అన్నాడు. నిజమే సార్, కానీ ఇది మా అబ్బాయి జీవిత సమస్య. మా అబ్బాయి ఫైనల్ ఎగ్జాంస్. నేను వాడితోబాటు ఉండి చదివించాలి. లేకపోతే వాడి భవిష్యత్తు పాడవుతుంది అన్నాను. ఏమనుకున్నాడో ఏమో మొత్తానికి సరే అని లీవు గ్రాంట్ చేసాడు. అమ్మయ్య పెద్ద సమస్య తీరింది అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకున్నాను. మా వాడు పుస్తకాలు ముందు వేసుకొని దీర్ఘంగా అలోచిస్తున్నాడు. వాడికి ముందు ఎగ్జాంస్ అంటే భయం పొగొట్టాలని "చూడు నాన్నా పరీక్షలంటే భయపడక్కరలేదు. దానికి తగ్గ ప్రిపరేషన్ మనము చేసుకోవాలి.ఇంతకు ముందు నువ్వు చదివిన సిలబస్ అంతా మరోసారి మననం చేసుకుంటే చాలు. ఏ ప్రశ్న అడిగినా సులువుగా సమాధానం వ్రాయవచ్చు. నువ్వు బాగా చదవాలి, మంచి ఇంజనీరువవ్వాలి. సరేనా? వాడు తల ఊపాడు. మరుసటి రోజు సైన్స్ పేపర్. వాడితోబాటు మేమూ వాడు సిలబస్ అంతా చదివే వరకు మేము కూర్చొని ఉన్నాము. మధ్య మధ్యలో వాడికి హార్లిక్స్ అందిస్తూ ధైర్యం చెపుతూ ఉన్నాము. అలా పన్నెండువరకూ సాగింది. మరీ ఎక్కువసేపు మెలుకవగా ఉంటే పరీక్ష వ్రాయలేడని పడుకొబెట్టాము.మరలా ఉదయాన్నే ఐదు గంటలకు లేపి పరీక్షకు సిద్ధం చేసాం.వాడు ఎగ్జాం వ్రాసి వచ్చేదాకా టెన్షనే. ఎలా వ్రాసేడోనని. వచ్చేక అడిగితే క్వస్చన్ పేపర్ మొహాన పడేసాడు. వాడు పెట్టిన టిక్కులనిబట్టి అన్ని సమాధానలు వ్రాసాడని సంతృప్తి చెందాం . అలా వాడి ఎగ్జాంస్ జరిగినన్ని రోజులూ మాకు నిద్ర ఉండేది కాదు. వాడిదసలే అన్ని విషయాలని తేలికగా తేసుకొనే మనస్తత్వం. వాడికి జీవితం గురించి, భాద్యతలగురించి నేను చెపుతూ ఉండేవాడిని. వాడి ఎగ్జాంస్ పూర్తి అయ్యాయి. ఇక రిజల్ట్ తెలియాలి. నాకు టెన్షన్ మరీ పెరిగిపోతూంటే మావిడ దెబ్బలాడింది "వాడి ఎగ్జాంస్ గురించి మీ ఆరోగ్యం పాడుచేసుకుంటారా ఏమిటి" అని. ఇంతలో రిజల్ట్స్ వచ్చాయి. మా వాడిని ఒకటవ తరగతి నుండీ రెండవ తరగతికి ప్రమోట్ చేస్తున్నట్టు స్కూల్‌వాళ్ళు పంపిన లెటర్ చూసేకాగాని నాకు మనసు కుదుట పడలేదు.