6, ఏప్రిల్ 2009, సోమవారం

ఎలక్షన్ హామీలు - ఒక కార్టూన్


29, మార్చి 2009, ఆదివారం

మావాడి పరీక్షలు

ఆ రోజు నా మనసంతా అందోళనగా ఉంది. కారణం మా ఆఫీసరు నాకు లీవు ఇస్తాడో లేదో అని. రేపటినుండి మా అబ్బాయి కి పరీక్షలు. వాడిని దగ్గిర కూర్చొని చదివించాలి. వాడికి మంచి రాంక్ రావాలి లేకపోతే తరువాత చాలా ఇబ్బంది పడాలి. మావిడ మరీ మరీ చెప్పింది వాడి పరీక్షలు అయ్యేదాక శలవు పెట్టమని. నెమ్మదిగా లీవు లెటర్ పట్టుకొని మా ఆఫీసరు రూంలోకి వెళ్ళాను. మా ఆఫీసరు ఎప్పటిలాగానే కోపంగా ఏమిటన్నట్టు చూసాడు. నేను నెమ్మదిగా లీవు కావాలని అన్నాను. అదేమటండీ ఇది మార్చి నెల. అక్కౌంట్స్ అన్నీ మనం క్లోజ్ చేసుకోవాలి కదా. ఇలాటప్పుడు లీవు అంటే ఎలా . అసలే మీది బిల్లుల సీటు. మీరు పాసు చేయ్యల్సిన బిల్లులు కూడా చాలా ఉన్నాయి అన్నాడు. నిజమే సార్, కానీ ఇది మా అబ్బాయి జీవిత సమస్య. మా అబ్బాయి ఫైనల్ ఎగ్జాంస్. నేను వాడితోబాటు ఉండి చదివించాలి. లేకపోతే వాడి భవిష్యత్తు పాడవుతుంది అన్నాను. ఏమనుకున్నాడో ఏమో మొత్తానికి సరే అని లీవు గ్రాంట్ చేసాడు. అమ్మయ్య పెద్ద సమస్య తీరింది అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకున్నాను. మా వాడు పుస్తకాలు ముందు వేసుకొని దీర్ఘంగా అలోచిస్తున్నాడు. వాడికి ముందు ఎగ్జాంస్ అంటే భయం పొగొట్టాలని "చూడు నాన్నా పరీక్షలంటే భయపడక్కరలేదు. దానికి తగ్గ ప్రిపరేషన్ మనము చేసుకోవాలి.ఇంతకు ముందు నువ్వు చదివిన సిలబస్ అంతా మరోసారి మననం చేసుకుంటే చాలు. ఏ ప్రశ్న అడిగినా సులువుగా సమాధానం వ్రాయవచ్చు. నువ్వు బాగా చదవాలి, మంచి ఇంజనీరువవ్వాలి. సరేనా? వాడు తల ఊపాడు. మరుసటి రోజు సైన్స్ పేపర్. వాడితోబాటు మేమూ వాడు సిలబస్ అంతా చదివే వరకు మేము కూర్చొని ఉన్నాము. మధ్య మధ్యలో వాడికి హార్లిక్స్ అందిస్తూ ధైర్యం చెపుతూ ఉన్నాము. అలా పన్నెండువరకూ సాగింది. మరీ ఎక్కువసేపు మెలుకవగా ఉంటే పరీక్ష వ్రాయలేడని పడుకొబెట్టాము.మరలా ఉదయాన్నే ఐదు గంటలకు లేపి పరీక్షకు సిద్ధం చేసాం.వాడు ఎగ్జాం వ్రాసి వచ్చేదాకా టెన్షనే. ఎలా వ్రాసేడోనని. వచ్చేక అడిగితే క్వస్చన్ పేపర్ మొహాన పడేసాడు. వాడు పెట్టిన టిక్కులనిబట్టి అన్ని సమాధానలు వ్రాసాడని సంతృప్తి చెందాం . అలా వాడి ఎగ్జాంస్ జరిగినన్ని రోజులూ మాకు నిద్ర ఉండేది కాదు. వాడిదసలే అన్ని విషయాలని తేలికగా తేసుకొనే మనస్తత్వం. వాడికి జీవితం గురించి, భాద్యతలగురించి నేను చెపుతూ ఉండేవాడిని. వాడి ఎగ్జాంస్ పూర్తి అయ్యాయి. ఇక రిజల్ట్ తెలియాలి. నాకు టెన్షన్ మరీ పెరిగిపోతూంటే మావిడ దెబ్బలాడింది "వాడి ఎగ్జాంస్ గురించి మీ ఆరోగ్యం పాడుచేసుకుంటారా ఏమిటి" అని. ఇంతలో రిజల్ట్స్ వచ్చాయి. మా వాడిని ఒకటవ తరగతి నుండీ రెండవ తరగతికి ప్రమోట్ చేస్తున్నట్టు స్కూల్‌వాళ్ళు పంపిన లెటర్ చూసేకాగాని నాకు మనసు కుదుట పడలేదు.

26, మార్చి 2009, గురువారం

ఉగాది నవ్వు - ఒక కార్టూన్

తెలుగువారందరూ ఈ సంవత్సరమంతా ఇలాగే నవ్వులు చిందిస్తూ గడపాలని కోరుకుంటూ -
ఉగాది శుభాకాంక్షలతో సమీహ......

24, మార్చి 2009, మంగళవారం

నా ఎక్సరసైజ్ ప్రహసనం

ఆ రోజెందుకో నాకు ఉదయాన్నే మెలుకువ వచ్చింది. నెమ్మదిగా లేచి బాల్కనీలోకి వచ్చాను. తెల తెలవారుతోంది. చిరు చీకట్లని సూర్య కిరణాలు తరిమే ప్రయత్నం చేస్తున్నాయి. వాతవరణం చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. మాది మా అపార్టుమెంటులో ఐదవ ఫ్లోరు. దూరంగా పచ్చని చెట్లు. కొద్దిపాటి మంచు కురుస్తూ ఉందటం వల్ల ఆకాశం లోని మబ్బులన్ని భూమి మీదకి వచ్చేసినట్లు ఉంది.అదృష్టవశాత్తు మాకు కోయిల అరుపులు కుడా వినిపిస్తూ ఉంటాయి. మా అపార్టుమెంటు పక్కనుండీ నల్లటి తారు రొడ్డు వెడుతుంది. దాని మీద అప్పుడే మనుష్యుల సంచారం మొదలైంది. వారిని కొద్దిగా పరికించి చూస్తేరకరకాల వయస్సులవాళ్ళు వేగంగా నడుస్తూ మార్నింగ్ వాక్ చేసున్నారు. కొందరితోబాటు వారి అర్ధాంగులు కుడా నడుస్తూ కనిపిస్తున్నారు. వారందరికి ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధో? జీవితంలో ఎంతో కొంత డిసిప్లెన్ లేకపోతే ఇలా ఉదయాన్నే ఎక్సర్సైజులు చేసే క్రమశిక్షణ అలవాటవ్వదు. ఎక్సరసైజులవల్ల ఆరోగ్యంగా ఉండగలగడం, దానివల్ల ఆనందంగా ఉండటం జరుగుతాయి. మనుషులు కూడా ఎంతో నాజూకుగా ఉంటారు. ఒక్కసారి నావైపు చూసుకున్నాను. తిండి మీద అదుపు లేకపోవడంవల్ల పెరిగిన శరీరం, దానికి కల్లు కుండ తగిలించినట్టు పెరిగిన పొట్టా నా మీద నాకే వికారం కలిగింది. నేను కూడ కాస్త ఉదయాన్నే నడిస్తే? ఆరోగ్యం, ఆనందంతొపాటు జీవితం లో క్రమశిక్షణ వస్తాయేమో? ఇవాల్టినుండి నా జీవిత విధానం మార్చుకోవాలని నిర్నయించుకున్నాను. ఇకనుండి చికెన్, మఠన్ తినడం మానేయాలి. సిగరెట్లు, టీలు కుడా మానెయ్యాలి. కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం కొద్ది కూరతొ అన్నము తినాలి. రాత్రి రెండు పుల్కాలో లేక రొట్టెలో తిని ఊరుకొవాలి. మరో విషయం రోజూ ఉందయాన్నే టీవీల్లో వచ్చే బాబా రాందేవ్ గారి యోగా నేర్చొకోవాలి. ఆయనలా పొట్టని లోపలికి బైటకి కదపగలిగితే ఈ బాన పొట్ట కూడా తగ్గిపోవచ్చు. కాబట్టి టీవీ చూడటం కుడా అలవాటు చేసుకోవాలి. ఆ నిర్నయం తీసుకోగానే నేను సన్నగా సంపూర్న అరోగ్యవంతుడిని అయిపొయినట్టు అనుభూతి కలిగింది. నిర్నయం తీసుకున్నందుకే ఇంత ఆరోగ్యం అనిపిస్తే నిజంగా ఎక్సరసైజులు చేస్తే ఇంకెంత అరోగ్యం కలుగుతుందో తలుచుకుంటే సంబరం వేసింది. ఆరోజు ఉందయాన్నే మావిడ ప్లేటులో పెట్టిన డజను ఇడ్లీలనుండీ పది ఇడ్లీలను పక్కన పెట్టేశాను. నెయ్యి కూడ వేసుకోకుండా రెండు ఇడ్లీలు తిని ఆఫీసుకు బయలుదేరేను. ఆఫేసులో ఉత్సాహంగా పని మొదలు పెట్టాను. గంట గడిచింది. పొట్టలో కొద్దిగా తేడాగా అనిపించింది. మరో గంట గడిచింది. పేగులు అరుపులు మొదలు పెట్టేయి. దీనినే ఆకలి అంటారుగాబోలు. కొద్దిసేపటికి మా కొలీగ్ సంబరంగా వచ్చి ఈ రోజు మీ అందరికి హొటల్ పేరడైస్‌లో ట్రీట్ ఇస్తున్నాను మీరందరు తప్పక రావాలని ఆహ్వానించాడు. ఎందుకని అడిగితే మా అబ్బాయికి ప్లేస్‌మెంట్ వచ్చింది అన్నాడు. నేను సందిగ్దంలో పడ్డాను నా ఆరోగ్య నియమాల విషయం తలుచుకొని. ఎలాగైనా అరోగ్యమే ముఖ్యం, మిగిలిన విషయాలకన్నా అనుకొని పార్టీకి వెళ్ళకూడదనే తీర్మానించుకున్నాను. నెమ్మదిగా లంచ్ టైం కావస్తోంది. ఆకలి విపరీతంగా పెరిగింది. నెమ్మదిగా నా కేరేజ్ తెరిచాను. రొజూలా కాకుండా దానిలో బుల్లి కప్పుడు రైస్, కొద్దిగా పొట్లకాయ కూర ఉంది. మామూలుగూ అయితే అది నాకు ఒక్క ఐటం సరిపడా కూడా కాదు. నెమ్మదిగా ఉన్న అన్నాన్నే తిన్నాను. బహుశ నా పొట్టకి భొజనం చేసిన విషయం కుడా తెలిసి ఉండదు. కేరేజ్ మూసి నెమ్మదిగా నా సీట్లొ వాలేను. కొద్దిగా మగత వచ్చింది. మా కొలీగ్ వచ్చి లేపి పద అందరూ నీ గురించి వెయిట్ చేస్తున్నారు అన్నాడు. ఎక్కడికి అన్నాను నేను. అదేమిటి పేరడైస్‌లొ పార్టీ ఇస్తున్నానని చెప్పేను కదా అన్నాడు. నాకప్పటికే కళ్ళకింద నల్ల మచ్చలతో రోగిష్టిలా తయారయ్యానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. నామీద నాకే చాల జాలి కలిగింది. వెధవ జీవితం అన్న భావము కలిగింది. దేముడు తిండికి శరీరానికి ఎందుకు లంకె పెట్టాడో కదా అనిపించింది. ఇలా జీవితం ఎంత కాలం గడపాలో? కానీ ఇప్పుడే భరించడం కష్టంగా ఉంది. ఇక లాభం లేదు, ముందు వాళ్ళతోపాటు హొటల్‌కి వెళ్లి సుష్టుగా భోజనం చేయాలి. అనుకున్నదే తడవు వెంఠనే బయలుదేరేను. హొటల్‌లో రెండు బిర్యానీలు లాగించాకాగానీ మనసు కుదుట పడలేదు. ఆరోజు సాయంత్రం ఇంటికొచ్చి పడక కుర్చీలో పడుకొని ఆలోచించసాగాను. నాకంత వయసు ఏమి అంత మించిపొయిందని, ఇప్పటినుండి ఉపవాసాలు చేయడానికి. నా పొట్ట నాకేవిధంగాను అడ్డుగా లేదు. తిండి మానేసి కడుపు మాడ్చుకుంటూ బాబా రాందేవ్ మాత్రం ఏమి సుఖపడుతున్నడో? ఈ భొజన నియంత్రణలు, వ్యాయామాలు, ఉదయపు నడకలు మరో పదేళ్ళ తరువాత మొదలు పెట్టవచ్చు. కడుపు నిండా నచ్చిన తిండి తినకుండా మరో పదేళ్ళు ఎక్కువ బతికి మాత్రం సుఖమేమి ఉంటుంది? నా నిర్నయం మంచిదే అని మనసులో అనుకున్నాను. చాలా హాయిగా అనిపించింది. రాత్రికి కోడి వేపుడు చేయమని మావిడకి ఉత్సాహంగా ఆర్డరు వేశాను.

9, మార్చి 2009, సోమవారం

"సెల్ ఫోన్ బిల్" - ఒక కార్టూన్


21, ఫిబ్రవరి 2009, శనివారం

తెలుగు బ్లాగ్లోకానికొచ్చిన బుల్లితెర "సాహితీ సౌరభం శ్రీ వోలేటి పార్వతీశం గారు"





తెలుగు సాహితీ ప్రపంచంలొ భావ కవిత్వాన్ని సురభిళ శొభితంగా పరివ్యాపనం చేసిన సుప్రసిద్ధ జంట కవులు వేంకట పార్వతీశం కవులు. జంట కవి లోకంలొ తిరుపతి వేంకట కవులకు సమస్కంధంగా పేరెన్నికగన్న జంట కవులు వేంకట పార్వతీశం కవులు. బాలంత్రపు రజనీకాంతరావు గారి తండ్రియైన భాలాంత్రపు వేంకటరావుగారు, వొలేటి పార్వతీశంగారు కలసి ఈ జంట కవులు.శతాధిక గ్రంధ కర్తలు. వంగ భాషకో రవీంద్రుని గీతాంజలి లాగ, తెలుగు భాషకు ఈ జంట కవుల "ఏకాంత సేవ" ఖండకావ్యం మకుటాయమానమైన రచన. మాతృ మందిరం, బృ౦దావన౦, కావ్య కుసుమావళి, బాలసూర్యవాచకాలు, బాలగీతావళి, బొమ్మల రామాయ౦ ఇలా ఎన్నొ రచనలు వీరివి. వీరిలొ వోలేటి పార్వతీశ౦గారి మనవడే మన వొలేటి పార్వతీశం గారు. జన్మస్థలం అమలాపురమే ఐనా తాతగారి స్వస్థలం పిఠాపుర౦ తొ అనుబంధం ఎక్కువ. తండ్రి ప్రముఖ గేయ కవి శశాంక గారు. ఆయన అసలు పేరు సుబ్బారావు. ఆకాశవాణితొ పరిచయం ఉన్న తెలుగు వాళ్లెవ్వరూ విస్మరించలేని గొప్ప కవి శశాంక. ఆయన తొలి సంతానమే పార్వతీశం గారు.
దూరదర్శన్‌లొ మీ ప్రవేశం ఎలా జరిగిందని ప్రశ్నిస్తే " మా నాన్నగారు శశాంక చాలా చిన్న వయసులోనే పరమపదం చేశారు. అప్పటికి నేను ఇంటర్మీడీయట్ మాత్రమె పూర్తి చేశాను. ఆ తరువాత ఏదొ కష్టపడి బి.యస్‌సి. పూర్తి చేశాను. ఆర్ధిక స్థితి కారణంగానూ, ఇంటికి పెద్దవాడిని కావడంవల్లను మా తాతగారు శ్రీ క౦దుకూరి రామ భద్ర రావుగారి సూచన మేరకు శ్రీ పుల్లెల వేంకటెస్వర్లుగారి సౌజన్యంతో ఆకాశవాణి్‌లొ కాజువల్ ప్రొడక్షన్ అసిస్టంట్ గా తర్ఫీదు పొంది, శ్రావ్య కార్యక్రమాలకు రూప కల్పన చేశేవాడిని. ఉత్తరోత్తరా రాష్ట్ర రోడ్దు రవాణా సంస్థలో ఉద్యోగంచేసినా ఆకాశవాణిని విడిచిపెట్టలేదు.రేడియో కార్యక్రమాలకు రచన చేయడం, రేడియోలో స్వరాన్ని పలికించడం, కార్యక్రమాలకు రూపకల్పన చేయడం, ఇవన్నీ చెప్పలేనంత సంతోషాన్ని కలిగించేవి. ఆకాశవాణి ప్రాంగణంలో సంగీత సాహిత్యాలలో గొప్ప గొప్ప వారె౦దరితోనో సన్నిహితంగా మెలిగే అవకాశం కలిగింది. శ్రవ్య మాధ్యమాన్ని సుసంపన్నం చేసిన లబ్ద ప్రతిష్టులెందరితోనో పరిచయ భాగ్యం కలిగింది. ఉద్యోగమంటూ చేస్తే ఆకశవాణిలోనే చెయ్యలి అనే ఆశ కోరిక కలిగి కాలం గడిచేకొద్దీ అది బలంగా వెళ్లూనుకుంది. ఆ కోరిక వెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. మొత్తానికి సాధించాను. రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగానికి స్వస్థి పలికి, ఆకాశవాణిలో చేరాను.కొంత కాలం కడప ఆకాశవాణి కేంద్రంలో పనిచేశాను. ఆ సమయంలో శ్రీ దేవళ్ల బాలకృష్ణగారు, శ్రీ గొల్లపూడి మారుతీరావు, డా.ఆర్.అనంత పద్మనాభరావుగార్లతో కలసి పనిచేయడం, నాకు ఎన్నొ అనుభూతులని మిగిల్చింది. అక్కడినుండీ బదిలీ మీద హైదరాబాదు దూరదర్శన్‌లో ప్రవేశించాను. ఆ బదిలీ నా వృత్తిగత జీవితంలో పెద్ద మలుపు. శ్రవ్య మాధ్యమంలోంచి నేను దృశ్యమాధ్యమంలోకి ప్రవేశించాను.
చాలా ఏళ్ళ క్రిత౦ మీరు నిర్వహి౦చిన జాబులు జవాబులు కార్యక్రమ౦ ఇప్పటికీ ప్రజల మనసులలొ ఉ౦ది. అటు తరువాత ఆకార్యక్రమాన్ని నిలిపి వేశారు. కారణ౦ ఏమిటి మరలా ఆ కార్యక్రమాన్ని మీరు నిర్వహి౦చే అవకాశం ఉ౦దా అ౦టే"మీరన్న మాట నిజమే. ఇప్పటికీ ఆ కార్యక్రమ౦ ప్రజల మనసుల్లో వు౦ది. ఈ నాటికి అక్కడక్కడ ప్రేక్షకులు "జాబులు-జవాబులు పార్వతీశ౦" అనే పిలుస్తూ౦టారు. నిజానికి ఈ కార్యక్రమాన్ని టీవీ లొ నిర్వహి౦చడానికి పూర్వ౦ ’మీ ఉత్తరాలు’ పేరుతోరేడియొలో నిర్వహి౦చెవాళ్ల౦. ఉద్త్యొగ౦ లొ చేరిన కొత్త కాబట్టి, ఉత్సాహం ఎక్కువగా ఉండేది కాబట్టి ఏం చేసినా కొత్తగా చెయ్యాలని అనిపించేది. మామూలుగా రేడియోలో ఏదో వస్తూ ఉంటుంది, మనం ఏదో వింటూ ఉంటాం. ఇలా కాకుండా రేడియో మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగింది. ఆ అలోచనే మీ ఉత్తరాల కార్యక్రమంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాను. నేను చేప్పేది ముప్ఫై ఏళ్ల నాటి మాట. శ్రోతలు అనూహ్యంగా స్పందించారు. పదుల సంఖ్యలో ఉత్తరాలు వందలు దాటి వేల సంఖ్యలోకి పెరిగిపోయాయి. ఆ అనుభవంతోటే నేను దూరదర్శన్‌లో జాబులు-జవాబులు కార్యక్రమం నిర్వహించేవణ్ణి. ఏదో ఉత్తరాల కార్యక్రమమేకదా అని తెలిగ్గా తేసుకోలేదు. ప్రసారానికి రెండు మూడు రోజుల ముందునుచే చాల హోం వర్క్ చెసేవాణ్ణి. కార్యక్రమంలో చదవగలిగే పాతిక, ముప్ఫై ఉత్తరాలే ఐనా వచ్చిన వందలాది ఉత్తరాలని మొత్తం చదివేవాడిని. ప్రశంశలకన్నా నిర్మాణాత్మకమైన సూచనలు, విమర్శలు చేసే ఉత్తరాలకి ప్రాధన్యం ఇచ్చేవాణ్ణి.కార్యక్రమం నిర్మించేటప్పుడు వుండే సాధక బాధకాలు వివరించేవాణ్ణి. అలాగే నాకు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ గొవిందు చౌదరి గారు నిర్వహించే తీరులోనుంచి మెలుకువలు నేర్చుకున్నాను. మొత్తంగా ఇవన్నీ కలిసి, ఈ కార్యక్రమానికి గణనీయమైన ప్రేక్షకాదారణ సంపాదించి పెట్టాయి. ఇక ఆ కార్యక్రమన్ని నిలిపివేయడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. నా తరువాత కొంతమంది ఆ కార్యక్రమన్ని నిర్వహించారు. కారణాలేమైనా, ఆ కార్యక్రమంలో ఆకర్షణ తగ్గింది. అంచేత కాలక్రమంలో అది కనుమరుగైంది. ఇక మళ్లీ నేను నిర్వహించడమనేది బహుశా ఉండకపొవచ్చు. ఎందుకంటే కొత్త నీటికి చోటివ్వాలంటే పాతనీరు ముందుకి ప్రవహించాలికదా!"
పార్వతీశ౦గారికి ప్రత్యేక౦గా అభిమానులున్నారు. వారికి బుల్లితెర మీద కనిపిన్చడ౦ లేదు అ౦టే" నిజమేనండీ! చాలామంది అభిమానులున్నారు. వాళ్లే లేకపొతే, ఈ రోజున ఇలా 'సమీహ ' లో ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశమే లేదుకదా! మూడున్నర దశాబ్దాల పూర్వం నేను ఆకాశవాణిలొ కాజువల్‌గా పనిచేసిన రోజులనుండీ నన్ను శ్రోతలు అభిమానించడం మొదలు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే శ్రోతలు, ప్రేక్షకులు నాపట్ల చూపిన అభిమానమే నన్ను ప్రసార మాధ్యమంలో పనిచేసేలా చేసింది. ఐతే దీనివెనుక దూరదర్శన్‌లో ఎంతోమంది కార్యక్రమ ప్రయోక్తల ప్రోత్సాహం ఉంది. శ్రీ పి.వి.సతీష్, శ్రీమతి రమణి సన్వాల్, శ్రీ పి కె మాన్వి, శ్రీ ఆర్ ఆర్ కె శ్రీ, శ్రీమతి యమునా సంజీవ్,శ్రీమతి శైలజా సుమన్, శ్రీమతి యార్లగడ్డ శైలజ వంటి కార్యక్రమ ప్రయోక్తలు తమవంతు కార్యక్రమలలో నన్ను భాగస్వామిని చేసారు.అలా వారంతా ఇంచ్చిన అవకాశాన్ని సద్వీనియోగం చేసుకున్నాననుకుంటాను.ఫలితమే విశేషమైన ప్రేక్షకుల అభిమానం నాకు దొరికింది. ఇక పొతే ఇటీవల బుల్లితెర మీద కనిపించకపోవడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. తెరముందు జీవితాన్ని తెరవెనుకకు మళ్ళించాను. ఉద్యోగాలలొ ఇవన్ని సాధారణమే."
ప్రస్తుత౦ మీరు చేస్తున్న కార్యక్రమాలేమిటి అ౦టే "ప్రస్తుతం నేను ప్రధానంగా ప్రయోజిత కార్యక్రమాల విభాగంలో భాద్యతలు నిర్వహిస్తున్నాను. ఈ విభాగంలో నేనుగా నిర్వహించే కార్యక్రమాలేవీ ఉండవు. బహుశా నేను ప్రేక్షకులకి బొత్తిగా కనిపించకపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఐతే 'తెలుగు తోట ' శీర్షికతో సాహిత్య సంచికా కార్యక్రమం ధారావాహికంగా అందించాలని ఒక ఆలోచన."
తెలుగులో చాలా ఛానల్స్ వచ్చాయి. ప్రేక్షకుడు సప్తగిరి వెదికి చూసే కార్యక్రమాలు చేస్తో౦దా అని అడిగితే"టీవీ అంటే దూరదర్శన్ అనే రొజులనుండీ, ఇవాళ చానల్ స్కాన్‌లో దూరదర్శన్ ఎక్కడవుందా అని వెతుక్కునేంతవరకు చానల్స్ సంఖ్య పెరిగిపొయింది. అలాంటి తరుణంలో ఇన్ని చానల్స్ మధ్య ప్రేక్షకులు దూరదర్శన్ వెతికి పట్టుకొనే అవకాశం ఉందా అంటే ఉంది. ఐతే అలా వెదికేవారి సంఖ్య కొంత పలుచన కావచ్చు. నిజానికి దూరదర్శన్ information,education and entertainment.వాటి ప్రాధాన్యతా క్రమం కూడా అదే. మొదటి అంశానికి విస్తృతంగా చానల్స్ వచ్చాయి. అలాగే చివరికి అంశానికి కొరత లేదు. ఇక మిగిలందల్ల మధ్యలో వున్నది. అదే దూరదర్శన్‌కి గొప్ప ఆసరా. మన సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, నాట్య కళల పట్ల, ఇతర లలిత కళలపట్ల, విద్య పట్ల, వ్యవసాయంపట్ల ఆసక్తి కలిగించే ప్రయత్నం దూరదర్శన్ మాత్రమే చేయగలుగుతుంది. మంచి కవితా గానాలను అస్వాదించాలంటే, ఉత్తమ శ్రేణి సంగీత విద్వాంసుల కచేరీలను వినాలంటే దూరదర్శన్‌లోనే సాధ్యమవుతుంది. అష్టావధానాలు, పద్యాల తోరణాలు, తెలుగు పద్యం అంద చందాలు, ఇలాంటి కార్యక్రమాలకోసం ప్రేక్షకులు దూరదర్శన్ వెదికి పట్టుకోవలసిందే." తెలుగు భాషాభివృద్ధి కోస౦ ఈ-తెలుగు లా౦టి స్వచ్హ౦ద స౦స్థలు పనిచేస్తున్నాయి.వాటికి మీరు సహకరి౦చగలరా? మన భాషాభివృధ్ధి కోసం ఈ వ్యవస్థలో చాలా మంది వ్యక్తులు, సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని పత్రికలు కూడా విశేష కృషి చేస్తున్నాయి. ఇలాంటి కృషిలో భాగమే ఈ-తెలుగు కుడా. ఇది ప్రశంసార్హమైన విషయం. మన తెలుగు భాషభివృధ్ది ఇంకా పటిష్టంగా వుండాలంటే సంస్థలు, వ్యక్తుల మధ్య ఒక సమన్వయం కావాలి. ఒక సరియైన అవగాహన, కలిసిగట్టుగా పనిచేయగలగాలి. నేను ఇప్పటికే చాలా భాషా సంభంధమైన సంస్థలలో భాగస్వామిగా ఉన్నాను. ఈ-తెలుగు కూడా తన కృషిలో నా భాగస్వామ్యం అవసరమనుకుంటే, నేను అందించాడానికి సిద్ధంగానే ఉన్నాను.
కుటు౦బ విషయాలగురి౦చి అడిగినప్పుడు "నేను చాలా రకాలుగా అదృష్టవంతుడిని. ఆ అదృష్టంతొపాటు దురదృష్టం కుడా వెన్నంటే వుందని అర్ధమైంది. మా నాన్న గారు శశాంక చాల చిన్న వయస్సులోనే పరమపదం చేశారు. మా కుటుంబంలో ఒక దీప స్థంబంలా నిలిచిన మా అమ్మగారు శ్రీమతి హైమావతి కుడా నడివయస్సునాటికే పరమపదం చేశారు. అలాగే మా తమ్ముడు రామభద్రరావు నడివయస్సుకుడా చేరకముందే నాలుగు పదుల వయస్సులో మా అమ్మని నాన్నని అనుసరించాడు. ఇక అన్నిటికి మించిన దురదృష్టం నా శ్రేమతి వోలేటి కృష్ణకుమారి ఇటేవలే ఒక సంవత్సరం క్రితం అకస్మాత్తుగా కన్నుమూసింది. ఆమె అకాల మరణం జీవితం నిర్వీర్యం ఐనట్లుకనిపిస్తోంది. నా ప్రసార మాధ్యమ జీవితంలో వీరిద్దరిదీ చాలా కీలకమైన భూమిక. ఆ ఇద్దరూ నిష్క్రమించడం, జీర్నించనలవికాని దురదృష్టం. ఇక ప్రస్తుతం నేనూ, మా ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు శశాంక, మా నన్నగారి పేరే. బి.టెక్. చివరి సంవత్సరం చదువుతున్నడు. రెండవవాడు హేమంత్. మా అమ్మగారి పేరు హైమావతి కావడం, ఈ పిల్లవాడు మగపిల్లవాడు కావడంవల్ల ఆ పేరు పెట్టే అవకాశం లేక హేమంత్ అని పేరు పెట్టాను. బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నవయస్సులొనే కష్టాలు ఎదురొచ్చినా చాలా పరిణత మనస్కులై వ్యవహరిస్తారు. అది భగవంతుడు వారికిచ్చిన వరమే. చివరిగా ఒక్క మాట చెప్పాలి. మూడున్నర దశాబ్దాల క్రితం మా అమ్మగారి కోరిక ఒకటి తీర్చాలని ఇటీవలే నెరవేర్చాను. యార్లగడ్డ బాల గంగాధరరావు గారి సౌజన్యంతో తెలుగులో నామవిగ్జ్యాన శాఖలో ఒక పరిశొధన పూర్తి చేశాను. ఆ సిద్ధాంత వ్యాసాన్ని బెర్హంపూర్ విశ్వ విద్యాలయం వారికి పి.హెచ్.డి. పట్టా కోసం సమర్పించాను. ఆ లాంచనాలన్ని ఇటీవలే ముగిశాయి. అదృష్టం ఆలంబనగా నాకు సంక్రమించిన ఈ పేరు ముందు ఇప్పుడు ఒక అక్షరం వచ్చి చేరనుంది. అదే డా. (డాక్టరేట్)"


జీవితాలని అందమైన గులాబి తొ పోలుస్తారు కవులు. ఎ౦దుకో ఇప్పుదు అర్ధమై౦ది. ఎ౦తొ అ౦దమైన రూప౦,చక్కని గుభాళి౦పు మాత్రమే మనము చూస్తాము. కానీ దానికున్న ముళ్లు మనకు కనబడవు. జీవిత౦ కూడా అలా౦టిదే.
పార్వతీశ౦ గారికి అ భగవ౦తుడు మనస్థైర్యాన్ని ఇవ్వాలని, పార్వతీశ౦గారు చక్కని కార్యక్రమాలుప్రేక్షకులకు అ౦ది౦చాలని మనసారా కొరుకుంటూ ... సమీహ.

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

ముసలి హీరో గ్లామర్ - ఒక కార్టూన్


19, ఫిబ్రవరి 2009, గురువారం

అమ్మో ఎఫ్ఫెం రేడియో

ఆ రోజు ఆదివారం. రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువ లేదు. కారు నెమ్మదిగా నడుపుతున్నాను. మా బావ మరిది బెంగుళూరు నుండి వస్తున్నాడు. వెళ్లి రిసీవ్ చేసుకోవాలి. చల్లని గాలి మొహానికి తగులుతూ ఉంటే చాలా హాయిగా ఉంది. నెమ్మదిగా కారులోని పాటల పెట్టెలో ఎఫ్ఫెం రేడియో ట్యూన్ చేశాను. ఎవరో యాంకర్ చాల హుషారుగా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో చెపుతోంది. పక్కవాళ్ళ కోసం బ్రతకకుండా మనకోస౦ మనం జీవించాలని తెలుగు ఇంగ్లీష్ హిందీ కలిపిన భాషలలో చెపుతోంది. మధ్యలో చెప్పడం ఆపి కాలర్ సిధ్ధంగా ఉన్నారు ముందు ఫోన్ చూద్దాం అంటూ ఫోన్ బటన్ నొక్కింది.
యాంకర్: హలో ! గుడ్ మార్నింగ్
అవతలి వ్యక్తి: గుడ్ మార్నింగ్
యాంకర్: మీ పేరు ?
వ్యక్తి: గురుతు పట్టలే?
యాంకర్: ( వయ్యారంగా) లేదు కదా !
వ్యక్తి: మరి గొంతును బట్టి ఎవరు మాట్లాడుతున్నారో చెప్పేస్తా అంటావ్?
యాంకర్: నీ లాటి గొంతులే ముగ్గురికుంటై
వ్యక్తి: మరి పేర్లు చేప్పుకో
యాంకర్: సుధీర్ ?
వ్యక్తి: కాదు కదా?
యాంకర్: రాకేశ్?
వ్యక్తి: కాదు
యాంకర్: పోనీ నీ పేరులోని మొదటి అక్షరం చెప్పు నేను పేరు చెప్పేస్తా
వ్యక్తి: వి
యాంకర్: ఆ దొరికిపోయావ్ విజయ్
విజయ్: అబ్బో బాగానే పట్టవు
యాంకర్: హాయ్ విజయ్ హౌ ఆర్ యు?
విజయ్: ఫైన్. నువ్వెట్లా ఉన్నావ్?
యాంకర్: నేను బాగానే ఉన్నాను విజయ్ . అవును నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది?
విజయ్: అదా అస్తమాను సతాఇస్తాది. నా వైపే చూడట్లే
యాంకర్: అమ్మాయిల మనసు అర్ధం చేసుకోవాలి బాబు. కొత్త అమ్మాయి మరొకరిని పటాయించు.
విజయ్: నువ్వట్లే చెపుతావు. నీ ఫోన్ నంబెర్ చెప్ప రాదు?
యాంకర్: ఏఁ నన్ను పటాయిస్తావ? (నువ్వుతూ)
విజయ్: లేదు కొద్దిగా ట్రై చేస్తా
యాంకర్: అబ్బ ఆశ. విజయ్ నీకో క్లూ ఇస్తాను అమ్మాయిలని ఎలా కన్విన్స్ చేయాలో. అది ఫాలో అయిపో.
విజయ్: ఆ చెప్పు.
యాంకర్: మంచి గిఫ్ట్ తీసుకొని ఆ అమ్మాయి కి కనిపించాలా దూరంగా తిరుగుతూ ఉండు. కొన్ని రోజులకి ఆ అమ్మాయి తప్పక నువ్వంటే ఇష్టపడుతుంది. సరేనా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పలేదు?
విజయ్: సమ్పంగి
యాంకర్: ముద్దుపేరా?
విజయ్: అవును.
యాంకర్: అసలు పేరు?
విజయ్: అమ్మో చెప్పను. అందరికి తెలిసి పోతుంది
యాంకర్: ఆమె ఏఁ చేస్తూ ఉంటుంది?
విజయ్: మా క్లాస్మేటు
యాంకర్: ఇక నేను చెప్పినట్లు చేస్తూ ఉండు విజయ్. బెస్ట్ అఫ్ లక్
విజయ్: ఇక నుండి మీ స్టూడియో దగ్గిర కూడా తిరుగుతూ ఉంటాను.
యాంకర్: విజయ్ నువ్వు చాల ఖతర్నాక్ . ఓకే విజయ్ థాంక్స్ ఫర్ కాలింగ్. బై బై
రేడియో స్విచ్ ఆఫ్ చేశాను. అదీ మాటర్. మనం అన్ని రంగాల్లో చాల ముందు ఉన్నాము. అమ్మాయిలని ఎలా ట్రాప్ చేయాలో కౌన్సలింగ్ కూడా ఇస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త !!

18, ఫిబ్రవరి 2009, బుధవారం

17, ఫిబ్రవరి 2009, మంగళవారం

సమానత్వం పై ఒక కార్టూన్