5, ఫిబ్రవరి 2009, గురువారం

ప్రముఖ చిత్రకారుడు "బాలి" తో కబుర్లు



సమీహ బ్లాగుకోసం మీ ఇంటర్వ్యూ కావాలని అడిగితే ఇంటికి రండీ అని పిలిచారు బాలి. ఒక సాయంవేళ సికిందరాబాదు సీతఫల్మండీ లోని వారి ఫ్లాటుకి వెళ్లాను.తలుపు తెరిచి సాదరంగా అహ్వానించారు. చిత్రకారుడి ఇల్లు ఎలా ఉండాలో అలాగే ఉంది వారి ఫ్లాటు. కుర్చీలో అసీనులయ్యకా సుభ్రపరచిన ద్రాక్ష పళ్లని ప్లేటు నిండా ఉంచి తీసుకువచ్చారు. వాటిని తింటూ మా కబుర్లు ప్రారంభించాము. దాదాపు ఆరు సంవత్సరాల క్రితం నేను మొదటి సారి బాలిగారిని కలిసేను. తెల్లని ఛాయ , నల్లని(?) ఒత్తైన జుట్టూ , ఒత్తైన మీస కట్టూ , మొహం లొ బిడియం, ఎప్పుడు మడత నలగని విస్త్రీ బట్టలు, టక్ తొ సినిమా హీరోలా ఉంటారు. ఆయన పుట్టింది అనకాపల్లి దగ్గిర చిన్న పల్లెటూరులో. తండ్రి మిలటరిలొ పనిచేసేవారు. తల్లి స0రక్షణ లొనే బాలి పెరిగేరు. మీకు బాలి అన్న పేరు ఎలా వచ్చింది అని అడిగితే నా అసలు పేరు శంకర రావు. శంకరరావు పేరు ను "బాలి" గా మర్చింది గురువుగా తలంచే పురాణం సుబ్రమణ్య శర్మగారు. న్యూమరాలజి ప్రకారం నా పేరు "బ" తొ ప్రారంభమైతే మంచిదని పురాణం వారు "బాలి" అని పెట్టారు. భమిడిపాటి వారు నన్ను నిజమైన మగాడు అనేవారు ఎందుకంటే "బాలిక" అంటే అమ్మాయి, స్త్రీ, మరి "బాలిక" లొ "క" లేదుకాబట్టీ మగాడే కదా అని చమత్కరించారుట. బాలి గారి చిన్నతనంలొనే తండ్రి చనిపొతే తల్లి దగ్గిరే పెరిగారు. మీకు చిత్రకారుడు కావాలనే కోరిక ఎలా కలిగిందని అడిగితే అమ్మ చేతిలోని సుద్దముక్క అలవోకగా ఖచ్చితమైన కొలతలతొ చుక్కల చుట్టూ తిరుగుతూ ఉంటే నేల మీద మంత్రం వేసి పూలతీగను పరచినంత ఆనందంగా ఉండేది. అదే నాకు స్పూర్తి అంటారు బాలి. చిన్నతనంలొ బాలి వేసిన బొమ్మలను ఆయన తల్లే సరిదిద్దేదిట. తండ్రి కుడా చక్కని చిత్రకారుడే .చిన్నతనంలొ సీనియర్ స్టూడెంట్ కస్తురిరావు దగ్గిర ఇంకు, బ్రష్ లతొ బొమ్మలు వేయడం నేర్చుకున్నాను. మరి చిత్రకళలో మీకు గురువులెవరైనా ఉన్నరా అంటే చిత్రకళా రంగంలో నాకు గురువులు అంటూ ఎవరూ లేరు అలాగని ఎవరినీ ఇమిటేట్ చేయలేదు.తెలుగులో అప్పటికే బొమ్మలు వేస్తున్న బాపు దగ్గిరనుండీ తమిళంలో వేస్తున్న గోపులు బొమ్మల నుండి బెంగాలు చితర్ చటర్జీ వరకు అందరి బొమ్మలూ గమనించే వాడిని. సంఘటన తీసుకొని బొమ్మలు వేయడం అనుభవం మీద నేర్చుకున్నాను. చిత్రకళ లొ నాకు ఎప్పుడు పేరు వచ్చిందో నాకు తెలీలేదు. నేను పత్రికలు ప్రచురితమయ్యే విజయవాడ లొ గాని మదరాసులొగాని ఉండి ఉంటే నేను ఇంకా పేరు తెచ్చుకునే వీలు కలిగేది అంటారు బాలి. మరి చిత్రకారుడిగా మీ ప్రస్తానం ఎలా ప్రారంభమయిందని అడిగితే ఈనాడు తెలుగు దిన పత్రిక మొట్ట మొదటి కార్టూనిస్టు నేనే . రామోజీరావుగారు స్టాఫ్ ఆర్టిస్టుగా తీసుకోవడం పెద్ద మలుపు. అందులో ఉన్నప్పుడు అన్ని విభాగాల్లోనూ పని చేసాను. యానిమేషన్ గురించి తెలుసుకున్నది అక్కడే అంటారు. రామాయణ, భారత, భాగవత కధలకు బాలి వేసిన బొమ్మలు చూస్తే కధలలోని ఘట్టాలు మన కనుల ముందు సజీవంగా సాక్షాత్కరిస్తాయి. ఎన్నో కధలకు బొమ్మలు, నవలలకి ముఖ చిత్రాలు గీసారు.నవలల ముఖచిత్రాల గురించి ఒక విషయం చెప్పారు బాలి.ఒక పబ్లిషర్ డెజైన్ విషయమై పిలిచారు. తీరా వెళ్లిన తరువాత నవలలు ముందుగా బాపుగారికి పంపుతాను. ఆయన కాదంటే మీకిస్తానని బేరం పెట్టాడుట. సరే నని బాలిగారు షాపు మెట్లు దిగుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఎప్పటికైన ఆ అల్మారాలలొ నా బొమ్మల కవర్ డిజైన్లతొ నవలలు ఉండకపొవు అనుకున్నరుట. తరువాతి ఆరు నెలల్లొ అదే షాపులొ ఆ చివరినుండి ఈ చివరివరకు బాలి గీసిన ముఖచిత్ర బొమ్మలతొ నిండిపొయాయిట. ఆ విశ్వాసమే ఆయనను ఎన్నొ మెట్లు ఎక్కించింది. నా ఉద్దెశ్యంలొ బాపు తరువాతి స్థానం ఖచ్చితంగా బాలిదే. బాలి గీతలలొ లాలిత్యం, తెలుగుతనం అణువణువునా కనిపిస్తాయి.బాలి బొమ్మలు ప్రతి ఒక్కరికి ఆప్తులుగా దగ్గిర మనుషులుగా కనిపిస్తాయి. కాని బాలిగారికి రావలసింత పేరు రాలేదేమొ అనిపిస్తుంది.మరి చిత్రకారుడిగా ఎలాంటి అనుభవం కలిగిందని అడిగితే బొమ్మలు గీయడంలొ నాకు పరిపూర్ణమైన ఆనందం లభించింది. గొప్ప గుర్తింపులు రాలేదుగాని న్యుజిలాండ్ బైబిల్ సొసైటి వారు నా చేత బొమ్మలు వేయించారు. అలాగే జర్మనీ లొ పర్యావరణం గురించి జరిగిన సదస్సులొ నా బొమ్మలతొ కూడిన పుస్తకాన్ని వెలువరించారు. గుంటూరు చిత్ర కళాపీఠం వారు నాకు "చిత్రకళా సామ్రాట్" అనే బిరుదుని ఇచ్చారు. ఇవన్నినాకు సంతోషం కలిగించే అంశాలే అంటారు. బాపుగారి గురించి చెపుతూ మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహిత్య మహా సభలొ "వంగూరి ఫౌండేషన్" వారు బాలి కార్టూన్ల పుస్తకాని బాపుగారి చేత ఆవిష్కరింప చేసారుట. ఆ పుస్తకాన్ని బాపుగారు తిరగేస్తుంటే " కాస్త ఒపికగా చూడండి సార్" అని బాలి గారంటే, బాపు "బాలీ మీకు తెలీకపొవచ్చు. నేను మీ బొమ్మల అభిమనిని" అన్నారుట . ఇంతకన్నా కాంప్లిమెంట్స్ నాకేం కావలి అంటారు బాలి. మరి మీ కార్టూన్ల గురించిన విషయాలు ఎమిటి అంటే కార్టూన్లు గీస్తున్నానుగాని నవ్వించగల "ఫన్" మాటలలొ పలికించలేక పొతున్ననేమో అనిపిస్తోంది అంటారు. ఆయన అలా అన్నా బాలి కార్టూన్లు నవ్వించలేవు అని అనగల వ్యక్తి ఉండడు అనడం అతిశయోక్తి కాదు. పత్రికారంగం ఎలా ఉందని అడిగితే "పబ్లిషర్లు పత్రికాధిపతులు లక్షలు పెట్టి పత్రికలు నడుపుతారు. కాని ఆర్టిస్టు దగ్గిరకొచ్చేసరికి సరియైన పారితోషికం ఇవ్వడానికి వారికి మనసొప్పదు.ఈ విధానం మారాలి అంటారు. మరి మీ కుటుంబ విషయాలు చెపుతారా అన్నప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మయి వైశాలి ఒక అబ్బయి గోకుల్. ఇద్దరూ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు.అమ్మాయికి ఇద్దరు పిల్లలు చరణి, చందు.వీరి పేర్లతోనే నేను కార్టూన్ స్ట్రిప్ గీసాను. మరి మీ ప్రస్తుత కార్యక్రమాలు ఏమిటి అంటే కొత్త పత్రికలు వచ్చేయి వాటికి బొమ్మలు గీస్తున్నాను. బొమ్మలు గీస్తూనే ఉంటాను.అదే నాకు ఆనందం అంటారు. బాలిగారి కార్టూనులతొ మూడు సంకలనాలు వెలువడ్డాయి. బాలి గారి కలం నుండి మరెన్నో అద్భుతాలు జాలువారాలని కొరుకుంటూ.... సమీహ

8 కామెంట్‌లు:

  1. చాలా బావుంది. చిన్నప్పుడు ఆంధ్రజ్యోతి వారపత్రికలో మల్లాది, యండమూరి సీరియల్స్ చదివేప్పుడు, వాటికి బాలి గారు వేసిన బొమ్మలు చూసి చాలా ఆనందించే వాడిని. అప్పట్లో ఓ సీరియల్ (స్వర్ణ సీత) బాలి బొమ్మల కోసం, వారం వారం సేకరించి, చివరకు పుస్తకంగా కుట్టి పెట్టుకున్నాను. అది ఇప్పటికీ ఉంది మా ఇంట్లో.

    రిప్లయితొలగించండి
  2. ప్రముఖ చిత్రకారులు బాలి గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ!

    రిప్లయితొలగించండి
  3. నాకిష్టమైన కార్టూనిస్టులలో ప్రముఖ చిత్రకారులు బాలిగారు ఒకరు. ఆయనతో మీ కబుర్లు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. Excellent Artist and excellent presentation. Blog is so good. :)

    Sasi

    రిప్లయితొలగించండి
  5. 'నల్లని(?) ఒత్తైన జుట్టూ'బాగుంది :)

    రిప్లయితొలగించండి
  6. థాంక్సండీ కొత్తపాళీ వారూ

    రిప్లయితొలగించండి
  7. idhentandi baabu nakii blog alavatu chesaru.
    system open cheyagane thappanisariga chudalsivasthondhi
    kacha

    రిప్లయితొలగించండి