27, డిసెంబర్ 2008, శనివారం

తెలుగులో బ్లాగులు

బ్లాగు నిర్వహణలో నాకు కొంత పరిచయం ఉంది. దాదాపు సంవత్సరం క్రితం ఇంగ్లీషులో ఒక బ్లాగు ప్రరంభిచాను. అది మా ఉద్యోగుల కోసం. అది అతి తక్కువ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. రోజు వందల సంఖ్యలో దానిని చూస్తుంటారు. నేను అనుకోకుండా ఒక రోజు తెలుగోలో బ్లాగులు చూడటం జరిగింది. అవి చూసి నన్ను నేను మరిచిపోయనంటే నమ్మండి. అదిగో దాని ప్రభావమే ఈ బ్లాగు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పది ఇరవయ్ పత్రికలలో కార్టూనులు గీసేవాడిని . అది ఒక సరదా. జేబు ఖర్చులుకని ఇచ్చిన డబ్బులన్నీ దీనికే పోయేవి. మధ్యలో ఎవరైన ఒకరిద్దరు డబ్బులు పంపించేవారు. ఆంధ్ర పత్రిక, యువ, ఆంధ్ర ప్రభ మాత్రం పారితోషికం పంపేవారు. అమ్మ చదువు మానేసి ఆ బొమ్మలేమిటి అని కోప్పడేది. నాన్న మాత్రం కార్టూనులు చూసి ప్రోత్సహించేవారు. ఉద్యోగంలో చేరేదాక కార్టూనులు గీసేవాడిని. తరువాత మరల వీలు కలుగలేదు. కాని ఆ ఉత్సాహంతో టీవీలో చాల మంది కార్తూనిస్ట్లులని పరిచయం చేశాను. ఈనాడు శ్రీధర్, క్రానికాల్ సుభాని, జ్యోతిలో పనిచేస్తున్న శేఖర్, ఇంక ముఖ్యంగా బాలి తో పరిచయం, నాకు మంచి మిత్ర బృందం ఏర్పడింది. జయదేవ్ గారితో కూడా ఒక మంచి కార్యక్రమం అంటే పిల్లలకోసం బొమ్మలు గీయటం కూడా చేసాము. జయదేవు గారు హైదరాబాదులో ఉండలేక మరల చెన్నై వేల్లిపోయరనుకోండి. నా మొదటి గురువు మాత్రం భగవాన్ గారు. గుండు బొమ్మల కార్టూనిస్టు. అలాగే గోపాలకృష్ణ గారు కూడా. మేమంతా పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు లో ఉన్నప్పుడు అక్కడ గ్రంధాలయ ఉత్సవాలలో కార్టూన్ ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళం. భగవాన్ గారు వృత్తి రీత్యా లెక్చరర్. గోపాలకృష్ణ గారు మాత్రం అనిమషన్ రంగం లో స్థిరపడ్డారు. హైదరబాద్ వఛాక నేను కలసిన మరొక మంచి ఆర్టిస్టు ఉత్తమ్. అయన గీనిన "ఛండాలుడు " పైంటింగ్ నేను ఇప్పటికి మరచిపోలేకున్నాను. అయనకి ఒకసారి ఫోను చేస్తే సినిమా తీస్తున్నాం అని చెప్పారు. హైదరాబాదులో అనిమషన్ రంగం ప్రారంభకులు ఆయెనే అని చెప్పొచ్చు. వీరి పూర్తీ వివరాలతో మరొకసారి కలుస్తాను లెండి.


రైలు ప్రయాణం

రైలు ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. విచిత్రమైన వాతావరణం అతా రైలు లోనే ఉంటుంది. ఉన్న కాసేపట్లోనే సుఖపడి పోదమనె వారి మనస్తత్వం నాకు చాలా ఆశ్చర్యం కలుగ చేస్తుంది. రైలు ఎక్కగానే లుంగీలు మార్చుకునే భీముళ్ళు , రైలు ఎక్కామనే సందేశాన్ని మొబైల్ లో పంపే బక్క ప్రాణులు, దంతావధానం చేసే శతావధానులు, మరొకరిని కూర్చోనీయకుండా పిల్లలని పడుకోపెట్టే తల్లులు, రైలులో ఒక్క మెరుపు తీగైన ఉండదా అని వెదికే యువ కిషారాలు, పక్క వాళ్ల పేపరులోకి తొంగి చూసే ముసలి తాతలు, ఇంకా పక్కవాళ్ళ సామానులు విరగ్గొట్టే రాక్షస పిల్లలు, యుద్ధంలో వీర సైనికులులాగా జనం మధ్య అమ్మేవాడు, ఇంకాఇంకా చాలా మంది. ఇందరి మధ్య నాకు చలం రాసిన మ్యూజింగ్స్ గుర్తుకొస్తుది. చీకటిలో రైలు దూసుకుపోతోంది. అందరు హయిగా నిదుర పోతున్నరు. అందరికి ఆ యంత్రం మీద ఎంతో విశ్వాసం. ఆ రైలు వీరిని గమ్యం చేరుస్తున్దని. ఆపాటి విశ్వాసం నాకు శివుడిమీద లేదని వాపోతాడు. రైలులో ప్రతి ఒక్కరి మనసు రైలు కన్నా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. వారి చింత ఎంతసేపు రేపటి వారి కార్యక్రమాల పైనే. మరికొందరి లగేజి సగంకన్న ఎక్కువ తినుబండరాలే ఉంటాయి. వారి కార్యక్రమం రైలు ఎక్కిన కొద్దిసేపటికి మొదలౌతుంది. నిరంతరంగా గంటల దరబడి కొనసాగుతుంది, తినడానికే రైలు ఎక్కినట్టు. ఇళ్ళల్లో ఉన్నపుడు అన్ని రకాలు తింటారో లేదో కానీ, ప్రయాణంలో మాత్రం ముఫ్ప్ రకాల తినుబండారాలు ఎగ్జిబిషన్ పెట్టినట్టు తింటుఉంటారు. దేశంలో కరువు వస్తే ఏదైనా రైలులో వెదికితే చాలు, దేశానికీ సరిపడా తినుబండారాలు దొరుకుతాయి. అందరికన్నా తెలివెన వాడిననుకోనే కొందరు ఉంటారు. ఎవరు దొరికితే ఉపన్యాసం ఇద్దామా అని వెదుకుతూ ఉంటారు. అందరు వినేలా వారి కున్న పరిగ్నానన్ని (సారీ) పదిమందికి పంచుతూ ఉంటారు. ఏది ఏమైనా వీరంతా మనవాళ్ళు. సగటు భారతీయులు. వారంటే నాకిష్టం. అవును కదా?

20, డిసెంబర్ 2008, శనివారం

తెలుగు భాష అభిమానం

తెలుగు భాష మీద అభిమానం రాష్త్రం దాటి బైటికి వెడితే మరింత పెరుగుతుంది. అది నా విషయంలో కూడా రుజువైంది. ఉద్యోగ రీత్యా ఢిల్లీలో పని చేస్తున్నప్పుడు, ఇండియా గేటు వద్ద ఉన్న పచ్హిక బయళ్ళలో కూర్చుని చలం రాసిన మ్యూజింగ్స్ చదువుతుంటే ఐన వాళ్ళందరికీ దూరంగా ఉన్నామనే భావన పూర్తిగా పోయేది. ఢిల్లీ లో ఉద్యోగం పుణ్యమాని తెలుగు సాహిత్యంతో కొంత ముఖ్యంగా చలంతో పరిచయం earpadindhi. ఆదివారం వస్తే చాలు, ఉదయాన్నే రూమ్ నుండి బయట పడి డిసెంబర్ మంచులో జేబులో చేతులు పెట్టుకొని వేడి వేడి అల్లం చాయ్ కోసం వెదుకుతూ వెళ్లి, మరుగుతున్న అల్లం చాయి ఉఫ్ఫ్ మని ఊదుతూ తాగుతున్నప్పుడు కలిగే ఆనందం మరిచి పోలేను. తెలుగు భాష అభిమానం పెరగాలంటే ప్రతి ఒక్కరిని ఒక్కసారైనా రాష్త్రం బయటకి పంపించాలని నా ఉద్దేశ్యం. ప్రతి ఒక్కరికి ఢిల్లీ నచ్చి తీరుతుంది. నాకు చాలా విధాలుగా హైదరాబాద్ కి ఢిల్లీ కి పోలికలు కనిపిస్తాయి. వాతావరణం, పురాతన కట్టడాలు అన్ని చాలా పోలికలు కలిగి ఉంటాయ్. హైదరాబద్లో కూడా ఇప్పుడు చక్కని తెలుగు మాటలడుతున్నారు. చారిమినర్ వెళ్ళిన కూడా మనకు ఒకప్పటిలా కాకుండా తెలుగు బాగానే వినపడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే పనిచేస్తున్నాను. ప్రస్తుతం పుస్తకాలనుండి ద్రుష్టి టీవీ వైపు మళ్ళింది. కారణం నా ఉద్యోగం అందులోనే కాబట్టి. మరి నా కార్యక్రమాల వివరాలు తరువాత చెపుతాను. ప్రస్తుతానికి ఉంటాను.