20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

ముసలి హీరో గ్లామర్ - ఒక కార్టూన్


19, ఫిబ్రవరి 2009, గురువారం

అమ్మో ఎఫ్ఫెం రేడియో

ఆ రోజు ఆదివారం. రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువ లేదు. కారు నెమ్మదిగా నడుపుతున్నాను. మా బావ మరిది బెంగుళూరు నుండి వస్తున్నాడు. వెళ్లి రిసీవ్ చేసుకోవాలి. చల్లని గాలి మొహానికి తగులుతూ ఉంటే చాలా హాయిగా ఉంది. నెమ్మదిగా కారులోని పాటల పెట్టెలో ఎఫ్ఫెం రేడియో ట్యూన్ చేశాను. ఎవరో యాంకర్ చాల హుషారుగా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో చెపుతోంది. పక్కవాళ్ళ కోసం బ్రతకకుండా మనకోస౦ మనం జీవించాలని తెలుగు ఇంగ్లీష్ హిందీ కలిపిన భాషలలో చెపుతోంది. మధ్యలో చెప్పడం ఆపి కాలర్ సిధ్ధంగా ఉన్నారు ముందు ఫోన్ చూద్దాం అంటూ ఫోన్ బటన్ నొక్కింది.
యాంకర్: హలో ! గుడ్ మార్నింగ్
అవతలి వ్యక్తి: గుడ్ మార్నింగ్
యాంకర్: మీ పేరు ?
వ్యక్తి: గురుతు పట్టలే?
యాంకర్: ( వయ్యారంగా) లేదు కదా !
వ్యక్తి: మరి గొంతును బట్టి ఎవరు మాట్లాడుతున్నారో చెప్పేస్తా అంటావ్?
యాంకర్: నీ లాటి గొంతులే ముగ్గురికుంటై
వ్యక్తి: మరి పేర్లు చేప్పుకో
యాంకర్: సుధీర్ ?
వ్యక్తి: కాదు కదా?
యాంకర్: రాకేశ్?
వ్యక్తి: కాదు
యాంకర్: పోనీ నీ పేరులోని మొదటి అక్షరం చెప్పు నేను పేరు చెప్పేస్తా
వ్యక్తి: వి
యాంకర్: ఆ దొరికిపోయావ్ విజయ్
విజయ్: అబ్బో బాగానే పట్టవు
యాంకర్: హాయ్ విజయ్ హౌ ఆర్ యు?
విజయ్: ఫైన్. నువ్వెట్లా ఉన్నావ్?
యాంకర్: నేను బాగానే ఉన్నాను విజయ్ . అవును నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది?
విజయ్: అదా అస్తమాను సతాఇస్తాది. నా వైపే చూడట్లే
యాంకర్: అమ్మాయిల మనసు అర్ధం చేసుకోవాలి బాబు. కొత్త అమ్మాయి మరొకరిని పటాయించు.
విజయ్: నువ్వట్లే చెపుతావు. నీ ఫోన్ నంబెర్ చెప్ప రాదు?
యాంకర్: ఏఁ నన్ను పటాయిస్తావ? (నువ్వుతూ)
విజయ్: లేదు కొద్దిగా ట్రై చేస్తా
యాంకర్: అబ్బ ఆశ. విజయ్ నీకో క్లూ ఇస్తాను అమ్మాయిలని ఎలా కన్విన్స్ చేయాలో. అది ఫాలో అయిపో.
విజయ్: ఆ చెప్పు.
యాంకర్: మంచి గిఫ్ట్ తీసుకొని ఆ అమ్మాయి కి కనిపించాలా దూరంగా తిరుగుతూ ఉండు. కొన్ని రోజులకి ఆ అమ్మాయి తప్పక నువ్వంటే ఇష్టపడుతుంది. సరేనా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పలేదు?
విజయ్: సమ్పంగి
యాంకర్: ముద్దుపేరా?
విజయ్: అవును.
యాంకర్: అసలు పేరు?
విజయ్: అమ్మో చెప్పను. అందరికి తెలిసి పోతుంది
యాంకర్: ఆమె ఏఁ చేస్తూ ఉంటుంది?
విజయ్: మా క్లాస్మేటు
యాంకర్: ఇక నేను చెప్పినట్లు చేస్తూ ఉండు విజయ్. బెస్ట్ అఫ్ లక్
విజయ్: ఇక నుండి మీ స్టూడియో దగ్గిర కూడా తిరుగుతూ ఉంటాను.
యాంకర్: విజయ్ నువ్వు చాల ఖతర్నాక్ . ఓకే విజయ్ థాంక్స్ ఫర్ కాలింగ్. బై బై
రేడియో స్విచ్ ఆఫ్ చేశాను. అదీ మాటర్. మనం అన్ని రంగాల్లో చాల ముందు ఉన్నాము. అమ్మాయిలని ఎలా ట్రాప్ చేయాలో కౌన్సలింగ్ కూడా ఇస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త !!

18, ఫిబ్రవరి 2009, బుధవారం

17, ఫిబ్రవరి 2009, మంగళవారం

సమానత్వం పై ఒక కార్టూన్


16, ఫిబ్రవరి 2009, సోమవారం

మొహమాటపు కార్టూన్




15, ఫిబ్రవరి 2009, ఆదివారం

ఒక సరదా కార్టూన్


"మువ్వల సవ్వడి శైలజ" గారి తో పరిచయం

దూరదర్శన్ సప్తగిరి లొ మువ్వల సవ్వళ్ళు ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండీ కళాకారులు ఈ కార్యక్రమంలొ పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నరంటే ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత చెప్పకనే చెపుతోంది. కూచిపుడి భరతనాట్యం లాటి సాంప్రదాయ నృత్యాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం విశెషంగా ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం నంది అవార్డును కూడా అందుకుందీ అంటే ఆ ఖ్యాతి పూర్తిగా కార్యక్రమ నిర్మాత శ్రీమతి యార్లగడ్డ శైలజ గారిదే. శ్రీమతి యార్లగడ్డ శైలజ గారితొ పరిచయాన్ని సగర్వంగా సమర్పి స్తోంది సమీహ.
విజయవాడ నుండి తెనాలి వెళ్లే దారిలొ పచ్చని చెట్లు, బకింగ్ హొం కెనాల్ ప్రక్కన సారవంతమైన మెట్ట భూములున్న చిన్న అందమైన పల్లెటూరు గుడివాడ. అదే శైలజ గారి స్వగ్రామం. తండ్రి పిన్నక వేంకటేశ్వరరావు గారు ఆరోజుల్లొనే బిఎ.బియిడి చేసిన గ్రేడ్-1 తెలుగు పండిట్. నలుగురు అక్కచెళ్లెళ్లలలో శైలజ గారు చిన్న. ఒక అన్న గారు. అందరూ ఉన్నత విద్యలు అభ్యసించినవారే. తండ్రి ప్రభావం శైలజ గారి మీద చాలా ఉంది. తండ్రి యొక్క సాహితీ పాండిత్యం, తల్లి నుండి సంగీతాభిలాష శైలజ గారికి వచ్చాయి. త్రిపురనేని, నార్ల, విశ్వనాధ సత్యన్నారాయణ, ఇంకా ఇనేక బెంగాలీ నవలలు తండ్రి లైబ్రరీలో ఉండేవిట. వాటిని చదవమని శైలజ గారిని తండ్రి ప్రొత్సహించేవారుట. ఆడపిల్లలకు చదువులు చెప్పించని ఆ రోజులలోనే తండ్రి ఉన్నత భావాలవాలతొ ఆడపిల్లలని గుంటూరు మహిళా కళాశాలలొ చేర్పించారు. సాంఘీక సమానతలు అక్షరాలా పాటించే శైలజ గారి తండ్రి రచయిత, దర్శకులే కాక మంచి ఆదర్శ ఉపాధ్యాయులు కూడా.తండ్రి నుంచి అవే లక్షణాలు పుణికి పుచ్చుకున్నారు శైలజగారు.


దూరదర్శన్ లో మీ ప్రవేశం ఎలా జరిగిందని అడిగినప్పుడు " బి.ఎస్.సి(హొం సైన్స్) చేశాకా తెలుగు భాష మీద అభిమానంతొ భీమవరం డి.ఎన్.ఆర్ కాలేజ్ లొ ఎం.ఏ తెలుగు చేసాను. బాపట్ల రైతు శిక్షణా కేంద్రంలో డిమాన్స్ట్రేటర్ గా ఉద్యోగం వచ్చింది. మహిళా రైతులకు, రైతులకు పోషకాహారం గృహ విజ్గ్యానం గురించి వివరించడం. కాని కొద్దిగా అసంతౄప్తి. ఎక్కడ సాహితీ కార్యక్రమాలు జరుగుతున్నా వెడుతూ ఉండేదానిని. కొన్ని రేడియో కార్యక్రమాలలొ కూడా పాల్గొన్నాను. అలాంటి సమయంలొనే దూరదర్శన్ లొ ప్రొడ్యూసరు ఖాళీ కి దరఖాస్తు చేయడం ఆ ఉద్యోగం నాకు రావడం జరిగింది.రేడియో లాంటి సంస్థే దూరదర్శన్ కూడా కాబట్టి నేను దీనిలోచేరడం జరిగింది. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లొ శిక్షణ పూర్తయ్యాకా నాకు ఎంతో ఇష్టమైన సంస్థలోకి వచ్చిన అనుభూతి కలిగింది. "

మీ కార్యక్రమం మువ్వల సవ్వడి చప్పుళ్లు బాగా వినిపిస్తున్నాయి. వాటి విశేషాలేమిటి అంటే " మువ్వల సవ్వడి ... నిజానికి 24 సంవత్సరాల నా ఉద్యోగ విధులలో కొన్ని వందల కార్యక్రమాలకు నేను దర్శకత్వం వహించినా, మరెన్నొ కార్యక్రమాలు అవార్డులు తెచ్చిపెట్టినా ఇంత పేరు ప్రఖ్యాతులు మరే కార్యక్రమానికీ నాకు రాలేదని మనస్పూర్తిగా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇది శాస్త్రీయ నృత్యానికి సంభంధించిన ఒక చక్కని కాన్సెప్ట్ . అందుచేత దేశ విదేశాలలోని ప్రేక్షకులు ఆదరించారు. ఇంత స్పందన నేనుకూడా ఊహించనిది. మనిషికి శ్వాశ ఎంత అవసరమో ఒక జాతికి సంస్కృతి అంత అవసరం. అటువంటి సంస్కృతిని పెంపొందించేవి లలిత కళలు. ప్రపంచ చిత్ర పటంలో మన నాట్యానికి సమున్నతమైన స్థానం ఉంది. ఎంతో క్లిష్టమైన సకల కళల సమాహారమైన నాట్య కళకు ప్రాచుర్యాన్ని నాట్యశాశ్త్రం పట్ల సామాన్య ప్రేక్షకులకు కూడా అవగాహన కలిపించాలి.ఎంతో మంది యువ కళాకారులలొ ఉన్న నాట్య ప్రతిభను వెలికి తీయాలి అనే సత్సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇంత ఆదరణ పొందుతోందంటే సమాజంలో మన సంస్కృతిపట్ల ఉన్న ఆరాధన, నాట్యశాస్త్రం పట్ల ఉన్న అభిమానం ఆ నటరాజస్వామికి నీరాజనంగా అర్పిస్తున్నారు. నాట్య కళగురించిన విషయాలు, నాట్య కళకు తమ జీవితాల్ని ధార పోసిన మహానుభావులగురించి కుడా ఈ కార్యక్రమంలో చెపుతున్నాము."
ముందుగా ఈ కార్యక్రమానికి ప్రముఖ నాట్య కళాకారిణి శ్రీమతి శొభానాయుడును యాంకరుగా నిర్నయించారుట. ఆమెను సంప్రదించి కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ వివరించడం, ఆమె అంగీకారం ఐనతరువాతి రోజు ఆవిడ అదే కాన్సెప్ట్ తొ మరొక చానల్ లొకార్యక్రమాన్ని ప్రారంభించి విస్మయ పరిచేరుట. ఔరా!! కళా తపస్వి విశ్వనాధ్ గారు, సినారే, నాగేశ్వరరావుగారు, రోజారాణీ, కవిత ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా హాజరయ్యారు. కార్యక్రమం చూసిన విశ్వనాధ్‌గారు "వచ్చే జన్మలో ఆడపిల్లనై పుట్టి మువ్వల సవ్వడిలో నాట్యం చేయాలని ఉంది" అన్నారుట. దూరదర్శన్‌లో కార్యక్రమ నిర్మాణానికి ప్రొడ్యూసర్లకు పరిమితులేమైన ఉన్నాయా అన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక భాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగిగా మా పరిమితులేమిటొ మాకు తెలుసు. కుటుంబానికి ముఖ్యంగా డ్రాయింగ్ రూములొ ప్రధానమైన టీవిద్వారా కుటుంబంలోని వ్యక్తులంతా కలిసి వీక్షించగల కార్యక్రమాలు రూపొందించడానికి దూరదర్శన్‌లొ స్వేచ్హ ఎప్పుడూ ఉంటుంది. వివిధ చానళ్ల హోరులో కూడా దూరదర్శన్ తన ప్రతిష్టను పెంచుకోవడానికి వివిధ కార్యక్రమాల రూపకల్పనలో ప్రొత్సహించే మా డైరక్టర్ డా.పాలకుర్తి మధుసూదన రావుగారికి, ప్రతీ ఒక్కరికీ నా కృతజ్గ్నతలు తెలుపుకోవాలి అన్నారు శైలజ గారు. దూరదర్శన్ మరింత ప్రేక్షకాదరణ పొందాలంటే ఏమి చేయాలని ప్రశ్నిస్తే " దూరదర్శన్‌కి ప్రేక్షకాదరణ ఎప్పటికీ ఉంటుంది. సాహిత్యం, సంగీతం, వ్యవసాయం, జానపద కళారూపాలు, క్రీడలు, వంటివి అందిస్తున్నా యువత అభిరుచిననుసరించి కొత్త కార్యక్రమాలు రావాలి. గొప్ప గొప్ప సెట్టింగ్స్, ఆర్భాటాలు, హంగామా లేకున్నా కార్యక్రమాలని రూపొందించేవారికి ప్రభుత్వ పరంగా ప్రొత్సాహాకాలు అందించాలి ". మరి ఇతర కార్యక్రమ వివరాలు ఏమిటి అంటే మువ్వల సవ్వడిలో రెలిటివ్ స్పెషల్స్ మరింత ఆదరణ సాధించుకుంటే మారాకు తొడిగిన్ చిరుమువ్వల సవ్వడి ఇటీవల హైదరాబాదు విజయవాడల్లో సెలక్షన్లు జరిగాయి. ఇది మూసకట్టు కార్యక్రమమలా కాకుండా ప్రేక్షకులను మరింత దగ్గిరగా చేర్చుకుంటోంది. అలాగే శాశ్త్రీయ సంగీతం ఇతివృత్తంతో గాన గాంధర్వం, విన్నుత్న ప్రక్రియలో రైతే రాజు కార్యక్రమాలు చేస్తున్నాను అన్నారు శైలజ గారు. కార్యక్రమ నిర్మాణం అనేది కుడా ఒక కళ. ఆ కళలొ మీరు ఎంతవరకూసఫలీకృతం అయ్యారని మీరు అనుకుంటున్నారు అని అడిగితే నాకొచ్చిన పురస్కారాలే నేనెంత వరకు సఫలీకృతం అయ్యానో చెపుతాయి. 1984, 1985 సంవత్సరాలలొ రెండు సార్లు నంది అవార్డులు వచ్చాయి. రెండుసార్లు దూరదర్శన్ నేషనల్ అవార్డులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ భాషా పురస్కారం అవార్డు వచ్చింది.మువ్వల సవ్వడి్‌కి ఈ సంవత్సరం మరల నంది అవార్దు వచ్చింది.సిఎమెస్, న్యూ ఢిల్లీ నుండి అవార్డు వచ్చింది. ఇంకా స్వచ్చంద సంస్థలు అందించిన అవార్డులు ఎన్నో. మరి మీ కుటుంబ విషయాలేమిటి కుటుంబ పరంగా ఎలాంటి సహకారం లభిస్తోందని అడిగితే నా భర్త పేరు యార్లగడ్డ కుటుంబరావు. నాకొక కుమార్తె చిరంజీవి శరద్యుతి.మావారు మంచి సంస్కారి. వృత్తిపరంగా ఎనలిస్టిక్ కెమిస్ట్. ఆయన ప్రొత్సాహం లెకుంటే నేను కొన్ని వందల కార్యక్రమాలు రూపొందించగలిగేదానిని కాదు. పగలనకా రాత్రనకా రికార్డింగులు, ఎడిటింగులు చేస్తూ పోతున్నా ఏనాడూ పెదవి విప్పి ఒక పొల్లు మాట అనని మనిషి. ప్రతీ క్షణం నన్ను ప్రొత్సహిస్తూ నాకు ఒక గుర్తింపు రావాలని తపించే నా భర్త, అత్తవారింటి వైపునుండీ వచ్చే అప్యాయతానురాగాలూ ఈ జన్మకివి చాలు అనిపిస్తుంది. నా కూతురు శరద్యుతి భగవంతుడు నాకిచ్చిన ఒక వరం. నేను నేర్చుకోలేనివి ఏవైనా తనద్వారా తీర్చుకోవాలని ఎంతో ఆశ. గత ఆరు సంవత్సారాలుగా భరత నాట్యం నేర్చుకుంటోంది. రామంతాపూర్ పబ్లిక్ స్కూల్‌లొ చదువుకుంటోంది. నేను తనకోసం కాక ఆఫీసుకు కష్టపడుతూంటే చూసి ఆనందించేంత పెద్ద మనసున్న చిన్న తల్లి అన్నారు శైలజ గారు. ఎన్నొ అవార్డులు సొంతం చేసుకుని, ఒక ప్రభుత్వ సంస్థలొ అసిస్టంట్ డైరక్టర్ హోదాలో ఉన్న మహిళ తన భర్త, కూతురు విషయం వచ్చేసరికి ఒక ఇల్లాలిగా ఒక మాతృమూర్తిగా స్పందిచడం.......... ఇదే భారతీయ స్త్రీలు కుటుంబానికి ఇచ్చే గౌరవం... ఇది వారి గొప్పదనం. శైలజగారు మరెన్నొ ప్రేక్షకాదరణ పొందే కార్యక్రమాలు రూపొందించాలని కోరుకుంటూ.....అభినందనలతో సమీహ ..

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

ప్రముఖ చిత్రకారుడు "బాలి"తో కబుర్లు - రె౦డవ భాగ౦

(బాలిగారితొ కబుర్లు గత వార౦ కొన్ని సా౦కేతిక కారణాలవల్ల కుది౦చవలసి వచ్చి౦ది. ఆయన, బ్లాగులొ ప్రచురణ నిమిత్త౦ ఇచ్చిన బొమ్మలు కూడా పూర్తిగా ఉ౦చడ౦ కుదరలేదు.ఇక్కడ మిగిలిన భాగాన్నివ్రాస్తున్నాను )
కళల గురి౦చి మాట్లాడుతు బాలి ఒక జోకు చెప్పేరు.గురువు దగ్గిర విద్యను పూర్తి చేసుకున్న ఒక శిష్యుడు ఇరవై స౦వత్సరాలు తపస్సు చేసి నీటి మీద నడవడ౦ నేర్చుకున్నడుట. గురువు దగ్గిరకొచ్చి గురువర్యా నేను తపశ్శక్తితొ నీటి మీదనడవడ౦ నేర్చుకున్నాను. ఈ నది ఆవలి వడ్డు కి ఇప్పుడు నేను సులువుగా వెళ్లిపోగలను అని చెప్పాడుట. దానికి గురువు ఓరి నీ మొహ౦ మ౦డా! ఇదు నిమిషాలలొ పడవలో వెళ్లిపోయే పనికి ఇరవై స౦వత్సరాలు వృధా ఛేసావుకదా అని తిట్టి ప౦పి౦చాడుట. చేసినపనికి, నేర్చుకున్న కళకి సార్ధక౦ ఉ౦డాలి. పలువురు మెచ్చాలి అన్నది నా ఉద్దేశ్య౦ అన్నారు బాలి. బాలి బొమ్మలు తెలుగు సా౦ప్రదాయాన్ని పల్లె వాతావరణాన్నిచక్కగా ప్రతిబి౦బిస్తాయి.ఆయన పెరిగిన వాతావరణ౦ కూడా అలాటిదే. "మా అమ్మ పేరు అన్నపూర్ణ, నాన్న పేరు లక్శణరావు. అమ్మ చక్కగా పాడేది. రాత్రిపూట ఆ౦జనేయ ద౦డక౦ మొత్త౦ చదివి ఇక పడుకో౦డి. తెల్లవార్లూ ఆ౦జనేయుడు మన చుట్టూ తిరుగుతూ మనకి కాపలా ఉ౦టాడు, దెయ్య౦వచ్చినా దొ౦గోడు వచ్చినా చ౦పేస్తాడు అని అనేది. మే౦ ప్రొద్దుట లేస్తూనే రాత్రి ఆ౦జనేయుడు వచ్చడా అని ఆడిగేవాళ్ల౦. ఈ రాత్రి మీకు చూపిస్తాలే అని అమ్మ అనేది. అవి రె౦డొ ప్రప౦చ యుద్ద౦ చివరి రోజులు.మా నాన్న మిలటరీ లోనే కదా ఉద్యోగ౦. మా అమ్మ , మాకు ధైర్య౦ చెపుతూ తాను ధైర్య౦ పొ౦దేది. మా నాన్న ను౦డి ఉత్తరాలు వచ్చేవి. ఇటలీ, సి౦గపూర్ ల ను౦డి వచ్చేవి. కొన్నాళ్లకు మా నాన్నగారు ఊటీ లోని వెల్లి౦గ్టన్ తీసుకువెళ్లి పోయారు. అక్కడ మరో స౦త్సరానికి మా నన్నగారు చనిపోయారు. మళ్లీ మేము అనకాపల్లిలోని మా మామయ్య ఇ౦టికి వచ్చేసాము. మా అమ్మ దుఖ్ఖ్హ౦తో మా నాన్నకుస౦భ౦ధి౦చిన మిలిటరీ పెట్టెలని ఒక పన్నె౦డేళ్లపాటు తెరవలేదు. దానిలొ మిలటరీ ఉన్ని బట్టలు, ఫొటోలు కాగితాలు పెన్నుఉన్నాయి. ఇవి కాక అరలో చైనా రన్గు కేకు, బ్రష్ లు ఉన్నాయి. ఇ౦కా ఒక పైయిటి౦గు ఉన్నాయి. దానిలోచెట్లూ, కొ౦డలూ, అడవులూ, సన్నని బాటలో సైకిలు తొక్కుతున్న వ్యక్తి ఉన్నాయి. ఇవన్నీ నాలోపరోక్ష౦గా బీజాలు నాటాయి. ఇ౦తలో ప్రభుత్వ ఉద్యోగ౦ వచ్చి౦ది. జీవన బృతికి తప్పదుకదా!ఉద్యోగ౦ చేస్తూ౦డగానే ఆ౦ధ్రజ్యోతి విజయవాడ ను౦డీ పిలుపు వచ్చి౦ది. శ౦కర్రావు పేరు బాలి గా మారడ౦మిగిలి౦ది మీకు తెలిసి౦దే. బొమ్మలు వేయడ౦లో నాకు పరిపూర్ణమైన ఆన౦ద౦ విజయ౦ లభి౦చాయి.
బాలిగారికి ధన్యవాదాలతో సమీహ ....... ...

5, ఫిబ్రవరి 2009, గురువారం

ప్రముఖ చిత్రకారుడు "బాలి" తో కబుర్లు



సమీహ బ్లాగుకోసం మీ ఇంటర్వ్యూ కావాలని అడిగితే ఇంటికి రండీ అని పిలిచారు బాలి. ఒక సాయంవేళ సికిందరాబాదు సీతఫల్మండీ లోని వారి ఫ్లాటుకి వెళ్లాను.తలుపు తెరిచి సాదరంగా అహ్వానించారు. చిత్రకారుడి ఇల్లు ఎలా ఉండాలో అలాగే ఉంది వారి ఫ్లాటు. కుర్చీలో అసీనులయ్యకా సుభ్రపరచిన ద్రాక్ష పళ్లని ప్లేటు నిండా ఉంచి తీసుకువచ్చారు. వాటిని తింటూ మా కబుర్లు ప్రారంభించాము. దాదాపు ఆరు సంవత్సరాల క్రితం నేను మొదటి సారి బాలిగారిని కలిసేను. తెల్లని ఛాయ , నల్లని(?) ఒత్తైన జుట్టూ , ఒత్తైన మీస కట్టూ , మొహం లొ బిడియం, ఎప్పుడు మడత నలగని విస్త్రీ బట్టలు, టక్ తొ సినిమా హీరోలా ఉంటారు. ఆయన పుట్టింది అనకాపల్లి దగ్గిర చిన్న పల్లెటూరులో. తండ్రి మిలటరిలొ పనిచేసేవారు. తల్లి స0రక్షణ లొనే బాలి పెరిగేరు. మీకు బాలి అన్న పేరు ఎలా వచ్చింది అని అడిగితే నా అసలు పేరు శంకర రావు. శంకరరావు పేరు ను "బాలి" గా మర్చింది గురువుగా తలంచే పురాణం సుబ్రమణ్య శర్మగారు. న్యూమరాలజి ప్రకారం నా పేరు "బ" తొ ప్రారంభమైతే మంచిదని పురాణం వారు "బాలి" అని పెట్టారు. భమిడిపాటి వారు నన్ను నిజమైన మగాడు అనేవారు ఎందుకంటే "బాలిక" అంటే అమ్మాయి, స్త్రీ, మరి "బాలిక" లొ "క" లేదుకాబట్టీ మగాడే కదా అని చమత్కరించారుట. బాలి గారి చిన్నతనంలొనే తండ్రి చనిపొతే తల్లి దగ్గిరే పెరిగారు. మీకు చిత్రకారుడు కావాలనే కోరిక ఎలా కలిగిందని అడిగితే అమ్మ చేతిలోని సుద్దముక్క అలవోకగా ఖచ్చితమైన కొలతలతొ చుక్కల చుట్టూ తిరుగుతూ ఉంటే నేల మీద మంత్రం వేసి పూలతీగను పరచినంత ఆనందంగా ఉండేది. అదే నాకు స్పూర్తి అంటారు బాలి. చిన్నతనంలొ బాలి వేసిన బొమ్మలను ఆయన తల్లే సరిదిద్దేదిట. తండ్రి కుడా చక్కని చిత్రకారుడే .చిన్నతనంలొ సీనియర్ స్టూడెంట్ కస్తురిరావు దగ్గిర ఇంకు, బ్రష్ లతొ బొమ్మలు వేయడం నేర్చుకున్నాను. మరి చిత్రకళలో మీకు గురువులెవరైనా ఉన్నరా అంటే చిత్రకళా రంగంలో నాకు గురువులు అంటూ ఎవరూ లేరు అలాగని ఎవరినీ ఇమిటేట్ చేయలేదు.తెలుగులో అప్పటికే బొమ్మలు వేస్తున్న బాపు దగ్గిరనుండీ తమిళంలో వేస్తున్న గోపులు బొమ్మల నుండి బెంగాలు చితర్ చటర్జీ వరకు అందరి బొమ్మలూ గమనించే వాడిని. సంఘటన తీసుకొని బొమ్మలు వేయడం అనుభవం మీద నేర్చుకున్నాను. చిత్రకళ లొ నాకు ఎప్పుడు పేరు వచ్చిందో నాకు తెలీలేదు. నేను పత్రికలు ప్రచురితమయ్యే విజయవాడ లొ గాని మదరాసులొగాని ఉండి ఉంటే నేను ఇంకా పేరు తెచ్చుకునే వీలు కలిగేది అంటారు బాలి. మరి చిత్రకారుడిగా మీ ప్రస్తానం ఎలా ప్రారంభమయిందని అడిగితే ఈనాడు తెలుగు దిన పత్రిక మొట్ట మొదటి కార్టూనిస్టు నేనే . రామోజీరావుగారు స్టాఫ్ ఆర్టిస్టుగా తీసుకోవడం పెద్ద మలుపు. అందులో ఉన్నప్పుడు అన్ని విభాగాల్లోనూ పని చేసాను. యానిమేషన్ గురించి తెలుసుకున్నది అక్కడే అంటారు. రామాయణ, భారత, భాగవత కధలకు బాలి వేసిన బొమ్మలు చూస్తే కధలలోని ఘట్టాలు మన కనుల ముందు సజీవంగా సాక్షాత్కరిస్తాయి. ఎన్నో కధలకు బొమ్మలు, నవలలకి ముఖ చిత్రాలు గీసారు.నవలల ముఖచిత్రాల గురించి ఒక విషయం చెప్పారు బాలి.ఒక పబ్లిషర్ డెజైన్ విషయమై పిలిచారు. తీరా వెళ్లిన తరువాత నవలలు ముందుగా బాపుగారికి పంపుతాను. ఆయన కాదంటే మీకిస్తానని బేరం పెట్టాడుట. సరే నని బాలిగారు షాపు మెట్లు దిగుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఎప్పటికైన ఆ అల్మారాలలొ నా బొమ్మల కవర్ డిజైన్లతొ నవలలు ఉండకపొవు అనుకున్నరుట. తరువాతి ఆరు నెలల్లొ అదే షాపులొ ఆ చివరినుండి ఈ చివరివరకు బాలి గీసిన ముఖచిత్ర బొమ్మలతొ నిండిపొయాయిట. ఆ విశ్వాసమే ఆయనను ఎన్నొ మెట్లు ఎక్కించింది. నా ఉద్దెశ్యంలొ బాపు తరువాతి స్థానం ఖచ్చితంగా బాలిదే. బాలి గీతలలొ లాలిత్యం, తెలుగుతనం అణువణువునా కనిపిస్తాయి.బాలి బొమ్మలు ప్రతి ఒక్కరికి ఆప్తులుగా దగ్గిర మనుషులుగా కనిపిస్తాయి. కాని బాలిగారికి రావలసింత పేరు రాలేదేమొ అనిపిస్తుంది.మరి చిత్రకారుడిగా ఎలాంటి అనుభవం కలిగిందని అడిగితే బొమ్మలు గీయడంలొ నాకు పరిపూర్ణమైన ఆనందం లభించింది. గొప్ప గుర్తింపులు రాలేదుగాని న్యుజిలాండ్ బైబిల్ సొసైటి వారు నా చేత బొమ్మలు వేయించారు. అలాగే జర్మనీ లొ పర్యావరణం గురించి జరిగిన సదస్సులొ నా బొమ్మలతొ కూడిన పుస్తకాన్ని వెలువరించారు. గుంటూరు చిత్ర కళాపీఠం వారు నాకు "చిత్రకళా సామ్రాట్" అనే బిరుదుని ఇచ్చారు. ఇవన్నినాకు సంతోషం కలిగించే అంశాలే అంటారు. బాపుగారి గురించి చెపుతూ మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహిత్య మహా సభలొ "వంగూరి ఫౌండేషన్" వారు బాలి కార్టూన్ల పుస్తకాని బాపుగారి చేత ఆవిష్కరింప చేసారుట. ఆ పుస్తకాన్ని బాపుగారు తిరగేస్తుంటే " కాస్త ఒపికగా చూడండి సార్" అని బాలి గారంటే, బాపు "బాలీ మీకు తెలీకపొవచ్చు. నేను మీ బొమ్మల అభిమనిని" అన్నారుట . ఇంతకన్నా కాంప్లిమెంట్స్ నాకేం కావలి అంటారు బాలి. మరి మీ కార్టూన్ల గురించిన విషయాలు ఎమిటి అంటే కార్టూన్లు గీస్తున్నానుగాని నవ్వించగల "ఫన్" మాటలలొ పలికించలేక పొతున్ననేమో అనిపిస్తోంది అంటారు. ఆయన అలా అన్నా బాలి కార్టూన్లు నవ్వించలేవు అని అనగల వ్యక్తి ఉండడు అనడం అతిశయోక్తి కాదు. పత్రికారంగం ఎలా ఉందని అడిగితే "పబ్లిషర్లు పత్రికాధిపతులు లక్షలు పెట్టి పత్రికలు నడుపుతారు. కాని ఆర్టిస్టు దగ్గిరకొచ్చేసరికి సరియైన పారితోషికం ఇవ్వడానికి వారికి మనసొప్పదు.ఈ విధానం మారాలి అంటారు. మరి మీ కుటుంబ విషయాలు చెపుతారా అన్నప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మయి వైశాలి ఒక అబ్బయి గోకుల్. ఇద్దరూ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు.అమ్మాయికి ఇద్దరు పిల్లలు చరణి, చందు.వీరి పేర్లతోనే నేను కార్టూన్ స్ట్రిప్ గీసాను. మరి మీ ప్రస్తుత కార్యక్రమాలు ఏమిటి అంటే కొత్త పత్రికలు వచ్చేయి వాటికి బొమ్మలు గీస్తున్నాను. బొమ్మలు గీస్తూనే ఉంటాను.అదే నాకు ఆనందం అంటారు. బాలిగారి కార్టూనులతొ మూడు సంకలనాలు వెలువడ్డాయి. బాలి గారి కలం నుండి మరెన్నో అద్భుతాలు జాలువారాలని కొరుకుంటూ.... సమీహ

31, జనవరి 2009, శనివారం

మనుషులు మంచోళ్లేగానీ ....!!

ఆఫీస్ లొ పని చేసుకుంటున్నాను. మా కొలీగ్ సుబ్బారావు వచ్చి "మనుషులులలొ మంచితనం ఇంకా వుందోయి" అన్నాడు. ఎందుకొ మీకు షడన్ గా అంత నమ్మకం కలిగింది అన్నాను. మొన్న ఒక షాపింగ్ మాల్ కి వెళ్లాము. అక్కడ ఎవరో ఒక కంపెనీ వాళ్లు ఒక చీటీ ఇచ్చి వివరాలు వ్రాసి ఇమ్మన్నారు. లక్కీ డిప్ తీసి ప్రైజ్ వస్తే ఇస్తారుట. అది కేవలం కంపెనీ సేల్స్ పెంచడానికి వాళ్లు అలా ప్రైజులు ఇస్తారట. నేను నమ్మలేదు గాని ఇవాళ ఫొన్ చేసి మీకు లక్కీ డిప్ లొ ప్రైజ్ వచ్చింది అని చెప్పేక మనుషులలొ మంచితనం వుందని నమ్ముతున్నాను అన్నాడు అనందంగా. సుబ్బరావు గారు నాకు ఇలాంటి విషయాలలొ నమ్మకం లేదు. మీరూ నమ్మకండి అన్నాను. భలే వాడివే ! దీంట్లొ నేను నష్ట పొయేది ఎముందిలే. వాళ్లు ప్రైజ్ తీసుకొవడానికి భార్యా సమేతంగా రమ్మని అహ్వానిన్స్టున్నప్పుడు వెళ్లకపోతే బాగుండదు. పైగా ఆదివారం. వెడితే కాస్త కాలక్షేపంగా కూడా ఉంటుంది. పైగా ప్రైజ్లు ఇచ్చేది ఒక స్టార్ హొటల్ లొ అన్నాడు. సరే మీ ఇస్టం అన్నాను. ఆదివారం గడిచిపొయింది. మరల సోమవారం ఆఫీసు లొ సుబ్బారావు కలిసేడు గాని నన్ను పలకరించకుండానే వెళ్లిపొయాదు. సరేలే ఏదో పనిలొ ఉన్నడేమొ అనుకున్నాను. లంచ్ టైం లొ కుడా నన్ను వదిలెసి లంచ్ చేస్తున్నప్పుడు గాని నాకు అర్ధం కాలేదు సుబ్బరావు నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు అని. నేనే అతని సీటు దగ్గిరకి వెళ్లి ఏమిటి సంగతి అని అడిగేను. సుబ్బరావు ఒక్కసారిగా కళ్ల నీళ్ల పర్యంతం అయ్యాడు. నేను ఖంగారుగా ఏమిటి సుబ్బరావు గారూ ఎమైంది అని అడిగాను. నా మనసు పరి పరి విధాలుగా పొయింది. సుబ్బరావు గారి మొహం ఎర్రగా మారింది. మీరు చెప్పింది నెజమే అన్నాడు. ఏ విషయం అన్నాను నేను. మొన్న ప్రైజ్ వచ్చిందని చెప్పానే అది. ఏం జరిగింది అడిగాను నేను. అతడు చెప్పడం ప్రారంభించాడు. నేను మా ఆవిడ ప్రైజ్ తీసుకొవాడానికి ఆదివారం వాళ్లు చెప్పిన హొటల్ కి వెళ్లాము. అది నిజంగానె పెద్ద హొటల్. ఎసి కూడా ఉంది. మమ్మల్ని ఒక హాలు లొ కూర్చొపెట్టారు. ఒక అందమైన అమ్మాయి వచ్చి మీకు ఇంగ్లిష్ లొ చెప్పాలా హిందీ లో చెప్పలా లేక తెలుగు లొ చెప్పాలా అని అడిగింది. నాకు అర్ధం గాక పొయినా తెలుగులొనే చెప్పమని అన్నాను. ముందుగా నాకు వచ్చె జీతం నేను ఎక్కడ పని చేస్తాను లాంటి వివరాలు అడిగింది. తరువాత హైదరాబాదులోని వివిధ ప్రాంతాలలోని ప్లాట్ల విషయాలు చెప్పడం ప్రారంభించి ఏ ప్లాటు తీసుకుంటారు అని అడిగింది. అమ్మా నాకు ప్లాటు తీసుకొనే ఉద్దేస్యం లేదు తీసుకొనే శక్తి ఒపికా లేదు అన్నాను నేను. చాలా సేపు చాలా విధాలుగా చెప్పి చూసింది. నా సంగతి నీకు తెలుసుగా. ప్లాటు కొనే శక్తి లేదని. మరెందుకు వచ్చారని అడిగింది. అదేమిటమ్మా మీరే కదా ప్రైజ్ తీసుకోవడానికి రమ్మని అన్నారు అంటే చాల చులకనగా మాట్లాడింది. నా భార్యా నేను అవమానాన్ని దిగమింగుకుని వచ్చేసాము అన్నాడు. పొలీసు కేసు పెట్టాలిసింది అన్నాను నేను. పొందిన అవమానం చాలు పొలీసు కేసు కూడా ఎందుకు అంది మా ఆవిడ. ఇదే మన బలహీనత వాళ్ల బలం. ఇలాంటి సంఘటనలు ఎప్పటినుండొ జరుగుతున్నాయి అని నాకు తెలుసు. అయినా సుబ్బరావు లాంటి వాళ్ళు మోసపొతూనే ఉన్నారు. ఇది క్రితం నెలలొ మా మిత్రునికి జరిగింది. మరొకరు మోసపొకూడదనే నా తాపత్రయం. "ఉచితం అంటే దూరంగా ఉండడం సముచితం "అన్నది విషయం.