
ఆ రోజు ఉదయాన్నే శాంతిశ్వరూప్ గారికి ఫోన్ చేశాను."గుడ్‌మార్నింగ్ సర్" అన్నాను. "గుడ్‌మార్నింగ్ శ్రీను" అంటూ విష్ చేశారు. " మిమ్మల్ని కలవాలి" అన్నాను. "ప్రస్తుతం షటిల్ బాడ్మింటన్ ఆడుతున్నాను. పదిగంటలకు ఇంటికి రాకూడదూ" అన్నారు. "సరే పదిగంటలకు వస్తాను" అన్నాను. ఆయన షటిల్ బాడ్మెంటన్ బాగా ఆడతారు. ఆయనను చూసి రెచ్చిపోయి షటిల్ ఆడుతూ మోకాలుకు దెబ్బ తగిలించుకొని డాక్టర్ సలహామీద షటిల్ ఆడడం నేను మానివేశాను. ఆయన క్రమం తప్పకుండా రోజూ షటిల్ ఆడతారు. మన అలవాటు ప్రకారం గంట ఆలస్యంగా వారి ఇంటికి చేరుకున్నాను. హైదరాబాదులో రామంతాపూర్‌లోని టీవీ కోలనీలో ప్రస్తుతం వారి నివాసం. విశాలమైన ఇల్లు ఇంటిముందు రెండు కార్లు ఉన్నాయి. గేటు తీసి కొద్దిసేపు వేచి చూశాను, కుక్కలుగానీ ఉన్నాయేమోనని. నా అదృష్టంకొద్దీ లేవని మాలిగాబోలు చెప్పడంతో ధైర్యంగా లోపలికి అడుగుబెట్టాను. ఒక పెద్దావిడవచ్చి కూర్చోమని చెప్పి లోపలికి వెల్లింది. నేను వారి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను.
శాంతిశ్వరూప్ మొట్టమొదటి తెలుగు టీవీ న్యూస్ రీడర్. ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు వార్తలు చదివిన వ్యక్తి కూడా ఆయనొక్కరే. న్యూస్ రీడర్‌గా, వ్యఖ్యాతగా, యాంకర్‌గా ఆయన తెలుగువారందరికి సుపరిచితులు. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి. తెలుగు భాషమీద మక్కువ ఎక్కువ అనేది ఆయన మాటల్లోనే తెలుస్తుంది.
తెల్లని బట్టలలో చిరు ధరహాసంతో ఆయన వచ్చి కూర్చున్నారు. "చెప్పు శ్రీను ఏమిటి విశేషాలు?" అన్నారు. నా భ్లాగింగు గురించి ముందే వారికి చెప్పాను గాబట్టి నేరుగా "దూరదర్శన్‌లో మీరు ఎలా ప్రవేశించారు?" అని అడిగాను. "1974 లో నేను దూరదర్శన్‌లో ప్రవేశించాను. కానీ అంతకు ముందు నేను ఆకాశవాణీలో పనిచేస్తూ ఉండేవాడిని. 1970 నుండీ 1974 దాకా ఆకాశవాణిలో పనిచేశాను. ఆకాశవాణీలో ముందు క్యాజువల్ అనౌన్సర్‌గా పనిచేస్తూ ఉండేవాడిని. కొంతకాలానికి దానిలోనే న్యూస్‌రీల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అది ఒక సంవత్సరం చేసి కొన్ని కారణాలవల్ల రిజైన్ చేశాను. తరువాత దూరదర్శన్‌లో చేరాను. దూరదర్శన్‌కి రావడంలో నామితృడు శశిధర్ (ఎం.సి.వి.శశిధర్ ఆయన ఇప్పుడు లేరు) సహాయం చేశాడు. 1974లో దూరదర్శన్‌లో (సైట్ ద్వారా) విద్యా సంబంధ కార్యక్రమాలు చేసే వాళ్ళం. అవి అహమ్మదాబాదు నుండీ ప్రసారం అవుతూ ఉండేవి. అప్పట్లో ఇక్కడ దూరదర్శన్ కేంద్రం లేదు.1977 లో ఇక్కడ దూరదర్శన్ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పుడు నన్ను న్యూస్ రీడర్‌గా ఎంపిక చేశారుగానీ 1983 లో వార్తా ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. అప్పటినుండీ 2004 దాకా వార్తలు చదువుతూనే ఉన్నాను" అన్నారు.

"మీ శ్రిమతి రోజా రాణి్‌తో మీ వివాహం ఎలా జరిగింది?" అని అడిగాను."నేను చిక్కడపల్లిలో ఉండేవాడిని. మా స్నేహితులతో కలసి నాటకాలు రిహార్సల్స్ అవీ వేస్తూఉండేవాళ్ళం. మొదటిసారి ఆమెను చిక్కడపల్లి వెంకటేస్వర స్వామి గుడిదగ్గిర చూశాను. నేను ఆకాశవాణిలో రిజైన్ చేశాక కొంతకాలం రేడియోలో వచ్చే వ్యాపార ప్రకటనలకు వాయిస్ ఇచ్చేవాళ్ళం. అలాగే ఆమెకూడా వచ్చేది.ఆమె తన తండ్రిని వెంటబెట్టు వచ్చేది. ఏనాడు పలకరించలేదు. కానీ ఆమె నా స్నేహితుడి చెల్లెలని తరువాత తెలిసింది" అన్నారు నవ్వుతూ." 1964లో వచ్చిన తేన మనసులు సినిమాలో ఆమె బాలనటిగా చేసింది. 1979లో ఆమె దూరదర్శన్‌లో అనౌన్సరు గా చేరింది. 1980 ఆగస్టు 21న మా వివాహం జరిగింది". "మీ కుటుంబము గిరించి పిల్లలగురించి
చెప్పండి" అంటే " నేను పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. బీఎస్సీ చేశాక ఎమ్మె ఇంగ్లిష్ చేశాను. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు మేఘాంశ్ ఎమెస్(ఐఐటీ) చేసి ప్రస్తుతం లాస్‌వెగాస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవవాడు అవ్యయ. బెనరన్ హిందూ యూనివర్సిటీలో ఏం.టెక్ చేస్తున్నాడు"."దూరదర్శన్ ఒక్కటే ఉన్న రోజుల్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉండేదిగా" అంటే "నిజమే నన్ను అప్పటి హీరో ఎంటీఅర్ లాగ చూసేవాళ్ళు.దూరదర్శన్‌లో ప్రసారమైన కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో సర్వే చేయడానికి కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ ఊరిప్రజలంతా చూడడానికి వచ్చి నాకు కొన్ని విగ్జ్నాపన పత్రాలు ఇచ్చి ప్రభుత్వానికి అందచేయమనేవాళ్ళు. నేను చెపితే తమ పనులు అవుతాయని వారు నమ్మకంతో ఉండేవాళ్ళు. కొన్ని సభలకు అతిధిలుగా వెళ్ళడం ఆలస్యం అయినప్పుడు ఎందరో రాజకీయ నాయకులు కూడా మా కోసం వేచి ఉండేవాళ్ళు" అన్నారు నవ్వుతూ. "ప్రస్తుతం మీరు వార్తలు చదవడం లేదు కారణం ఏమిటి?" అంటే

"దూరదర్శన్ తీసుకున్న నిర్నయాలు కొన్ని, రోజా (భార్య) దీర్ఘకాల అనారోగ్యం కొంత వార్తలకు దూరం చేశాయి. ప్రస్తుతం నేను చేస్తున్న "ధర్మ సందేహాలు" కార్యక్రమం లో పెద్దలు మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారూ, కందాడై రామానుజాచార్య వంటి పెద్దల సమక్షంలో కూర్చోవడమే మహాద్భాగ్యంగా భావిస్తున్నాను". "మీరు కొన్ని నవలలు కూడా రాశారు కదా వాటివివరాలు ఏమిటి" అన్నాను.
"అవును నేను రాసిన మూడు నవలలు ఆంధ్రభూమిలో ధారావాహికలు గా వచ్చాయి. రాతిమేఘం అనే నవల భోపాల్ గ్యాస్ దుర్ఘటనమీద రాశాను. అలాగే క్రేజ్ అనే నవల క్రికెట్ మీద, అర్ధాగ్ని అనే నవల సతీ సహగమనానికి వ్యతిరేకంగానూ రాశాను. అలాగే కొన్ని కవితలు రాశాను, వాటిని నా మితృలు పుస్తకాలుగా ముద్రించారు." "మరి మీ రచనలు ఎందుకు ఆగిపోయాయి?" అని అడిగాను. "అప్పట్లో పత్రికలలో జరుగుతున్న కొన్ని సంఘటనలు నాకు నచ్చలేదు. నాకు ఆ వాతావరణము నచ్చలేదు. క్రమంగా వాటికి దూరమయ్యాను" అన్నారు. "ప్రస్తుతం టీవీ న్యూస్ రీడర్లు ఎలా ఉన్నారు?" "వాళ్ళు ఇంగ్లీష్ వాడకం తగ్గించాలి" అన్నారు."మీకు నచ్చిన న్యూస్ రీడర్?" "నేను అస్సలు టీవీ చూడను, పుస్తకాలు మాత్రం చదువుతాను"
వారి శ్రిమతి రోజారాణి గత సంవత్సరం కేన్సర్ వ్యాధినపడి మరణించడం దురదృష్టకరం. శాంతిస్వరూప్ ఎలాటి కార్యక్రమమైనా, ఏ విషయంపైనైనా, ఎక్స్పర్ట్ ఎవరైనా ముందస్తు ఏర్పాటు లేకుండా అప్పటికప్పుడు ఏకధాటిగా కార్యక్రమాన్ని నడుపగల దిట్ట. ఆవకాయ నుండి అంతరీక్ష విషయాలవరకు చర్చించగల గల వ్యక్తి. చానల్స్‌లో అంతటి అనుభవగ్జ్నులు లేరంటే అతిశయోక్తి కాదు.జనవరి 2011 లో ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. మరి మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి అంటే "రేపటి గురించి ఆలోచించే అలవాటు నాకు లేదు. ఎగసివచ్చే ప్రతీ అల తీరాన్ని ఆక్రమించాలని అనుకుంటుంది. కానీ కేవలం అది నురగగానే మిగిలి పోతుంది. జీవితం కూడా అంతే. ప్రతీదీ లిఖితమై ఉంటుంది. మనం నిమిత్తమాత్రులమే" అన్నారు శాంతిస్వరూప్. ఏదిఏమైనా ఎందరో తెలుగు ప్రజల మనసుల్లో ఒక స్థానాన్ని పదిలపరచుకున్న వ్యక్తి శాంతిస్వరూప్. వారి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ...
శాంతిస్వరూప్ గారికి అభినందనలతో ....సమీహ!!