31, జనవరి 2009, శనివారం

మనుషులు మంచోళ్లేగానీ ....!!

ఆఫీస్ లొ పని చేసుకుంటున్నాను. మా కొలీగ్ సుబ్బారావు వచ్చి "మనుషులులలొ మంచితనం ఇంకా వుందోయి" అన్నాడు. ఎందుకొ మీకు షడన్ గా అంత నమ్మకం కలిగింది అన్నాను. మొన్న ఒక షాపింగ్ మాల్ కి వెళ్లాము. అక్కడ ఎవరో ఒక కంపెనీ వాళ్లు ఒక చీటీ ఇచ్చి వివరాలు వ్రాసి ఇమ్మన్నారు. లక్కీ డిప్ తీసి ప్రైజ్ వస్తే ఇస్తారుట. అది కేవలం కంపెనీ సేల్స్ పెంచడానికి వాళ్లు అలా ప్రైజులు ఇస్తారట. నేను నమ్మలేదు గాని ఇవాళ ఫొన్ చేసి మీకు లక్కీ డిప్ లొ ప్రైజ్ వచ్చింది అని చెప్పేక మనుషులలొ మంచితనం వుందని నమ్ముతున్నాను అన్నాడు అనందంగా. సుబ్బరావు గారు నాకు ఇలాంటి విషయాలలొ నమ్మకం లేదు. మీరూ నమ్మకండి అన్నాను. భలే వాడివే ! దీంట్లొ నేను నష్ట పొయేది ఎముందిలే. వాళ్లు ప్రైజ్ తీసుకొవడానికి భార్యా సమేతంగా రమ్మని అహ్వానిన్స్టున్నప్పుడు వెళ్లకపోతే బాగుండదు. పైగా ఆదివారం. వెడితే కాస్త కాలక్షేపంగా కూడా ఉంటుంది. పైగా ప్రైజ్లు ఇచ్చేది ఒక స్టార్ హొటల్ లొ అన్నాడు. సరే మీ ఇస్టం అన్నాను. ఆదివారం గడిచిపొయింది. మరల సోమవారం ఆఫీసు లొ సుబ్బారావు కలిసేడు గాని నన్ను పలకరించకుండానే వెళ్లిపొయాదు. సరేలే ఏదో పనిలొ ఉన్నడేమొ అనుకున్నాను. లంచ్ టైం లొ కుడా నన్ను వదిలెసి లంచ్ చేస్తున్నప్పుడు గాని నాకు అర్ధం కాలేదు సుబ్బరావు నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు అని. నేనే అతని సీటు దగ్గిరకి వెళ్లి ఏమిటి సంగతి అని అడిగేను. సుబ్బరావు ఒక్కసారిగా కళ్ల నీళ్ల పర్యంతం అయ్యాడు. నేను ఖంగారుగా ఏమిటి సుబ్బరావు గారూ ఎమైంది అని అడిగాను. నా మనసు పరి పరి విధాలుగా పొయింది. సుబ్బరావు గారి మొహం ఎర్రగా మారింది. మీరు చెప్పింది నెజమే అన్నాడు. ఏ విషయం అన్నాను నేను. మొన్న ప్రైజ్ వచ్చిందని చెప్పానే అది. ఏం జరిగింది అడిగాను నేను. అతడు చెప్పడం ప్రారంభించాడు. నేను మా ఆవిడ ప్రైజ్ తీసుకొవాడానికి ఆదివారం వాళ్లు చెప్పిన హొటల్ కి వెళ్లాము. అది నిజంగానె పెద్ద హొటల్. ఎసి కూడా ఉంది. మమ్మల్ని ఒక హాలు లొ కూర్చొపెట్టారు. ఒక అందమైన అమ్మాయి వచ్చి మీకు ఇంగ్లిష్ లొ చెప్పాలా హిందీ లో చెప్పలా లేక తెలుగు లొ చెప్పాలా అని అడిగింది. నాకు అర్ధం గాక పొయినా తెలుగులొనే చెప్పమని అన్నాను. ముందుగా నాకు వచ్చె జీతం నేను ఎక్కడ పని చేస్తాను లాంటి వివరాలు అడిగింది. తరువాత హైదరాబాదులోని వివిధ ప్రాంతాలలోని ప్లాట్ల విషయాలు చెప్పడం ప్రారంభించి ఏ ప్లాటు తీసుకుంటారు అని అడిగింది. అమ్మా నాకు ప్లాటు తీసుకొనే ఉద్దేస్యం లేదు తీసుకొనే శక్తి ఒపికా లేదు అన్నాను నేను. చాలా సేపు చాలా విధాలుగా చెప్పి చూసింది. నా సంగతి నీకు తెలుసుగా. ప్లాటు కొనే శక్తి లేదని. మరెందుకు వచ్చారని అడిగింది. అదేమిటమ్మా మీరే కదా ప్రైజ్ తీసుకోవడానికి రమ్మని అన్నారు అంటే చాల చులకనగా మాట్లాడింది. నా భార్యా నేను అవమానాన్ని దిగమింగుకుని వచ్చేసాము అన్నాడు. పొలీసు కేసు పెట్టాలిసింది అన్నాను నేను. పొందిన అవమానం చాలు పొలీసు కేసు కూడా ఎందుకు అంది మా ఆవిడ. ఇదే మన బలహీనత వాళ్ల బలం. ఇలాంటి సంఘటనలు ఎప్పటినుండొ జరుగుతున్నాయి అని నాకు తెలుసు. అయినా సుబ్బరావు లాంటి వాళ్ళు మోసపొతూనే ఉన్నారు. ఇది క్రితం నెలలొ మా మిత్రునికి జరిగింది. మరొకరు మోసపొకూడదనే నా తాపత్రయం. "ఉచితం అంటే దూరంగా ఉండడం సముచితం "అన్నది విషయం.

30, జనవరి 2009, శుక్రవారం

తెలుగు బ్లాగులలో వాడి వేడి చర్చలు

ఈ మధ్య రెండు రోజులపాటు నాకు వచ్చిన మెయిల్ చూసుకోలేదు. సరేకదాని కాస్త సమయం కేటాయించి మెయిల్ తెరిచాను. తెరవాగానే బోలెడు ఉత్తరాలు వచ్చి మీద పడ్డాయి. అమ్మో సుమారు నలభై వరకు ఉత్తారాలు. చాలవారు తెలుగు గుంపు నుండి వచ్చినవే. వాటిలో ఏమి ఉందొ అన్న ఆత్రుత ఉన్నా సమయము తక్కువ ఉండే అన్న బెంగతో నెమ్మదిగా చదవటం ప్రారంభించాను. అమ్మో ఉత్తరాలు చాల సుదీర్ఘంగా వాడిగా వేడిగా ఉన్నాయ్. ఎవరో తెలుగు భాషని తక్కువ చేస్తూ వ్రాసినాందుకు, బాధ పడుతూ కొందరు, తిడుతూ కొందరు, వివరిస్తూ కొందరు చాల సుదీర్ఘంగా కొనసాగాయి. అప్పుడే నాకొక సందేహం వచ్చింది. ఎవరో పర భాషలో వ్రాసిన రాతలకి అంత ప్రాధాన్యం ఇవ్వటం అవసరమా అని. తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్ళు ఒక సమూహంగా అభిప్రాయలు పంచుకుంటూ ఉన్నాము. తెల్ల ఆవుల మధ్య ఒక నల్ల ఆవు చేరింది. అంతే. కన్న తల్లి మీద అభిమానం లాంటిదే మాత్రు భాష మీద అభిమానం కూడా. కాని ఇప్పటి పిల్లలు తల్లి దగిర పెరగట్లేదు కదా. పూర్తిగా పరాయి ప్రదేశంలో (హాస్టల్) పెరుగుతున్నారు. వారికి అభిమానం ఎక్కడినుండి వస్తుంది. ఒక మిత్రుడు ఆ రాతలకి తన బ్లాగులో గొళ్ళెం వేసి మరి తూర్పార బెట్టాడు. దీని వల్ల ఆ రాతలకి మరింత ప్రచారం వస్తుంది. అలాంటి రాతలని అలానే వదిలేస్తే ఒకరిద్దరు చూసి ఊరుకుంటారు. ప్రపంచంలో తెలుగు భాష ఒకటి ఉందని తెలియని వారు బోలెడు మంది ఉన్నారు. అంతర్జాలంలో అసభ్య బ్లాగులు వెబ్ లు చాల ఉన్నాయ్. వాటి గురించి చర్చించడం ఎంత అనవసరమో ఇలాంటి రాతలు గుంరించి చర్చించడం అంత అనవసరం. ఇది పలాయన వాదం అనుకునేరు. తెలుగు బ్లాగులు వ్రాస్తున్న వారందరికీ ఒక అభిరుచి ఒక స్థాయి ఉన్నాయి. దానిని మనం అలాగే కాపాడు కుందాము.

28, జనవరి 2009, బుధవారం

ఉత్తమ పొలిటికల్ కార్టూనిస్ట్ గా శేఖర్




తెల్లని ఛాయ, గుండ్రని మొహము, మొహం మీద నవ్వు, ముక్కు మీద కళ్లజొడు, నెత్తిమీద వయసుకు మించిన బట్టతల, బుర్రలో కమ్యునిస్టు భావాలు ఇది నా స్నేహితుడు శేఖర్ని చూస్తే కలిగే భావాలు. పూర్తి పేరు కంభాలపల్లి చంద్ర శేఖర్. తెలుగులో యం ఎ చెసాడు. పుట్టింది నల్గొండ జిల్లా సుర్యాపెటలొ. తండ్రి తెలంగాణా ఉద్యమం లో పాల్గొని జైలుకెళ్ళి వచ్చాడు. తరువాత రైతు గా ఎదిగి చదివించాడు. నిరుపేద రైతు కుటుం వీరిది. శేఖర్ ఆంధ్ర జ్యోతి పొలిటికల్ కార్టూనిస్టు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2006 సంవత్సరానికి ఉత్తమ పొలిటికల్ కార్తూనిస్టు అవార్డు ప్రకటించింది.ఆ సందర్భంలొ మీ అందరికి పరిచయం చేస్తున్నాను.



కార్టూనిస్టుగా ఎలా మారేవు శేఖరా అని అడిగితే బాల్యం లో మా అన్నగారు నన్ను తన ఉద్యోగ రీత్యా వివిధ ప్రదేశాలు తిప్పుతూ చదివించాడు. ప్రతి ఊరిలోని దేవాలయమే నాకు క్రీడా వేదిక. అక్కడి పండితుల దీవెనలు వారి భాషా సాహిత్య వాసనలు నాకు అబ్బాయి. తెలుగు సాహిత్యం అంటే అభిమానం, ఆ అభిమానమే తదనంతర కాలంలో కార్టూనిస్టుగా మారడానికి, మారిన తరువాత కలిగిన ఆత్మ విశ్వాసమే ఈ రంగంలొ నిలదొక్కుకోవాడానికి పురిగొల్పాయి. ఈ క్రమం అంత సులువుగా సాగలేదు. ఆ తరువాత గొప్ప గొప్ప కళాకారులు, సంపాదకులు నన్ను అభిమానించి ప్రొత్సహించారు అంటాడు. రోజూ కార్టూన్లు గీయడానికి ఐడియాలు ఎలా వస్తాయి అంటే గత ఇరవయ్ సంవత్సరాలుగా(ఒక సారి పది రోజులు మినహా) ప్రతి రొజూ కార్టూన్లు వేస్తునే ఉన్నాను. రాజకీయ కార్టూన్లలో టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ని హాస్యభరితంగా, వ్యంగ్యంగా కొట్టాలి. రొజూ రెండైన వెస్తాను. ఒక్కోసారి అవసరాన్ని బట్టి ఎక్కువ వేస్తాము. రాజకీయాలను పరిశీలిస్తూ ఉంటాము గనుక ఏది ముఖ్యమో దాని మీద పని సాగుతుంది. తొంభై శాతం నేనే అయిడియాలు చేస్తాను. ఎడిటర్ తో కూర్చొని దానిని ఫైనలైజ్ చేస్తాము. పది శాతం మానజేమేంట్, ఎడిటర్ చెప్పేవి ఉంటాయి. మరి నువ్వు మెచ్చిన కార్టూనిస్టు ఎవరు అంటే " ఇంగ్లిష్ కార్టూనిస్టుల పేర్లు చెపుతానని ఊహించకండి. నా సమకాలీన ఆర్టిస్టులనందరినీ గమనిస్తూ వారినుండీ నేర్చుకునే ప్రయత్నం చేస్తాను.




ఆది గురువు మాత్రం ఆర్కే లక్ష్మణ్. మనసా వచా కర్మణా వారినే అనుకరిస్తు వచ్చాను. రాజకీయాలు అర్ధం చేసుకొవడంలొగాని, కార్టూన్ ప్రక్రియ వినియొగించడంలొగాని లక్ష్మణ్ గారిని ఫాలో అవుతునే ఉంటాను . తర్వాత బాపూ గారు. నిజానికి నేను బాపుగారి చేత చివాట్లు తిన్నాను. ఆయన స్టైలు అనుకరించే ప్రయత్నం చేస్తునే ఉంటాను . రాజకీయ కార్టూన్లలో అవి ఒదగడంలేదు. డెవిడ్ లో, థామస్ నేస్ట్ , ఆంటేల్నేస్ ల కార్టూన్లంటే, నాకవి మార్గ దర్శకాలే.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పొలిటికల్ కార్టూనిస్టు అవార్డు ప్రకటించింది కదా వాటి వివరాలు ఎమిటి అంటే ఇది నిజంగా నంది అవార్డు లాంటిదే. పేరుతొపాటు అవార్డు మొత్తంగా ప్రభుత్వం లక్ష రూపాయలు ప్రకటించడం కార్టూనిస్టులకి ఆనందమే. రామచంద్రముర్తి గారు, టంకసాల అశోక్ గారులాంటి సీనియర్ సంపాదకులు ఫొన్ చేసి "అవార్డుకి నువ్వు అర్హుడివే" అన్నాక సంత్రుప్తి చెందా. ఐతే మా ప్రయాణం అయిపోలేదు . లోగడ 1999 చైనా డైలీ కార్టూన్ల పోటీలో అంతర్జాతీయంగా ద్వితీయ బహుమతీ వచ్చింది. ఈ పదేళ్లలొ నా పని నేను చేసుకుంటూ పొతున్నాను. ఒక పది ఎగ్జిబిషన్లు, పారాహుషార్, బ్యాంకు బాబు పుస్తకాలు ప్రచురించాను.


మరి మీ కుటుంబం గురించి చెపుతావా శేఖరు అంటే 1985 లో బాల్య వివాహం చేసుకున్న నేను నిరక్షరాస్యురాలైన నా భార్యకు అక్షర జ్గ్యానం నేర్పించి తనని కంప్యూటర్లో పని చేసే సామర్ధ్యానికి తీసుకువచ్చాను. అలాంటి మా శ్రీమతి చంద్రకళ ఇవాళ అనుక్షణం నన్ను నడిపించే చోదక శక్తిగా మారింది. మా అబ్బాయి నందు బి.టెక్ చదువుతున్నాడు. మా పాప చేతన చదువులతో పాటు సాహితి కళా రంగాలలో దిట్ట. హైదరాబాద్ లోని ఉప్పల్లో ఒక చిన్నగూడు కట్టుకున్నాను. మరి కొన్ని నిజాలు చెపుతాను. అన్ని వృత్తులలో ఉన్నట్టే కార్టూనింగ్ లో కూడా నొప్పి ఉంది. సాటి కళాకారుల రాజకీయాలు ఉన్నాయ్. ఆఫీసులో బలి కావడాలు ఉన్నాయ్. నిరంతరం వేగం, ఒత్తిడి, మానసిక ప్రశాంతతని దూరం చేసి క్వాలిటి వర్క్ అందించలేని దుస్తితి ఉంది. ఇతర కళాకారులను పనిలో అందుకొనేందుకు చేసే ప్రయత్నం లో అపజయాలు ఉన్నాయ్. అందుకోలేకపోతున్నందుకు దిగులు ఉంది. మానసిక అశాంతితో పాటు ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడాలు ఉన్నాయ్. లేకపోతె ఇన్నివేల కార్టూన్లు వేసినందుకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేదే. ఇన్ని ప్రతికూల పరిస్తులలో అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి గుర్తింపుల వల్లే రీచార్జ్ అవుతున్నాము. మీలాంటి సన్నిహిత మిత్రుల సహచర్యం గొప్ప షీల్డ్ గా ఉండి కాపాడుతోంది. శేఖర్ ఇలాంటి అవార్డులు మరిన్ని అందుకోవాలని కోరుకుంటూ ... అభినందనలతో... సమీహ

23, జనవరి 2009, శుక్రవారం

చదువులు మారాయి

మా చిన్నప్పుడు చదువులు కేజీలలో చడువుకుంతారుట అని ఆశర్యంగా చెప్పుకొనేవారు. కాని ఇప్పుడు జీబీ ( కంప్యూటర్ల కొలమానం) లలో చదువుకొంటున్నారు. కార్పోరేట్ స్కూల్స్ రూపాంతరం చెందుతూ కాన్సెప్ట్ స్కూల్స్, టెక్నో స్కూల్స్ వృద్ధి చెందుతున్నాయి. కార్పోరేట్ సంస్కృతి వృద్ధి చెందడానికి కారణాలు మాత్రం ప్రభుత్వ విధానంలోని లొసుగులు ఇంకా ఉపాధ్యాయులు. మా చిన్నప్పుడు ఉపాధ్యాయుడంటే ఊళ్ళో డాక్టర్ కి ఎంత గౌరవం ఉండేదో ఉపాధ్యాయుడంటే అంత గౌరవం ఉండేది. బడిలో టీచర్ కొట్టిందని అమ్మ నాన్నలకి చెప్పాలంటే భయంగా ఉండేది. నువ్వేం తప్పు చేసావో అని మళ్ళి అమ్మ నాన్నలు కోడతరాని. రోజులు మారాయి. ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా కాకుండా కిరాతకులుగాను చెప్పలేని చేష్టలతో ఉంటున్నారు. నిజంగా విద్యార్ధికి భయం చేపుదామన్నా అటు తల్లి దండ్రులు కూడా ఒప్పుకోవడంలేదు. ఇలాంటి పరిస్తుతులలో మా అబ్బాయ్ ని ఒక టెక్నో స్కూల్ లో చేర్చాలని మా ఆవిడ పోరు పెడితే ఆ స్కూల్ చూడటానికి వెళ్ళాము. టెక్నో స్కూల్ అంటే ఆరవ తరగతి నుండి IIT కి సరిపడే విధంగా పిల్లలని తయారు చేస్తారుట. మా ఆవిడ చెప్పింది. కొత్త హంగులతో బాగానే ఉంది. ఉపాధ్యాయుల స్థానాలలో అన్ని చోట్లా కంప్యూటర్లు ఉన్నాయ్. తరగతి గదులలో ప్రొజెక్టర్లు ఉన్నాయ్. సినిమాలలో లాగ తెరలు కూడా ఉన్నాయ్. రిసెప్షన్ లో ఉన్న అమ్మిని అడ్మిషన్ విధానం ఎలా అని అడిగాను. మీ అబ్బాయి ఎంట్రన్స్ టెస్టు వ్రాయాలని చెప్పింది. దానికి ఫీజు ఏమైనా ఉందా అని అడిగితె ఫ్రీ సార్ అని చెప్పి అక్కడ అప్లికేషను తీసుకోండని మరో చోటు చూపించింది. అక్కడికి వెళ్లి క్యు లో నిలబడ్డాను. నా వంతు వచ్చాక కౌంటర్ లోని అమ్మి ఐదు వందలు ఇమ్మని అడిగింది. అదేమిటి ఎంట్రెన్స్ ఫ్రీ అన్నారుగదా అన్నాను. అవును సార్ , ఎంట్రెన్స్ టెస్టు ఫ్రీ , దరఖాస్తు మాత్రమె కొనాలి అని చెప్పింది. ఎంట్రెన్స్ లో పాస్ ఐన తరువాత గదా దరఖాస్తు అవసరం అన్నాను. కాదు ఎంట్రెన్స్ టెస్ట్ వ్రాయాలంటే దరఖాస్తు కొనాలని అమ్మి చెప్పింది. దీనిలో లాజిక్ ఆలోచిస్తుంటే మా ఆవిడ నా పర్సులోంచి డబ్బులు తీసే అమ్మి చేతిలో ఉంచింది. మరుసటి రోజు ఉండయాన్నే మా వాడి చేత ఆరవ తరగతికి ఎంట్రన్స్ రాయించాను. టెస్టు పూర్తి కాగానే మా వాడిని ఎలా వ్రాసావని అడిగాను. దానికి మా వాడు "నువ్వు ఈ స్కూల్ లో ఎందుకు చేరాలని అనుకుంటున్నావు అని అడిగారు" అన్నాడు. మరి ఏమి సమాధానం వ్రాసావని అడిగితె " మా పాత స్కూల్ లో పెద్ద ప్లే గ్రౌండ్ లేదు కాబట్టి" అన్నాడు వాడు. ఆరవ తరగతి కి వాళ్ళు అడిగే ప్రశ్నలు, వీడి సమాధానాలు ఏమి అనాలో అర్ధం గాక మాట్లాడక ఊరుకున్నాను. రెండవ రోజు అదే స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. మీ వాడు ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ ఐయ్యాడు వచ్చి ప్రిన్సిపాల్ ను కలవమని. ఈ లోగ నాకు తెలిసిన విషయం టెక్నో స్కూల్ లో ఒకటవ తరగతి కూడా ఉందని. అంటే మొదటి తరగతి నుండి కూడా IIT కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పేస్తారా? అప్పటి నుండి నా మనసు మనసులో లేదు. స్కూల్ నుండి ఫోన్లు ఆగట్లేదు వచ్చి ఫీజు కట్టమని. నేను ఏమి చేయాలో అర్ధంగాని పరిస్తితి. టెక్నో మాయలో అందరిలాగే కొట్టుకు పోవడమేనా? అవును మరి చదువులు మారాయి. ఉపాధ్యాయులు మారారు. మనమూ మారాలి గాబోలు.

14, జనవరి 2009, బుధవారం

సంక్రాంతి అల్లుడు


11, జనవరి 2009, ఆదివారం

కధా రచయిత శ్రీ సత్యవోలు సుందర సాయి తో పరిచయం



తూర్పు గోదావరి జిల్లలో శోభాయమానమై, సుభిక్షమై అలరారే ఆలమూరు కవి, పండిత, నట, గాయక, రచయితలకు నిలయం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన బ్రహ్మశ్రీ పురాణపండ రామ్ముర్తి గారు, అనేక వేద పండితులు పోలాప్రగడ, ఉషశ్రీ, నృశి౦హదేవర, చామర్తి, సుసర్ల, పోతుకూచి , పోరంకి వంటి ఉద్ధండ రచయితలు వెలసిన పుణ్యభూమి. గ్రామంలో నాలుగు చెరువులు ప్రజా అవసరాలకు నిండుగా నిలిచి పాడి పంటలతో గ్రామం విరాజిల్లడానికి కారణభూతం అయ్యాయి. గోదావరి నది నుండి ధవళేస్వరం వద్ద విడి వడిన పెద్ద కాలువ ఆదికవి నన్నయగారి నానాసూక్తినిధిని ఆలమూరు చెంతనే ప్రవహింపచేస్తోంది. శ్రీహరి స్వరూపులైన వైద్యులు జొన్నాడ డాక్టరుగారు, చలపతిరావుగారు వంటి వారు ప్రజారోగ్య పరీక్షలు, సేవలు అందించిన పునీత గ్రామం. భట్టి విక్రమార్క, జనార్ధన, ఆంజనేయ, షిర్డీ సాయి, సుబ్బరాయుడు, బంగారు పాప దేవాలయాలు భక్తికి సోపానాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ భవ్య వాతావరణంలో ఆ దివ్య మూర్తుల మధ్య జన్మించడం ఒక వరంగా భావిస్తున్నాను అంటారు సత్యవోలు సుందర సాయి గారు. సర్వమత , సర్వ కుల ఐక్యత ని౦డుగా నెలకొన్న మా ఆలమూరు సకల కళలకు పుట్టినిల్లు అంటారు అయన. ఒకప్పుడు ఆలము (యుద్ధము) జరిగిన ప్రదేశము కాబట్టి మాకు ఆవేశం సహజ లక్షణం అనేది కుడా వారి నోటి నుండి వచ్చే మాట.

సుందర సాయి గారు మీరు రచయితగా ఎప్పుడు మారేరు? ఆ సందర్భం ఏమిటి?
1976 వ సంవత్సరం నా జీవిత సమరహేల నన్ను రచయితగా మార్చింది. తండ్రిని కోల్పోయి బ్రతుకుతెరువు కోసం రోడ్డున పడిన నన్ను ఈ రచనా వ్యాసా౦గమే నన్ను మనిషిగా నిలిపింది. సమాజంలోని రుగ్మతలు ... వాటిని గమనించిన నాలో ఆవేశాన్ని కలిగించాయి. గుండె గుహలో గంపెడంత శోకాన్ని భరిస్తూ ... ఎగసి వచ్చే భావాలను అదిమి పెట్టలేక వాటిని వ్యక్తీకరించే క్రమంలో రచయిత నయ్యాను. కొందరి క్రౌర్యానికి పతితలుగా మారే యువతుల గాధలు స్వయముగా గమనించాను. అగాధాలు... వ్యధాపూరితాలు... వాటిని కధల రూపంలో మలిచాను. ఆ వ్యధా మూలాలను పాఠకులకు అందించాను. ఆ తర్వాత ఎన్నో సంఘటనలు నన్ను నిద్రపోనివ్వలేదు. అలజడిని, అశాంతిని కలిగించాయి. హృదయంలోని మధనం రచనలద్వారా బహిర్గతం అయింది.

మీ కుటుంబంలో మీ ముందు రచయితలు ఎవరైనా ఉన్నారా?

నా కుటుంబంలో రచయితలు లేరనే చెప్పాలి. కాని రచనలవైపు ఆసక్తిని పెంచిన వ్యక్తీ మా అన్నయ్య కేశవకుమార్. మా అమ్మగారు సీతాసుందరం బహుముఖ ప్రజ్గ్యశాలి . దాదాపు ఎనిమిది వందల పద్మాలు ఆమె నోటికి వచ్చేవి. రామాయణ, మహా భారతాలు బాగా చదివిన నా మాతృమూర్తి భగవద్గీతను, పోతనగారి భాగవతాన్ని క౦ఠొపాఠ౦గా చేసారు. ఆవిడ సాహిత్య సంస్కారం నాకు ఆమె ఆశీర్వాద ఫలితంగా లభించింది. సకల జనులు సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలనే ఆమె ఆకాంక్ష నన్ను ప్రజాప్రయోజనల లక్ష్యం వైపు మరల్చింది. నాన్నగారు, అమ్మ, సోదరుడు - ప్రస్తుతం నా పిల్లలు చి.శారద, శిరీష , ప్రదీప్. స్వాతి, శ్రీవల్లి అందరు నన్ను ప్రేమించే వారె. ఇంక ఎందరో స్నేహితులు నిత్యం నాకు కధాంశాలు అందిస్తూనే ఉన్నారు.

సాహిత్యం తో పరిచయం ఎలా ఏర్పడింది?
గ్రామమంతా సాహిత్య పరిమళం, కుటుంబంలో సంస్కార భావజాలం, పోలాప్రగడ, జీడిగుంటవారు ఆదర్శం. సాహిత్య సంపదకు ఇల్లే నిలయం. కవుల శతకాల జల్లు అమ్మ హృదయం. అందర్నీ అలరించే కధాగమనం సోదరుని నైజం. విలువైన విమర్శలకు నెలవు, ఒదిగిన వాక్ చాతుర్యం అన్ని అబ్బురమే - ఆశ్చర్య జనితమే. ఇల్లాలి అనునయం, ఉత్తేజ౦ కలిగించే పిల్లల ప్రవర్తనం, ఇక ఈ సాయికి సాహిత్యంతో పరిచయం సాధారణ అంశం.
ఇంతవరు మీరు ఎన్ని కధలు వ్రాసేరు? మీ మొదటి కధ ఏది?
రమారమి రెండు వందల దాక కధలు వ్రాసిన జ్జ్యాపకం. ఆరు నవలలు ముద్రితం అయ్యాయి. వంద కధలు మానవీయ విలువలకి సంభందించినవి. ఈనాడు ప్రతినిధిగా ప్రజా సమస్యలమీద ఐదేళ్లపాటు న్యూస్ బ్యూరో తరపున వందలాది ప్రజా సమస్యలపై పరిశోధనాత్మక నివేదికలు, ఆకాశవాణిలో నాటిక, రూపకం, కధా, కవిత, వార్త విశేషాలు అసంఖ్యాకంగా వ్రాశాను. ఇక దూరదర్శన్ - నా అభిమాన సంస్థ. ఎన్ని వ్రాశానో లెక్క వెయ్యలేదు. గత 27 వత్సారాలలో దాదాపుగా అన్ని విభాగాలలో పని చేశాను. నా కాగితం కలం దూరదర్శన్ కోసం వ్రాయడానికి తహతహ లాడతాయి. నా మొదటి కధా 1976 లో ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. ఆ కధా పేరు "రింగులు"
దూరదర్శన్ లో మీ భాద్యతలు ఎలా ఉన్నాయ్?
దూరదర్శన్ లో భాద్యతల కంటే అంకితభావం ముఖ్యం. అధికారం ఎలా మారిన నా వృతి ధర్మం - ప్రజా సంక్షేమం - అదే మూల సూత్రం. ప్రభుత్వ సంస్థలన్నీ ఒకేలా ఉంటాయి. మనుషులు .. మనస్తత్వాలు సర్వ సాధారణంగా అధికార పటాటోపాన్ని ప్రదర్సిస్తాయి. కొంచం అసహజమైనా వాటిని తట్టుకోవాలి. దూరదర్శన్ కార్యక్రమాల అవసరాల మేరకు మనసును స్వీయసంవిధనాన్ని మలచుకుంటూ ఓర్పుగా సాగడం అలవాటైంది.
రాష్ట్ర ప్రభుత్వం మీకు బంగారు నందిని బహుకరించింది కదా. వాటి వివరాలు చెపుతారా?

చెదలు అనే టెలిఫిలిమ్ - సామాజిక సంభందిత అంశం కేటగిరిలో ప్రధమ ఉత్తమ చిత్రంగా ఎంపిక అయింది . స్వర్ణ నందిని గెలుచుకుంది. దర్శకత్వానికి నాకు కూడా ఆ పురస్కారం లభించింది. "చెదలు" గురించి కొద్దిగా చెపుతాను. పంటను కాపాడుకొనే ప్రయత్నంలో ఒక బక్క రైతు దిక్కుతోచక చేసే అప్పులు, వాటి మీద వడ్డీలు, తద్వారా సమస్యలు ఇందులో పొ౦దుపరచారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దోపిడీ , కష్టానికి ఫలం లభించినా మార్కట్లో తృణమో ఫణమో ధరకు రాజీపడటం. ఇదే కధాంశం.

దూరదర్శన్లో కార్యక్రమాలు ఎలా ఉన్నాయ్? ఎలా ఉండాలని మీ అభిప్రాయం?

దూరదర్శన్లో కార్యక్రమాలు ఎప్పుడూ బాగుంటాయి. ఇతర చానళ్ళతో పోల్చడం సరి కాదు. ఎన్నో రుచులు ఉంటాయి. అన్నీ ఒకేలా ఉండవు. ఇది ప్రభుత్వ ఛానల్ . ప్రజా ప్రయోజనమే ధ్యేయం. సంచలనం, అవాస్తవం వంటి వాటికి దూరదర్శన్ దూరం. మా కార్యక్రమాలు ఇంకా మెరుగావ్వాలి. దానికి ప్రభుత్వ సంవిధానంలో మౌలిక మార్పులు జరగాలి.

టీవీ చానల్స్ లో మీకు నచ్చిన కార్యక్రమం ఏది?

నాకు నచ్చిన కార్యక్రమం, నచ్చని కార్యక్రమం అంటూ లేవు. అన్ని మంచి కార్యక్రమాలు నచ్చుతాయి.
మీకు నచ్చిన పుస్తకం వాటి వివరాలు చెపుతారా?
దేవరకొండ బాల గంగాధర్ తిలక్ కధల సంపుటి. మానవత్వ విలువలకు పెద్ద పీట వేసి సమాజంలోని సంకుచిత ధోరణులను ఎండగట్టి అద్భుత కధాగమనన్ని కనులముందుంచి రసవత్తరంగా కధా శిల్పాన్ని మలచి పాఠకుల హృదయాలను రాగ రంజితం చేసి సమాజ సర్వతోముఖ వికాసానికి సాహిత్యాన్నినిలిపి తెలుగు కధా వినీలాకాశంలో అద్భుతమైన అశాలను పండించి ఇది తెలుగు కధ, మన కధ, శభాష్ అనిపించి, అనేక సమాజహిత అంశాలను సృజించి కధలుగా రుపొందించి, మనకు అపురూపంగా అందించి , తెలుగు కధా చరిత్రలో సుస్థిరంగా నిలిచిన బాలగంగాధర్ తిలక్ కధలు మరపు రానివి.
సత్యవోలు వారికి ధన్యవాదాలు చెప్పి శెలవు తీసుకుంది సమీహ.
( అక్షర దోషాలుంటే మన్నించండి - సమీహ )


10, జనవరి 2009, శనివారం

ఒక కల చెదిరింది

సత్యం కంప్యూటర్స్ అధినేత రాజుగారు మొన్నటివరకు ఎందఱో యువకులకు అరాధ్య దైవం. సంస్థ అభివృధికి ఆయన పడ్డ శ్రమ వింటున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆయన ఒక ఋషి అనుకొన్నారు. ప్రతి ఒక్కరు ఆయనలా కావాలని కలలు కన్నారు. రాష్ట్రానికే తలమానికంగా దేశానికి ఒక కలికి తురాయిలా సత్యం సంస్థ అభివృద్ది చెందినప్పుడు ప్రతీ ఒక్కరు తామే అభివృద్ధి చెందినట్టు తలంచారు. దేశ విదేశాలలో భారత ఖ్యాతి వ్యాపింపచేసిన సంస్థగా సత్యం కంప్యూటర్స్ నిలిచింది. 108 వాహన సేవలు ప్రారంభించినప్పుడు సత్యం కంప్యూటర్స్ ఒక దేవాలయంగా కనిపించింది. కాని అప్పుడే ఆయనలో మరో మనిషి ప్రవేసించాడని బహుశా ఆయనకికుడా తెలిసుండదు. అప్పుడే ఆయనలో ఒక రాజకీయ నాయకుడు ప్రవేశించి ఉంటాడు. సంస్థకి ఉన్నమంచి పేరును డబ్బుగా మార్చుకొనే దుర్భుద్ధి కలిగించి ఉంటాడు. సులభంగా కోట్లాది రూపాయాలు సంపాదించే దురాలోచన కలిగించి ఉంటాడు. అప్పటిను౦డే ఆయనలోని సత్యం బహుశా తప్పుకొని ఉంటాడు. సత్యం అసత్యం కాకుండా ఉంటే ఎంత బాగుండేది? ఇదంతా ఒక కలే , నిజం కాదు అని ఎవరినా చెపితే బాగుండేది. ఇప్పటికి ఆయనమీద అపనమ్మకం కలగట్లేదు. ఒక మంచి మనిషి మహిషిగా మారడం ....... ఒక కల చెదిరింది.

7, జనవరి 2009, బుధవారం

రైలు ప్రయాణం గగన కుసుమమే అవుతోంది ఎందుకని?

ఈ మధ్య కాలంలో రైలు ప్రయాణం అంటేనే దడ పుడుతోంది. వైటింగ్ లిస్టు చూస్తుంటే మూర్ఛ వచ్చేట్టు అవుతోంది. సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు పొడవాటి వైటింగ్ లిస్టే ఉంటోంది. అకస్మాతు గ వచ్చే ప్రయాణాలకి రైళ్ల మీద ఆధారపడటం మరచిపూవటం మేలనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటాని తెలిసిన మిత్రునివద్ద కొద్దిపాటి గూఢచర్యం చేశాను. రైళ్ళలో తత్కాల్ క్రింద ప్రతి రైలులో దాదాపు రెండు వందల పది బెర్తులు రైల్వేవారు ముందే అడ్డుకొని ఆఖరు నిమిషంలో ఎక్కువ ధరకి అమ్ముకొంటున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇవి పోను మిగిలిన టిక్కట్లను రైల్వే సిబ్బంది చేతి వాటం చూపిస్తున్నారు. వీరు వివిధ పేర్లమీద, వివిధ వయసులతో టిక్కట్లు కొనేసి తమదగ్గారే అట్తెపెట్టుకొంటున్నారు. వీరు ఆ టిక్కట్ట్లను ఏజెన్సీలకు ఎక్కువ రేట్లకు అమ్ముకొంటున్నట్టు విషయ సేకరణలో తేలింది. రద్దీగా ఉండే తేదీలలో టిక్కట్లను వీరు ఎక్కువగా కొని తమ దగ్గర ఉంచుకొని అదనపు సంపాదన చేస్తూ ప్రయాణికులని ఇంక రైల్వే శాఖని మోసగిస్తున్నరు. దీనికి ఒక్కటే మార్గం. ప్రయాణీకులు ఎవరైనాసరే బయట టిక్కట్లు కొనకుండా కేవలం వైటింగ్ లిస్టు టిక్కట్లు మాత్రమె కొని ఊరుకొంటే ఈ వీరి పైత్యం తగ్గుతుంది.

2, జనవరి 2009, శుక్రవారం

ధర్మ సందేహాలు

ధర్మ సందేహాలు కార్యక్రమం నిజానికి రేడియో కాన్సెప్ట్. ఉషశ్రీ ధర్మ సందేహాలు విజయవాడ రేడియో కేంద్రం నుండి ఆదివారాలలో ప్రసారం అవుతున్నప్పుడు ఒకచోట బయలుదేరిన వ్యక్తి ఇంటికి చేరేదాక ఆ కార్యక్రమాన్ని వినేవాళ్ళం. అంటే ఆ విధంగా అన్ని ఇళ్ళల్లో రేడియో లో ఆ కార్యక్రమాన్ని వినే వాళ్ళు. అదే కాన్సెప్ట్ ని దూరదర్శన్ తీసుకొని మరలా ప్రారంభించింది. ఆ కార్యక్రమాన్ని పురాణ వాచస్పతి శ్రీ శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారితో ప్రారంభించింది. ఈ కార్యక్రమ౦ దూరదర్శన్లో ప్రసారం అవుతున్న మొదటి రోజుల్లో చాల మందికి టెలిఫోన్ లైన్ దొరికేదికాదు. లైన్ దోరకడానికే చాల ప్రయాస పడాల్సి వచ్చేది. చంద్ర శేఖర శాస్త్రి గారి క౦ఠ౦లొని గంభీరత్వం అందరిని మంత్ర ముగ్దుల్నిచేసేది. ఆ తరువాత స్థానం మైలవరపు శ్రీనివాసరావు గారిది. కందడై వారు కూడా ప్రేక్షకులని బాగానే అలరించారు. కొన్ని విషయాలలో దూరదర్శన్ కి ఉండే నిబంధనలు కార్యక్రమాలకి ఆటంకం కలిగేలా ఉన్నాయ్. పదమూడు ఎపిసోడ్స్ మించి ఎవరిని కార్యక్రమాలలో ఉంచకూడదు. దీని వల్ల లబ్ద ప్రతిస్తులైన వారిని కూడా కార్యక్రమాలలో కొనసాగించడం కుదరక కార్యక్రమాలలో వన్నె తగ్గుతోంది. కనీసం ఇటువంటి కార్యక్రమాల కైనా నిబంధనలు సడలించాలి. విషయ పరిజ్ఞ్యానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలి కాని నిభందనలకి కాదు. ఈ విషయంలో దూరదర్శన్ తగు నిర్ణయం తేసుకోవాలి. హిందూ ధర్మాన్ని రక్షిస్తూ ఆచారాల్ని పాటించటానికి ఇటువంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలి.

"మువ్వల సవ్వడి" తో దూరదర్శన్

టీవి చానల్స్ లో రికార్డింగ్ డాన్సులు చూసి చూసి విసిగిపోఇన ప్రేక్షకులందరికీ దూరదర్శన్ చక్కని అభి రుచితో కూడిన కార్యక్రమం ప్రసారం చేస్తోంది. అదే మువ్వల సవ్వడి. తెలుగునాట నానాటికీ కనుమరుగవుతున్న సాంప్రదాయక నృత్య కళలని ప్రజల ముందు ఆవిష్కరిస్తూ భరత నాట్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియచేస్తున్న కార్యక్రమం మువ్వల సవ్వడి. ఈ కార్యక్రమానికి సారధ్యం వహిస్తున్నది దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి యార్లగడ్డ శైలజ. చూడ చక్కని సెట్టింగ్ లో ఒకనాటి సినీ హీరోయిన్ శ్రీమతి ప్రభ ఈ కార్యక్రమానికి సంధాత గ వ్యవహరిస్తుండగా ఎందఱో ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిధులుగా విచేస్తున్నారు. రాష్ట్రము నుండే గాకుండా దేశ నలుమూలల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కళాకారులు వస్తున్నారు. దూరదర్శన్ లో ప్రతి ఆదివారం రాత్రి 8.30 ని. కు ప్రసారం అవుతోన్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చూసి తీరవలసిందే.

1, జనవరి 2009, గురువారం

కొత్త సంవత్సరంలో నా కొత్త నిర్ణయం

కొత్త సంవత్సరం వస్తోంది. ప్రతీ ఒక్కరు చాల హుషారుగా ఉన్నారు. ప్రభుత్వాలు, పోలిసులు కొత్త కొత్త నియమాలు నిబధనలు పెట్టుకుంటున్నారు. అందిరికి చలా ఆశ, అన్ని మంచిగా మారిపోవాలని. నా మదిలో తళుక్కున ఆలోచన మెరిసింది. కొత్త సంవత్సరం లో నేను కూడా కొత్త జీవితం ప్రారంభించాలి. నా జీవితాంలో ఇకనుండి పాత జీవితానికి కొత్త జీవితానికి చాల తేడా ఉండాలి. మంచి అలవాట్లు చేసుకోవాలి. మరి నాకున్న చెడు అలవాట్లలో పొగ త్రాగటం ఒక్కటే. నాకిస్టమైన చార్మినార్ బ్రాండు సిగరెట్టు త్రాగటంలో ఉండే మజా దేనిలోనూ లేదు. కాని మా ఆవిడకి ఆ వాసన అస్సలు నచ్చదు. మీరు వస్తున్నారని ముందే తెలుసి పొతుంది లెండి అంటుంది. ఎలాగా అని అడిగితె మీ కన్నా ముందు పొగ వాసనే చెపుతుంది, మీరు వస్తున్నారని అంటుంది. పిల్లలు కూడా నా స్మోకింగ్ గురించి గొడవ చేస్తూనే ఉంటారు. ఇంతమందికి కష్టమైన నా చార్మినార్ బ్రాండ్ సిగరెట్ ధూమ పానం వదిలేస్తే? ఆహ ఏమి ఆలోచన? నిజంగా ఇంటిలో అందరు ఆనందిస్తారు. నా నిర్ణయానికి నేనే సంబర పడ్డాను. మరి ఈ రోజు ఆఖరి రోజు నా చార్మినార్ బ్రాండు సిగరెట్ ధూమ పానానికి. చివరిగా రోజు తీసుకొనే పాన్ డబ్బా దగ్గిర చార్మినార్ సిగరెట్టు తీసుకొని గుండెల నిండా పొగ పీల్చాను. స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది. భారంగా ఇంటికి కదిలాను. కొత్త సంవత్సరం మొదటి రోజు వఛేసింది. నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే ఉండాలనే అనుకున్నాను. నెమ్మదిగా బయటకి వచ్చేను. ఇంటి బయట పాన్ డబ్బా వాడు నన్ను చూసి చార్మినార్ సిగరెట్ బయట పెట్టాడు. నేను తల అడ్డంగా ఉపేను. వాడు ఆశ్చర్యంగా ఏం సార్ సిగేరట్లు మానేసారా అని ఆందోళనగా అడిగాడు. అవును అన్నాను. వాడు చాల నిరాశ పడినట్లు స్పష్టంగా తెలిసింది. నా నిర్ణయానికి నేనే గర్వ పడి "చార్మినార్ సిగరెట్టు మానేసాను గోల్డ్ ఫ్లేక్ ఇయ్యి " చెప్పాను.